అదృష్టమో..? దురదృష్టమో తెలియదు కానీ?

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఎవరు? ప్రశ్న వేస్తే ఠక్కున సమాధానం చెప్పడం కష్టమే. అదే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఎవరంటే వెంటనే సమాధానం వచ్చేస్తుంది. [more]

Update: 2021-01-29 14:30 GMT

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఎవరు? ప్రశ్న వేస్తే ఠక్కున సమాధానం చెప్పడం కష్టమే. అదే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఎవరంటే వెంటనే సమాధానం వచ్చేస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా దేవాదాయ శాఖ మంత్రికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఆ శాఖ కూడా తన పని తాను చేసుకుని పోవడం తప్పించి వేరే వివాదాలకు చోటుండదు. ఇక దేవాలయాల కమిటీలు ఆలయ భద్రత, ధూపదీప నైవేద్యాల విషయం చూసుకుంటాయి. కానీ ఏపీలో దేవాదాయ శాఖకు చేతినిండా పని ఏర్పడింది.

ఎక్కడా లేని విధంగా…..

వరసగా ఆలయాలపై దాడులు జరుగుతుండటంతో దేవాదాయ శాఖ అంతర్గత విచారణ పేరుతో బిజీగా ఉంది. ఇప్పటికే ఆలయ దాడుల ఘటనలో కొందరు అధికారులు సస్పెండ్ కాగా, మరికొందరిపై బదిలీ వేటు పడింది. అంతర్వేది నుంచి రామతీర్థం వరకూ అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిపై విచారణ సీబీఐ, సీఐడీ వంటి సంస్థలను విచారణకు ఆదేశించినా ఏం జరుగుతుందో నన్న భయం దేవాదాయ శాఖ అధికారులను వదిలిపెట్టడం లేదు.

శాఖాపరంగా బిజీయే…..

పైగా అంతర్వేది రధం దగ్దం కావడంతో ఆ రధం స్థానంలో కొత్త రథాన్ని తయారు చేయించారు. కోట్లాది రూపాయలు తయారు చేయించిన ఈ రథాన్ని త్వరలోనే స్వామివారికి వినియోగించ నున్నారు. ఇక రామతీర్థం లో రాముడి విగ్రహాలు ధ్వంసం కావడంతో కొత్త విగ్రహాలను తయారు చేయంచారు. ఇలా ఏపీలోని ఆలయాల్లో వరస దాడులతో ఒకవైపు ఆ శాఖ అధికారుల్లో ఆందోళన నెలకొనడం, మరోవైపు కొత్త రథాలు, విగ్రహాలను తయారు చేయించడంలోనే నిమగ్నమయి ఉన్నారు.

మంత్రికి సయితం…..

ఇక దేవాదాయ శాఖ మంత్రి విషయానికి వస్తే ఏ శాఖ మంత్రికి లేని ప్రచారం ఈయకు లభించింది. సాధారణగా హోంమంత్రి, రెవెన్యూ, ఆర్థిక, వ్యవసాయ శాఖలకు ఏ రాష్ట్రంలోనైనా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ ఘటనలతో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాధాన్యత పెరిగింది. అంతకు ముందు ఆయనను పట్టించుకోని పార్టీ నేతలు సయితం ఇప్పుడు ఏ జిల్లాకు వెళ్లినా ఆయనకు పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తం మీద ఏ రాష్ట్రంలోనూ, ఎప్పుడూ లేని విధంగా ఏపీలో దేవాదాయ శాఖకు ప్రాధాన్యత పెరిగింది. మరి అది అదృష్టమో… దురదృష్టమో?

Tags:    

Similar News