పలికే వారెవరు…?

రండి మనమంతా కలిసి ప్రాంతీయ పార్టీల కూటమి కడదామంటూ మమత బెనర్జీ పిలుపునిచ్చారు. అంతటి పెద్ద విజయం సాధించిన ఆమెకు లాంఛనంగా అభినందనలు తెలిపిన నాయకులు ఈ [more]

Update: 2021-05-04 16:30 GMT

రండి మనమంతా కలిసి ప్రాంతీయ పార్టీల కూటమి కడదామంటూ మమత బెనర్జీ పిలుపునిచ్చారు. అంతటి పెద్ద విజయం సాధించిన ఆమెకు లాంఛనంగా అభినందనలు తెలిపిన నాయకులు ఈ విషయంలో మాత్రం కిమ్మనడం లేదు. వాస్తవాలు వారికి తెలుసు. ప్రాంతీయ పార్టీలన్ని కలిసికట్టుగా జాతీయ కూటమి కట్టడం సాధ్యపడే పని కాదు. ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు. నీటి వనరులు మొదలు , వ్యాపార, రాజకీయ ప్రయోజనాల వరకూ అనేక రకాలైన ఆటంకాలు ఉంటాయి. ఒకే మాట-ఒకే బాటగా కలిసి నడవడం వల్ల ప్రత్యేకించి తమకొచ్చే ప్రయోజనాలేమీ ఉండవు. తమ తమ రాష్ట్రాల్లో నిలదొక్కుకుంటే అదే చాలు అనుకునే నాయకులే ఎక్కువ. అందులోనూ బీజేడీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వంటి ఒకరిద్దరు నేతలు తప్ప అందరూ గురివింద గింజలే. వారిపై కేంద్రం తన దర్యాప్తు సంస్థలతో ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియదు. మరో మూడేళ్ల పాటు ప్రదానిగా మోడీ పదవికేమీ ఢోకా లేని నేపథ్యంలో కొరివితో తలగొక్కునేందుకు ఎవరూ సిద్దం గా లేరు. మమతా బెనర్జీ గెలిచిన ఉత్సాహంతో ఊహా ప్రపంచంలో వ్యాఖ్యలు చేస్తున్నారు తప్పితే కార్యరూపం దాల్చే అంశంగా కనబడటం లేదు.

ఆ రెంటికీ దూరం…

దేశంలో ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో జాతీయ పార్టీల పాత్ర, ప్రమేయం లేకుండా ఎన్నడూ సాధ్యం కాలేదు. కేంద్ర స్థానంలో నాయకత్వం బాధ్యతలో ఒక జాతీయ పార్టీ ఉంటే దాని చుట్టూ ప్రాంతీయ పార్టీలు జమ కూడతాయి. ఆయా రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ జాతీయ పార్టీ సమన్వయ కర్త పాత్రలో ఉంటుంది. అందువల్ల రాజకీయంగా ప్రాంతీయ పార్టీల నాయకులు తమ రాష్ట్రాల్లో సర్ది చెప్పుకునే ఆస్కారం ఉంటుంది. కాంగ్రెసు, కమ్యూనిస్టు లు కాకుండా ప్రాంతీయ పార్టీలే జట్టు కట్టాలనేది మమత ప్రతిపాదన. వాటిని కూడా కలుపుకుంటే తన రాష్ట్రంలో వాటికి సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. పైపెచ్చు మైనారిటీ ఓటు బ్యాంకు వారి నుంచి వచ్చిందే. వారితో కలయిక వల్ల తనకు పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రాంతీయ పార్టీలు మాత్రమే కలవాలనేది ఆమె అభిమతం. కానీ ఇరుసు వంటి పెద్ద పార్టీ ఒక్కటి కూడా లేకుండా చక్రం తిప్పాలనుకోవడం అత్యాశే. అందులోనూ నిజంగానే జాతీయ ప్రయోజనాలు ఆశిస్తే వ్యక్తిగత , స్వార్థప్రయోజనాలు మమత పక్కన పెట్టాలి. కానీ ఆ కోణంలో ఆమె ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. తనకు ఎప్పటికో ఒకప్పటికి బీజేపీ గండం తప్పదు కాబట్టి జాతీయ స్థాయిలో ఆ పార్టీని ఇరుకున పెట్టాలనేది ఆమె ఆలోచన.

అహంకారమే అడ్డుగోడ…

ఎన్డీఏ లో బీజేపీని , యూపీఏలో కాంగ్రెసును తమ సారథిగా ప్రాంతీయ పార్టీలు గుర్తిస్తాయి. వాటి వెనక ఉన్న ప్రాతిపదిక, దేశవ్యాప్త విస్తరణ అందుకు కారణం. ఇప్పుడు మమత ప్రాంతీయ పార్టీల కూటమి కడితే ఎవరు నాయకత్వం వహిస్తారనేదే పెద్ద ప్రశ్న. మమత ఆదిపత్య ధోరణి గురించి అందరికీ తెలుసు. ఎక్కడా, ఏ కూటమితోనూ దీర్ఘకాలం కలిసి నడవలేరు. ఆమె అనుకున్నదే జరగాలనుకునే వైఖరి. అందరిని ఒప్పించేంతటి సమన్వయం, సంయమనం ఆమె వద్ద లేవు. చంచలమైన రాజకీయ నిర్ణయాలు, విమర్శలతో దూకుడుగా వ్యవహరిస్తుంటారు. దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్న కూటమికి ఆమె శైలి ఎంతమాత్రం ఉపకరించదు. ఇప్పటికే డీఎంకే, ఆర్ జెడీ, ఎన్సీపీ, ఏఐడీఎంకే వంటి పార్టీలు ఏదో ఒక కూటమిలో కొనసాగుతున్నాయి. బీజేడీ, టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ వంటి పార్టీలు మమతతో సాగేందుకు సానుకూలంగా లేవు. బీఎస్పీ మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ లు ఉత్తరప్రదేశ్ లో తమ పునరధికారంపైనే ద్రుష్టి పెట్టాలనుకుంటున్నారు. జాతీయ స్థాయి ఆశలతో కొత్త తలనొప్పులు తెచ్చుకునేందుకు సిద్దంగా లేరు. అన్నిటికంటే మించి మమత ప్రవర్తించే తీరు రాజకీయాల్లో జాతీయ ఐక్యతకు ప్రదాన అవరోధంగా విశ్లేషకులు చెబుతున్నారు.

నేల విడిచి సాము…

నిజానికి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ లో గట్టి పోటీనే ఎదుర్కోబోతున్నారు. వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాటల్లోనే చెప్పాలంటే గెలుపు సాధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. బీజేపీ బలహీనతలు తృణమూల్ కు అసెట్ అయ్యాయి. బీజేపీ రాష్ట్ర పార్టీ నాయకుల్లో విభేదాలు, దీదీకి పోటీగా ముఖ్యమంత్రి అభ్యర్థిని చూపించలేకపోవడం, కేంద్ర బలగాల అత్యుత్సాహం , ఎన్నికల కమిషన్ అతి జాగ్రత్తలు వెరసి పశ్చిమబెంగాల్ పై ఢిల్లీ నుంచి దాడి జరుగుతోందన్న భావన ప్రజల్లో ఏర్పడింది. మమతకు తగిలిన గాయమూ సెంటిమెంటును రగిలించింది. ఇంకోవైపు కరోనాను కేంద్రం కట్టడి చేయలేకపోయిందన్న భావమూ, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు , మైనారిటీల సంఘటిత ఓటు బ్యాంకు కలగలిసి మమతకు పట్టం గట్టాయి. అయితే వామపక్షాలు, కాంగ్రెసును నామమాత్రం చేసి బీజేపీ పశ్చిమబెంగాల్ లో బలమైన పునాదులు వేసుకోగలిగింది. భవిష్యత్తులో మమతకు బలమైన ప్రత్యామ్నాయమే ఎదురుచూస్తోంది. అందువల్ల సొంత గడ్డపై ద్రుష్టి పెట్టి పటిష్ఠం చేసుకోకపోతే నేలవిడిచి సాము చేసినట్లవుతుంది. అయినా తమ రాజకీయ అవసరాలు, కేసుల కోసం కేంద్రం ముందు సాగిలపడుతున్నప్రాంతీయ పార్టీల నేతలకు కావాల్సింది తమ వారసత్వాలను కాపాడుకోవడమే తప్ప జాతీయ ప్రయోజనాలు కాదు. అందువల్ల మమత పిలుపునందుకుని స్పందించే వారే కరవు అయ్యారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News