త్రిముఖ పోరులో ముందుందెవ‌రు..?

ఏపీలో రాజ‌కీయ కాక ప్రారంభ‌మైంది. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో పార్టీలు వేటిక‌వే.. దూకుడు ప్ర‌దర్శిస్తున్నాయి. ఇదే సమ‌యంలో నాయ‌కులు కూడా ఎవ‌రికి వారుగా త‌మ ఆర్థిక‌, [more]

Update: 2019-02-06 02:30 GMT

ఏపీలో రాజ‌కీయ కాక ప్రారంభ‌మైంది. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో పార్టీలు వేటిక‌వే.. దూకుడు ప్ర‌దర్శిస్తున్నాయి. ఇదే సమ‌యంలో నాయ‌కులు కూడా ఎవ‌రికి వారుగా త‌మ ఆర్థిక‌, అంగ బ‌లాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రి స‌త్తా ఎంత‌? ఏ పార్టీ దూకుడు ఎలా ఉంది? అనే విష‌యాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. తూర్పుగోదావ‌రి జిల్లాలోని మండ‌పేట నియ‌జ‌కవ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ ముక్కోణ‌పు పోరు ఉదృతంగా సాగేలా ఉంద‌ని అంటున్నారు. టీడీపీకి కంచుకోట అయిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2009, 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ వ‌రుస విజ‌యాలు సాధించింది. వీ జోగేశ్వ‌ర‌రావు ఇక్క‌డ టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు.

మూడు పార్టీలూ వ్యూహాత్మ‌కంగా…

విచిత్రం ఏంటంటే.. 2009లో ఆయ‌న 17 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధిస్తే.. త‌దుప‌రి ఎన్నికల్లో ఏకంగా 36 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాదించి విజ‌య‌దుందుభి మోగించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉండే వ్య‌తిరేక‌త ఇక్క‌డ ఆయ‌న‌పై లేకపోవడం గ‌మ‌నార్హం. ఇక‌, వచ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించే దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం విషయానికి వ‌స్తే.. రాష్ట్రంలోనే ఖ‌రీదైన నియోజ‌క‌వ‌ర్గంగా గుర్తింపు పొందింది. క‌మ్మ సామాజికవ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌దే ఇక్క‌డ ఆధిప‌త్యం సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఇప్పుడు వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన కూడా ఇక్క‌డ పాగా వేయాల‌ని చూడ‌డంతో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వైసీపీ వ్యూహం ఇదీ..

ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ మండ‌పేట‌లో పాగా వేసేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీని ఓడించేందుకు వైసీపీ కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు జీవీ స్వామినాయుడుకు అవ‌కాశం ఇచ్చింది. అయితే, ఈయ‌న ఓడిపోయారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ్యూహం మార్చుకుని ముందుకు అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలోనే శెట్టి బ‌లిజ వ‌ర్గానికి చెందిన డాక్ట‌ర్ పితాని అన్న‌వ‌రంను రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించింది. ఈయ‌న బీసీ నాయ‌కుడు. దీంతో బీసీ ఓట్లు త‌మ‌కు అనుకూలంగా మార‌తాయ‌ని వైసీపీ యోచిస్తోంది. ఆర్థికంగానూ, ఇటు అనుచ‌రుల ప‌రంగానూ అన్న‌వరం బ‌లంగా ఉండ‌డం పార్టీకి క‌లిసి వ‌స్తోంద‌ని అంటున్నారు.

విజ‌యం ఖాయం దిశ‌గా టీడీపీ

ఇక‌, అధికార టీడీపీ విష‌యానికి వ‌స్తే.. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ జోగేశ్వ‌ర‌రావు విజ‌యం సాధించారు. తొలిసారి ఆయ‌న 2009లో పోటీ చేసినా.. విజ‌యం కైవ‌సం చేసుకున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. స్థానికంగా ఆయ‌న ఫ్యామిలీకి ప‌ట్టు ఉండ‌డ‌మే. జోగేశ్వ‌ర‌రావు తండ్రి వేగుళ్ల వీర్రాజు సుమారు 38 ఏళ్ల‌ పాటు స‌ర్పంచ్‌గా ప‌నిచేశారు. దీంతో ఇక్క‌డ రాజ‌కీయంగా ఈ కుటుంబానికి గ‌ట్టి పునాదులు ప‌డ్డాయి. ఆయ‌న వార‌సుడిగా 2001లోనే రాజ‌కీయ అరంగేట్రం చేసిన జోగేశ్వ‌ర‌రావు తొలుత మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా విజ‌యం సాధించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఇప్పుడు ఎమ్మెల్యేగా వ‌రుస విజ‌యాలు కైవ‌సం చేసుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి ప‌ట్టున్న నాయ‌కుడిగా ఎద‌గ‌డ‌మే కాకుండా పార్టీని సైతం బ‌లోపేతం చేస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈయ‌న‌కే టికెట్ అని, విజ‌యం ఖాయ‌మ‌ని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

అభిమానులున్నా.. ప‌వ‌న్‌కు ఆద‌ర‌ణ ల‌భించేనా?

ఇక‌, ముచ్చ‌ట‌గా మూడో పార్టీ జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే.. తూర్పులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అభిమానులు ఎక్కువ‌. ముఖ్యంగా మండ‌పేట‌లో ఆయ‌న‌కు అభిమానులు ప్ర‌తి ఇంట్లోనూ ఉన్నారు. రాష్ట్రంలో ప‌వ‌న్ ఎక్క‌డ ఏ కార్య‌క్ర‌మానికి పిలుపు ఇచ్చినా.. మండ‌పేట నుంచి ప‌వ‌న్ అభిమానులు క్యూ క‌డుతుంటారు. దీంతో ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌పున ఎవ‌రు నిల‌బ‌డ్డా గెలుస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌వ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. అయితే, టికెట్ కోసం న‌లుగురు కీల‌క నేత‌లు పోటీ ప‌డుతున్నారు. పిల్లా స‌త్య‌నారాయ‌ణ‌, వేగుళ్ల లీలాకృష్ణ‌, మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంక‌టేశ్వ‌ర్లు, చిరంజీవి కుటుంబానికి స‌న్నిహితుడైన మ‌ర్రెడ్డి శ్రీనివాసులు కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే, వీరిలో ఎవ‌రికి టికెట్ ఇస్తార‌నే విష‌యం స్ప‌ష్టం కాలేదు.

హోరాహోరీ త‌ప్ప‌దు..!!

గ‌తానికి భిన్నంగా ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో హోరా హోరీ పోరు త‌ప్ప‌ద‌నే వ్యాఖ్య‌లు మాత్రం బ‌లంగానే వినిపిస్తున్నా యి. రెండు సార్లు విజ‌యం సాధించిన సిట్టింగ్‌పై వ్య‌తిరేక‌త ఉన్నా లేకున్నా.. జ‌న‌సేన నుంచి పోటీ చేసే నాయ‌కుడు ప్ర‌భావం చూపితే.. మార్పు ఖాయ‌మ‌ని అంటున్నారు. బీసీ సామాజికవ‌ర్గం ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న నేప‌థ్యంలో వైసీపీ ఇక్క‌డ బీసీ వ‌ర్గానికి టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది. అయితే, ఇక్క‌డ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించేందుకు రెండో స్థానంలో కాపు వ‌ర్గం కూడా ఉండ‌డంతో ప‌వ‌న్ కూడా ఇక్క‌డ ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో ఈ ద‌ఫా పోరు అదిరిపోయేలా ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

Tags:    

Similar News