మాయావతి ఇక తప్పుకోవడమే బెటరా?

కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిల్లో జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అధికార బీజేపీ ఆ దిశగా సంస్థాగత మార్పులు చేపట్టింది. [more]

Update: 2021-06-29 16:30 GMT

కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిల్లో జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అధికార బీజేపీ ఆ దిశగా సంస్థాగత మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా భ్రాహ్మణ ఓట్లను ఆకట్టుకునేందుకు ఆ వర్గానికి చెందిన జితిన్ ప్రసాదకు పార్టీ కాషాయ కండువా కప్పింది. పార్టీ ఉపాధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి ఎ.కె.శర్మను నియమించింది. శర్మ గుజరాత్ కేడర్ అధికారిగా గతంలో మోదీ హయాంలో సివిల్ సర్వెంట్ గా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి, యువ నాయకుడు అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయంతో మంచి ఊపులో ఉంది. సుప్త చేతనావస్థలో ఉన్న హస్తం పార్టీ గురించి ప్రస్తావించనక్కర్లేదు. మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పరిస్థితి దయనీయంగా ఉంది.

నాలుగు సార్లు సీఎంగా….

నాలుగుసార్లు రాష్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి ఒకప్పుడు ప్రజా బాహుళ్యంలో మంచి పట్టున్న నాయకురాలు. దళితుల ఆశాజ్యోతిగా చరిత్రకెక్కారు. దేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రిగా పేరొందారు. భావి ప్రధానిగానూ గుర్తింపు పొందారు. 1995లో, 1997లో, 2002లో మూడోసారి ముఖ్యమంత్రి అయిన మాయావతి వివిధ రాజకీయ కారణాలతో, తగినంత బలం లేక అర్థంతరంగానే పదవి నుంచి వైదొలగారు. 2007లో సొంత బలంతో సంపూర్ణ మెజార్టీ సాధించిన ఆమె 2012 వరకు అయిదేళ్లు అధికారంలో కొనసాగారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి మాయావతి ప్రభ మసకబారడం మొదలైంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గాలిలో మాయావతి సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కేవలం 19 సీట్లే పరిమితమైంది.

ఓట్లు బదిలీ కాలేదని…

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న అభియోగాలతో మాయావతి 11మంది ఎమ్మెల్యేలను బహిష్కరించారు. మరొక సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు మిగిలింది కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలే. అంటే దాదాపు కాంగ్రెస్ పరిస్థితి లాంటిదే. బహిష్ర్కత ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీలో చేరనున్నారు. ఇటీవలే వారు ఆ పార్టీ అధినతే అఖిలేష్ యాదవ్ ను కలిశారు. ఆమెతో పొత్తు పెట్టుకునేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేదు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలసి పోటీచేశాయి. ఎస్పీ 47, బీఎస్పీ 19 సీట్లు సాధించాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. బీఎస్పీ 10 సీట్లు తెచ్చుకోగా, ఎస్పీ 5 సీట్లకే పరిమితమైంది. తమ ఓట్లు బీఎస్పీ కి బదిలీ అయ్యాయని, అయితే బీఎస్పీ ఓట్లు తమకు పడలేదన్నది ఎస్పీ ఆరోపణ. అందువల్లే రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతితో పొత్తు ప్రసక్తి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేయడం గమనార్హం.

పంచాయతీ ఎన్నికలలోనూ….

గతనెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మాయావతి పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 3050 సీట్లకు 782 సాధించి అఖిలేష్ పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. 580 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో, 300కు పైగా సీట్లతో బీఎస్పీ మూడో స్థానంలో నిలిచింది. రాష్ర్ట వ్యాప్తంగా ఘోరంగా దెబ్బతిన్న పార్టీ ఒక్క బుందేల్ ఖండ్ ప్రాంతంలోనే పార్టీ కొంతవరకు ప్రభావాన్ని చూపింది. ఈ ఫలితాలు రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపగలవనడంలో సందేహం లేదు. పార్టీ నుంచి కీలక నేతలు వైదొలగడం, మాయావతి (65)కి వయసు మీదపడటం తదితర కారణాల వల్ల పార్టీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రజల ఆదరణ గల నేతలు లేకపోవడం పార్టీకి పెద్దలోపంగా చెప్పవచ్చు. కేవలం దళితుల ఓట్లతోనే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కలేమన్న వాస్తవాన్ని పార్టీ గ్రహించింది. ఈ నేపథ్యంలో మాయావతి ముందన్నది ముళ్లబాటే అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాను తోసిపుచ్చలేం.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News