మాట‌ల్లేవ్‌… మాట్లాడుకోవ‌టాల్లేవ్‌..!

వారిద్దరూ ఒకే జిల్లాకు చెందిన మంత్రులు. ఒక‌రు పుష్పశ్రీవాణి, మ‌రొక‌రు బొత్స స‌త్యనారాయ‌ణ‌. అయితే, ఇద్దరూ కూడా మౌనంగా ఉంటున్నారు. గ‌తంలో ఒకే వేదిక‌ను కూడా పంచుకున్న [more]

Update: 2020-09-21 13:30 GMT

వారిద్దరూ ఒకే జిల్లాకు చెందిన మంత్రులు. ఒక‌రు పుష్పశ్రీవాణి, మ‌రొక‌రు బొత్స స‌త్యనారాయ‌ణ‌. అయితే, ఇద్దరూ కూడా మౌనంగా ఉంటున్నారు. గ‌తంలో ఒకే వేదిక‌ను కూడా పంచుకున్న ఈ మంత్రులు.. ఇప్పడు మాత్రం ముందుగానే ఆయ‌న వ‌స్తున్నారా ? అంటూ.. పుష్ప శ్రీవాణి వాక‌బు చేస్తున్నారు. ఇక‌, బొత్స కూడా ఆమె వ‌స్తోందా ? అంటూ.. అధికారుల నుంచి ముందుగానే స‌మాచారం తెప్పించుకుంటున్నార‌ట‌. ఈ ప‌రిణామంపై జిల్లాలో తీవ్రస్థాయిలో చ‌ర్చసాగుతోంది. ఈ ఇద్దరు మంత్రులు కూడా ఒకే వేదిక‌ను పంచుకున్నా.. ప‌క్కన ప‌క్కన కూడా ఇటీవ‌ల కాలంలో కూర్చోవ‌డం లేదు.

జగన్ పదే పదే చెప్పినా….

దీనికి కార‌ణం ఏంటి ? ఎందుకు ఓకే జిల్లాకు చెందిన మంత్రులు ఇలా వ్యవహ‌రిస్తున్నారు ? అనే ప్రశ్నలు వ‌స్తున్నాయి. నిజానికి ముఖ్యమంత్రి జ‌గ‌న్ మాత్రం మంత్రులు అంద‌రూ క‌లివిడిగా ఉండాల‌ని, స‌మ‌స్యలు రాకుండా చూసుకోవాలని, జిల్లాలో పార్టీ వ్యవ‌హారాల‌ను కూడా అవ‌స‌ర‌మైన మేర‌కు త‌గ్గించుకోవాల‌ని, పాల‌న‌పైనే దృష్టి పెట్టాల‌ని ప‌దే ప‌దే చెబుతున్నారు. కానీ, విజ‌య‌న‌గ‌రంలో మాత్రం దీనికి భిన్నంగా సాగుతోంది. డిప్యూటీ సీఎంగా ఉన్న పుష్ప శ్రీవాణి ఏదైనా ప‌నిని పుర‌మాయిస్తే అధికారులు వెంట‌నే స‌ద‌రు ప‌నిని బొత్సకు చేర‌వేస్తున్నారు. దీనిపై గ‌త ఆరు మాసాల నుంచి ఇద్దరు మంత్రుల మ‌ధ్య వివాదం ఉంది.

ఆమెను సమర్థించే వారు….

తాను సీనియ‌ర్ కావ‌డంతో చ‌క్రం తిప్పాల‌ని బొత్స భావిస్తుండ‌గా, తాను డిప్యూటీ సీఎంన‌ని, మంత్రి క‌న్నా ఒక అడుగు అధికారం త‌న‌కే ఉంద‌ని పుష్ప శ్రీవాణి చెబుతున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ముందుగా తానే ఉండాల‌న్నదే ఆమె ప‌ట్టు. అయిన‌ప్పటికీ.. అధికారులు, ఇత‌ర పార్టీ నాయ‌కులు మాత్రం బొత్సకే అనుకూలంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. దీనికి కారణం. రాజ‌కీయంగా బొత్సకు ఉన్న ప‌లుకుబ‌డి. ఆయ‌న ప‌రివారం ఎక్కువ‌గా ఉండ‌డ‌మే న‌ని తెలుస్తోంది. ఈ కోణంలో చూసుకుంటే.. పుష్ప శ్రీవాణిని స‌మ‌ర్ధించే నాయ‌కులు త‌క్కువ‌గా ఉన్నారు.

ప్రచ్ఛన్న యుద్థం…..

ఒక్క కురుపాం నియోజ‌క‌వ‌ర్గంలో మిన‌హా.. ఆమెకు జిల్లా వ్యాప్తంగా స‌హ‌క‌రించే నాయ‌కులు, కార్యక‌ర్తలు పెద్దగా లేరు. ఈ ప‌రిణామాల‌ను అనుకూలంగా మార్చుకున్న బొత్స.. త‌న‌దైన శైలిలో చ‌క్రం తిప్పుతుండడంతో ఇద్దరు మంత్రుల మ‌ధ్య గ్యాప్ మ‌రింత‌గా పెరుగుతోంద‌నే భావ‌న వ్యక్తమ‌వుతోంది. అయితే కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్ర‌మంలో విజ‌య‌సాయిరెడ్డి స‌మ‌క్షంలోనే పుష్ప శ్రీవాణి కంట‌త‌డి పెట్టుకున్నారు. విజ‌య‌సాయి ఆమెను వారించే ప్రయ‌త్నం కూడా చేశారు. ఇక బొత్స పుష్ప శ్రీవాణికి చెక్ పెట్టేందుకే మాజీ జ‌డ్పీచైర్‌ప‌ర్సన్ శోభా స్వాతిరాణిని పార్టీలోకి తీసుకువ‌చ్చార‌ని.. ఆమెతో కురుపాంలో రాజ‌కీయాలు చేయిస్తున్నార‌న్న టాక్ కూడా ఉంది. వీరిద్దరి ప్రచ్ఛన్న యుద్దం అంతిమంగా పార్టీపై ప్రభావం చూపుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News