ఎంఐఎం కు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కడుతున్నారా?

ఎంఐఎం అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తూ వస్తుంది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం ప్రభావంతో బీజేపీ లాభపడిందంటారు. బీహార్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ ఇలా అన్ని [more]

Update: 2021-04-08 03:30 GMT

ఎంఐఎం అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తూ వస్తుంది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం ప్రభావంతో బీజేపీ లాభపడిందంటారు. బీహార్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ ఇలా అన్ని చోట్ల ఎంఐఎం పోటీ చేస్తుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడులోనూ ఎంఐఎం అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఎంఐఎం విస్తరించుకుంటూ పోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ పై మాత్రం మొన్నటి వరకూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దృష్టి పెట్టలేదు.

కొంత టెన్షన్ పడినా…

అయితే ఇటీవల స్థానికసంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం అధికార వైసీపీని కొంత టెన్షన్ కు గురిచేసింది. ముస్లిం సామాజికవర్గంలో అధిక శాతం వైసీపీ సానుభూతిపరులుగా ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు సయితం ఈ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేలానే ఉన్నాయి. అయితే ఎంఐఎం ఏపీలో పోటీ చేస్తే వైసీపీ ఓటు బ్యాంకు కు గండిపడుతుందన్న ఆందోళన అధికార పార్టీ నేతల్లో ఉంది.

పెద్దగా ప్రభావం లేకపోయినా….

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలు, విజయవాడ, హిందూపురం గుంటూరు వంటి చోట్ల ఎంఐఎం పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే భవిష్యత్ లో ఎంఐఎంతో ఇబ్బంది రాకుండా వైసీపీ అగ్రనాయకత్వం ఇప్పటి నుంచే చర్యలు ప్రారభించిందని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయకుండా ఎంఐఎంను కట్టడి చేయడానికి ఏపీకి చెందిన ముస్లిం నేతలు ఇటీవల అసదుద్దీన్ ఒవైసీని కలసినట్లు చెబుతున్నారు.

ఒవైసీతో భేటీలో….

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లిం సామాజికవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎమ్మెల్సీ లుగానూ ఎక్కువ మంది మైనారిటీ అభ్యర్థులను ఇప్పటికే ముగ్గురిని ఎంపిక చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ముస్లిం సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని గణాంకాలతో సహా అసుద్దీన్ ఒవైసీకి వారు వివరించినట్లు తెలిసింది. ఒవైసీ ఏపీలో ముస్లిం సామాజికవర్గానికి జగన్ ప్రభుత్వం ఇస్తున్న చేయూత పట్ల కొంత సంతృప్తి వ్యక్తం చేసినా పూర్తి స్థాయి హామీ ఆయన నుంచి లభించలేదని చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీ ఇప్పటి నుంచే ఎంఐఎం ను దువ్వే కార్యక్రమాన్ని ప్రారంభించిందంటున్నారు.

Tags:    

Similar News