మమతకు ఆ గండం తప్పదా?

కరోనా… వారూ వీరూ అనే తేడా లేకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ ఎవరూ దీని ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు దాని [more]

Update: 2021-07-08 16:30 GMT

కరోనా… వారూ వీరూ అనే తేడా లేకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ ఎవరూ దీని ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు దాని ప్రభావం రాజకీయ నాయకులపైనా పడుతోంది. ఎన్నికలు, ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి తలంటిన నేపథ్యంలో నిర్వాచన్ సదన్ పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉప ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేనందున ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థసింగ్ రావత్ అనివార్యంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఘర్వాల్ ఎంపీ అయిన సింగ్ ఈ ఏడాది మార్చి 21న సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాష్ర్టంలో శాసనమండలి లేదు. దీంతో అనివార్యంగా ఆయన సెప్టెంబరులోగా అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. అందుకు ఎన్నికల సంఘం ససేమిరా అనడంతో బీజేపీ అధిష్టానం ఆయన స్థానంలో పుష్కర్ సింగ్ ధామీని పదవిలో కూర్చోబెట్టింది.

ఆ సాహసం చేస్తుందా?

ఇప్పుడు తూర్పు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి సైతం ఈ ప్రమాదం తప్పేటట్లు కనపడటం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఆమె నందిగ్రాం నుంచి పోటీ చేసి ఒకప్పటి తన కుడిభుజం, ప్రస్తుత ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువెందు అధికారిలో చేతిలో ఓడిపోయారు. ఒంటిచేత్తో పార్టీని గెలిపించిన మమత బెనర్జీకి స్వయంగా ఓడిపోవడం జీర్ణించుకోలేని విషయమే. అయినప్పటికి రాజ్యాంగం కల్పించిన అవకాశం మేరకు ఆమె మే 4న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు నెలల్లోగా అంటే నవంబరు 4లోగా ఆమె చట్టసభకు ఎన్నికవ్వాలి. బెంగాల్లో శాసనమండలి లేదు. దీంతో ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయాలని మమత బెనర్జీ తలచారు. ఖాళీగా ఉన్న తన సొంత సీటైన భవానీపూర్ నుంచి పోటీ చేయాలన్నది దీదీ ఆలోచన. కానీ ఎన్నికల సంఘం కరోనా కారణంగా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో లేదు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ లోనే ఉప ఎన్నికలకు ముందుకు రాని ఎన్నికల సంఘం బెంగాల్లో కనీసం అలాంటి ఆలోచనే చేయలేకపోతోంది. ఉత్తరాఖండ్ లోనే ప్రధాని మోదీ పలుకుబడి పని చేయలేదు. అలాంటిది మోదీ బద్ధ విరోధి అయిన మమత బెనర్జీ కోసం ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించే సాహసం చేస్తుందనుకోలేం.

ఆ అవకాశం ఉన్నా సుప్రీంకోర్టు తీర్పుతో….

ఈ పరిస్థితి మమత బెనర్జీకి ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. ఏం చేయాలో ఆమెకు పాలుపోవడం లేదు. కరోనా మూడో వేవ్ వస్తుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలు మమత బెనర్జీని మరింత కంగారు పెట్టిస్తున్నాయి. తన ముందున్న ప్రత్యమ్నాయాలపై ఆమె రాజ్యాంగ, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. గతంలో కొన్ని రాష్రాల్లో చట్టసభల్లో సభ్యులు కానప్పటికి కొందరు మంత్రి పదవులు చేపట్టారు. గడువులోగా చట్టసభలకు ఎన్నిక కాలేకపోవడంతో వారు ఆరు నెలలకు ముందే రాజీనామా చేశారు. మళ్లీ ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా మరో ఆరు నెలలు నెట్టుకొచ్చారు. అలాంటి సంప్రదాయం చెల్లుబాటు కాదని, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని 1995లో సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధించింది. సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ నాయకులకు శరాఘాతం వంటిది.

గవర్నర్ అడ్డుగోడలా…..

ప్రస్తుత గడ్డు పరిస్థితిని అధిగమించడం మమత బెనర్జీకి గట్టి సవాలే. కేంద్రంలో మోదీ సర్కారు, రాష్ర్టంలో ఆమెను తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ మనిషి అయిన గవర్నర్ జగదీప్ ధంపర్ ఉన్నంతకాలం మమత బెనర్జీకి రాజ్యాంగ పరంగా చిక్కులు తప్పవు. అన్ని మార్గాలు మూసుకుపోతే రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదు దీదీకి. తాత్కాలికంగా రాజీనామా చేసిన తన నమ్మినబంటును పీఠంపై కూర్చోబెట్టి తెరవెనక నుంచి చక్రం తిప్పడమే మమతా బెనర్జీ ముందున్న ప్రస్తుత ప్రత్యమ్నాయం. ఇదేమీ మమత బెనర్జీకి పెద్ద కష్టమైన పనికాదు. శాసనమండలి లేని లోటు ఇప్పుడు స్పష్టంగా బెంగాల్, ఉత్తరాఖండ్ నాయకులకు తెలిసివస్తోంది. శాసనమండలి ఏర్పాటుకు తీర్మానం చేస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మరి కేంద్ర దానిని ఆమోదించాలిగా?

 

 

Tags:    

Similar News