మర్యాద… మర్యాద…!!

పదవులు, అధికారాలు ఎందుకు ఎదుటి వారి నుంచి గౌరవాలు, మర్యాద పొందేందుకు. అవి లేని నాడు మంత్రి పదవి ఉన్న లేకున్నా ఒక్కటే. ఇపుడు ఉత్తరాంధ్రా జిల్లాలకు [more]

Update: 2019-11-06 05:00 GMT

పదవులు, అధికారాలు ఎందుకు ఎదుటి వారి నుంచి గౌరవాలు, మర్యాద పొందేందుకు. అవి లేని నాడు మంత్రి పదవి ఉన్న లేకున్నా ఒక్కటే. ఇపుడు ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన ఇద్దరు వైసీపీ మంత్రులకు మర్యాద బాధ ఎక్కువైపోయింది. అసలు వారిని అమాత్యులుగా ముదిరిపోయిన అధికారులు గుర్తించడం లేదని కలవరపడుతున్నారు. చిత్రమేంటంటే ఈ ఇద్దరు తమ బాధ బాహాటంగానే బయటపెట్టేసుకుంటున్నారు. మర్యాద ఇవ్వండని నోరు తెరిచి మరీ అడిగేస్తున్నారంటే ఆ దర్జా దర్పం ఎలా నీరుకారిపోతున్నాయో చూడాల్సిందే. విచిత్రమేంటే మంత్రులు ఇలా మొత్తుకుంటున్నా అధికారులు మాత్రం షరా మామూలేనన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో అటు వైసీపీలో, ఇటు ప్రభుత్వంలో కూడా మంత్రులు చులకన అయిపోతున్నారు.

ప్రోటోకాల్ మీద లెక్చర్ దంచిన మంత్రి…..

విశాఖ జిల్లాకు ఏకైన మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావుకు అధికారుల తీరు అసలు నచ్చడం. లేదు. గతంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఇంటి ముందు పొద్దు పొద్దునే వెళ్ళి మరీ సుప్రభాతాలు పడిన జిలా అధికార యంత్రాంగం తన పట్ల మాత్రం పెద్దగా పట్టింపు లేకుండా వ్యవహ‌రించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. జిల్లాలో అధికారులను ఏకత్రాటిపై నడిపించాల్సిన మంత్రిగా తనను కెప్టెన్ గా అధికారులు గుర్తించకపోవడం పట్ల ఆయన తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి అవంతి సూటిగా అధికారులకే క్లాస్ తీసుకున్నారు. అధికారులు ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని గట్టిగానే చెప్పారు. నేవీ అధికారులు కూడా ముందు పౌరులేనని, ఆ మీదట వారి హోదా చూసుకోవాలని కూడా ఆయన అనడం విశేషం. కొత్తగా అధికారి ఎవరు బాధ్యత స్వీకరించినా వెంటనే మంత్రిగారిని కలవాల్సిందేనని అవంతి శ్రీనివాసరావు ఉన్న విషయం చెప్పేశారు.

దాసన్న గోల అదేగా…?

ఇక శ్రీకాకుళం జిల్లా మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ సైతం అధికారులను నియంత్రించలేకపోతున్నారని అంటున్నారు. ఆయన మంత్రిగా ఉన్నా సైతం ఎవరూ లెక్కచేయడంలేదని అంటున్నారు. మంత్రి గారి ఆదేశాలను సైతం బేఖాత‌రు చేస్తూ అధికారులు ఇష్టారాజ్యం చేయడాన్ని కూడా సహించలేకపోతున్నారు. మరో వైపు కొంతమంది అధికారులు ఇప్పటికీ టీడీపీకి సానుభూతిపరులుగా ఉంటూ వస్తున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య జరిగిన పార్టీ సమావేశాల్లో, బయటా కూడా దాసన్న తన గోడు వెళ్లబోసుకున్నారు. పార్టీ నాయకులైనా, అధికారులైనా కూడా మంత్రిగా మాట వినాల్సిందేనని కూడా గట్టిగా క్లాస్ తీసుకున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు మంత్రులు ఇప్పటికైతే బయటపడ్డారు. బయటపడని మంత్రులు వైసీపీలో చాలామందే ఉన్నారని అంటున్నారు. అసలు ఇంతకీ అధికారులు మంత్రులను పట్టించుకోకపోవడం వెనక లోపం ఎవరిది అని ఒక్కసారి అమాత్యులు తమను తాము ప్రశ్న వేసుకుంటే సమాధానం అదే దొరుకుతుందని సొంత పార్టీ వారే సూచిస్తున్నారు.

Tags:    

Similar News