పాక్ కాలు జారిందా?

పాకిస్థాన్ పరిస్థితి ఇపుడు ఎలా ఉందంటే దెబ్బ నెత్తి మీద పడినా అబ్బా అని అరచేందుకు వీలు లేదు. తేలు కుట్టిన దొంగలా నోరు కుట్టేసుకోవాల్సిందే. ఇది [more]

Update: 2019-10-10 18:29 GMT

పాకిస్థాన్ పరిస్థితి ఇపుడు ఎలా ఉందంటే దెబ్బ నెత్తి మీద పడినా అబ్బా అని అరచేందుకు వీలు లేదు. తేలు కుట్టిన దొంగలా నోరు కుట్టేసుకోవాల్సిందే. ఇది మోడీ మార్క్ వ్యూహరచన. ఈ పద్మవ్యూహంలో బంధీ అయిన పాక్ కి కాండు జెల్ల తగిలే రోజు దగ్గరలోనే ఉందని అంటున్నారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ ని రద్దు చేసి మాడు పగలగొట్టిన భారత్ ఇపుడు ఏకంగా మిషన్ పీఓకే అంటోంది. దాని కోసం తగిన సమయం కోసం ఎదురుచూస్తోంది. పాకిస్థాన్ ని తనదైన శైలిలో ఉడికిస్తోంది. దానికి ఏమాత్రం పాక్ కాలు జారినా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కలిపేసుకోవడానికి భారత్ రెడీగా ఉంది. దీనికి పూర్వరంగం అంతా సిధ్ధం చేసి పెట్టుకున్న మోడీ సర్కార్ పాక్ ని చక్రబంధంలో పెట్టేసింది. కాశ్మీర్ అంటూ అదే పనిగా కలవరిస్తున్నా కూడా పాక్ ఇపుడు అంగుళం అడుగు కూడా ముందుకు వేయలేదంటున్నారు. అలా కనుక వేస్తే తన చావు తానే కోరి తెచ్చుకున్నట్లేనని కూడా చెబుతున్నారు.

ఆయుధాలు సిధ్ధం…..

భారత్ ఇపుడు ఓ విధంగా యుధ్ధ సన్నాహాలలో ఉంది. దాని కోసం తగిన విధంగా ఆయుధాలను సమకూర్చుకుంది. తక్షణం యుధ్ధం వస్తే ఏం చేయాలో అన్ని చేస్తోంది. ఇవన్నీ శరవేగంగా పూర్తి చేసుకున్న భారత్ ఈసారి పాక్ కి జీవితంలో మరచిపోలేని దెబ్బ కొట్టాలనుకుంటోందట. యూరీ దాడిలొ ప్రతీకారంగా మూడేళ్ళ క్రితం తొలిసారిగా సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన భారత్ ఈ ఏడాది మొదట్లో పుల్వామా దాడులకు రిటార్ట్ గా ఏకంగా పాక్ భూభాగంలోకి తన సేనలను పరుగులెత్తించింది. ఇపుడు ముచ్చటగా మూడవసారి పాక్ ముచ్చటను తీర్చేయాలనుకుంటోంది. భారత్ మీద యుధ్ధం అయినా, లేక ఉగ్ర దాడులైనా సరే చేస్తే చాలు, పాక్ మీదకు దండెత్తి పడిపోవడానికి భారత్ రెడీ అంటోంది. ఈసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ తోనే భారత్ సేనలు వెనక్కివస్తాయని అంటున్నారు. ప్రపంచానికి మాత్రం తాము మొదట దాడి చేసినట్లు ఉండకూడదు, పాక్ తమ దేశంపై దాడి చేస్తే చాలు ఆ సాకు చూపించి పీఓకేని కలిపి జయించాలన్నదే మోడీ మిషన్ కాశ్మీర్ అంటున్నారు.

అపుడే ఎన్నికలట….

ఇదిలా ఉండగా తాజాగా ఐపీఎస్ శిక్షణ పొందిన పోలీస్ అధికారులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కాశ్మీర్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ఎల్లకాలం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండదని, తగిన సమయంలో రాష్ట్ర హోదా ఇస్తామని, ఎన్నికలు కూడా జరిపిస్తామని షా అన్నారు. దీని భావమేంటని ఆరా తీస్తే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో 87 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలినవి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి సంపూర్ణ కాశ్మీర్లో ఎన్నికలు జరిపించడం మోడీ సర్కార్ అజెండాగా చెబుతున్నారు. అలాగే మొత్తంగా ఒక్కటైన కాశ్మీర్లో త్రివర్ణ పతాకం ఎగురవేస్తారని అంటున్నారు. దీని మీద భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ తొందరలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్ లో భాగమవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా భారత ఆర్మీ అధికారుల మాటలు చూసినా భారత్ ఎత్తుగడలు గమనించినా పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో భారత్ ప్లాన్ ఇదేనని అంటున్నారు. పాక్ తిక్క వేషాలు వేస్తే ఈసారి భరతం పట్టడం ఖాయమేనట, చూడాలి మరి.

Tags:    

Similar News