ఒకరి వ్యూహానికి మరొకరు చెక్…?

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. అయితే మమత బెనర్జీని బీజేపీ నిద్రపోనిచ్చేట్లు లేదు. వరస పెట్టి నేతలను తమ పార్టీలోకి [more]

Update: 2021-01-10 18:29 GMT

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. అయితే మమత బెనర్జీని బీజేపీ నిద్రపోనిచ్చేట్లు లేదు. వరస పెట్టి నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. మమత బెనర్జీని ఎన్నికల సమయంలో మానసికంగా దెబ్బతీయాలన్న వ్యూహంలో బీజేపీ ఉంది. ఇప్పటికే మమత బెనర్జీకి అత్యంత సన్నిహితులైన వారిని కూడా తమ వైపునకు రప్పించడంలో కాషాయం పార్టీ సక్సెస్ అయిందనే చెప్పాలి. అంటే పశ్చిమ బెంగాల్ లో దాదాపు యాభై శాతం విజయం సాధించినట్లేనని బీజేపీ నేతలు చెబుతున్నారు.

బలంగా ఉన్నానని….

మమత బెనర్జీకి ఒకే ఒక మైనస్. అది పదేళ్ల నుంచి అధికారంలో ఉండటమే. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ సొమ్ము చేసుకోవాలనుకుంటుంది. తృణమూల్ కాంగ్రెస్ ఏర్పడి ఇటీవల 23 ఏళ్లు పూర్తయ్యాయి. పార్టీ బలంగా ఉందని మమత బెనర్జీ తొలి నుంచి సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. అప్పటికయినా తనపై నమ్మకం పెరుగుతుందన్నది మమత బెనర్జీ ఆలోచన.

అనేక మంది వెళ్లిపోవడంతో….

కానీ మమత బెనర్జీ ఆలోచనలకు భిన్నంగా పార్టీ నేతలు ఇటీవల కాలంలో వదలివెళ్లిపోయారు. ఇది బీజేపీకి అవకాశంగా మారింది. మమత బెనర్జీ అధికారంలో ఉండటం ఆ పార్టీ నేతలకే ఇష్టం లేదన్న ప్రచారాన్ని సోషల్ మీడియాలో బీజేపీ మొదలు పెట్టింది. దాదాపు పదిమందికి పైగానే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వెళ్లిపోవడం దీదీకి దెబ్బేనని చెప్పాలి. అయినా మమత బెనర్జీ ధైర్యాన్ని కోల్పోవడం లేదు. బీజేకి ధీటుగానే సమాధానం ఇస్తున్నారు.

30కి మించి రావంటూ….

బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ముప్ఫయికి మించి సీట్లు రావని మమత బెనర్జీ చెబుతున్నారు. అమిత్ షా 200 స్థానాల్లో గెలుస్తామని చెబితే, మమత బెనర్జీ ముప్ఫయికి మించి గెలిచే సీన్ బీజేపీకి లేదని చెబుతున్నారు. పార్టీ నేతలు ఇక తనను వీడి వెళ్లకుండా ఉండేందుకే మమత బెనర్జీ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద మమత బెనర్జీ ఆటను కట్టిస్తామని బీజేపీ, అంత సీన్ లేదని మమత మాటల యుద్ధం మాత్రం నిత్యం బెంగాల్ లో జరుగుతూనే ఉంది.

Tags:    

Similar News