ఠాగూర్ నే ఠారెత్తిస్తున్నారుగా …?

కాంగ్రెస్ పార్టీ అంటే క్యాడర్ తక్కువ నేతలు ఎక్కువ అనే టాక్ పబ్లిక్ లో ఉంటుంది. అది నిజమే అనే విధంగా వారి సభలు సమావేశాల్లో పాల్గొనే [more]

Update: 2020-12-11 11:00 GMT

కాంగ్రెస్ పార్టీ అంటే క్యాడర్ తక్కువ నేతలు ఎక్కువ అనే టాక్ పబ్లిక్ లో ఉంటుంది. అది నిజమే అనే విధంగా వారి సభలు సమావేశాల్లో పాల్గొనే జనం కన్నా వేదికపై ఉండే వారి సంఖ్య ను చూస్తే చాలు ఎవరికైనా అర్ధం అవుతుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త నాయకత్వం తక్షణ అవసరమైంది. గ్రేటర్ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసి టి పిసిసి చీఫ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తప్పుకుంటారని గత ఎన్నికల నుంచి ప్రచారం ఉండేది. ఆయన తరువాత నాకు ఇవ్వండి అంటే నాకని అంతా అప్పటి నుంచి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే వస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీ గా ఉన్నప్పుడు ఏ స్థాయిలో నేతలు తమ ప్రయత్నాలు చేస్తూ దూసుకుపోతారో తెలిసిందేగా.

ఎవరి గోల వారిది …

టి పిసిసి చీఫ్ పదవి ఎవరికి కట్టబెట్టాలో డిసైడ్ చేయడం అంత చిన్న విషయం కాదు. ఆ విషయం తెలంగాణ కాంగ్రెస్ కి ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న మాణికం ఠాగూర్ కి పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఆయన విస్తృత అభిప్రాయం సేకరించి తన నివేదికను సోనియా ముందు పెట్టాలని పని మొదలు పెట్టేశారు. అంతే ఇప్పుడు సీన్ మొత్తం మాణికం ఠాగూర్ చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ తమ క్వాలిఫికేషన్లు చెప్పుకుంటూ గట్టి ప్రయత్నాలే మొదలు పెట్టారు కాంగీయులు. దాంతో మాణికం ఠాగూర్ పై వత్తిడి క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆయన అధిష్టానం కి ఇచ్చే నివేదికే కీలకం కావడంతో ఠాగూర్ కేంద్ర బిందువుగా టి పిసిసి పోస్ట్ వ్యవహారం నడుస్తుంది.

అంజన్ అర్హత అదే అట …

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరన్నది సామెత. ఇంతకాలం హైదరాబాద్ సిటీ కి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ అప్లికేషన్ పెట్టారు టి పిసిసికి. ఆయనకు ఉన్న అర్హత రెండు సార్లు ఎంపీ గా ఉండటమే అని ఇంచార్జ్ కి చెప్పుకోవడం చర్చనీయం అయ్యింది. బిసిలకు ఛాన్స్ ఇవ్వాలని ఆ కార్డు కూడా బయట పెట్టారు. వాస్తవానికి భాగ్యనగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిల పడటంలో నేతల వైఫల్యం క్లిస్టల్ క్లియర్. అయితే ఆ పరాజయం తనకు సంబంధం లేదని యాదవ్ చెప్పడం గమనార్హం. అలాగే ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన ప్రొపోజల్ చెప్పేశారు. గంటసేపు మాణికం ఠాగూర్ తో భేటీ అయ్యారు. భట్టి విక్రమార్క కూడా పనిలో పనిగా ఒక అభ్యర్ధన ఇచ్చేశారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి వంటి కొత్త గా కాంగ్రెస్ లో చేరిన నేతలు సైతం తీవ్ర ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. అయితే వీరందరి లో అసలు అదృష్టవంతుడు ఎవరన్నది ఫైనల్ గా అధినేత సోనియా చేతిలోనే ఉండనుంది.

Tags:    

Similar News