త్రిశంకు స్వ‌ర్గంలో `మోదుగుల‌`.. అటా..ఇటా..?

ఆయ‌న అధికార పార్టీ ఎమ్మెల్యే! కానీ పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఈ మ‌ధ్య క‌నిపించ‌డం మానేశారు! పార్టీ చేప‌ట్టిన స‌భ్య‌త్వ న‌మోదులోనూ ఆయ‌న న‌ల్ల‌పూస అయిపోయారు! ఎన్నిక‌ల స‌మ‌యంలో.. [more]

Update: 2019-01-13 08:00 GMT

ఆయ‌న అధికార పార్టీ ఎమ్మెల్యే! కానీ పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఈ మ‌ధ్య క‌నిపించ‌డం మానేశారు! పార్టీ చేప‌ట్టిన స‌భ్య‌త్వ న‌మోదులోనూ ఆయ‌న న‌ల్ల‌పూస అయిపోయారు! ఎన్నిక‌ల స‌మ‌యంలో.. అది కూడా అభ్య‌ర్థుల‌ను ముంద‌స్తుగా ప్ర‌క‌టిస్తామ‌ని అధినేత చెప్పిన స‌మ‌యంలోనూ ఆ ఎమ్మెల్యే ఇలా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విష‌యం ఎవ‌రికీ తెలియ‌డం లేదు! ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నియోజక‌వ‌ర్గం నుంచి పోటీ చేసేదే లేద‌ని చెబుతున్న ఆయ‌న‌.. త‌న‌కు న‌చ్చిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే అనేక స‌మీక‌ర‌ణాల మ‌ధ్య‌.. ఆ రెండు నియోజక‌వ‌ర్గాల నుంచి టికెట్ ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో ఆయ‌న ఏ నిర్ణ‌యం తీసుకుంటారోన‌నే చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో మొద‌లైంది. అయితే పార్టీ అధినేత మాత్రం ఎమ్మెల్యేను దండించ‌డం లేదు.. అలా అని ఆయ‌న‌కు న‌చ్చ‌జెప్ప‌డం లేదు. దీంతో ఇంకెన్నాళ్లు ఇలా ముసుగులో గుద్దులాడ‌తార‌నే ప్ర‌శ్న అంద‌ర‌నీ వేధిస్తోంది. ఆ ప్ర‌జాప్ర‌తినిధి ఎవరంటే గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే మోదుగుల‌ వేణుగోపాల్ రెడ్డి.

స్వయంగా జగన్ కే ఓటేయమని చెప్పినా…

టీడీపీలో నేత‌లెవ‌రూ.. అధినేత‌, సీఎం చంద్ర‌బాబు గీసిన గీత దాట‌రు. ఒక‌వేళ అలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే.. వారిపై చండ్ర‌నిప్పులు కురిపించేస్తారు చంద్ర‌బాబు. కానీ మోదుగుల మాత్రం ఎన్నిసార్లు గీత దాటుతున్నా.. బాబు స‌హ‌నంతో ఉండ‌టం పార్టీ నేత‌ల‌ను విస్మ‌యానికి గురిచేయ‌క మాన‌దు. 'రెడ్డి సామాజిక‌వ‌ర్గ వారంతా జ‌గ‌న్‌కే ఓటేయండి' అని స్వ‌యంగా మోదుగులే చెప్పినా.. వీటిపై చంద్ర‌బాబు స్పందించిన దాఖలాలు లేనేలేవు. పార్టీ కార్య‌క్ర‌మ‌మైన జ‌న్మ‌భూమిలో ఎమ్మెల్యే పాల్గొనడం లేదు. పార్టీ స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మాల‌కూ డుమ్మా కొడుతున్నారు. మ‌రి ఇన్ని చేసినా.. బాబు మాత్రం కిమ్మ‌న‌డం లేదంటే.. మోదుగుల‌-బాబు మ‌ధ్య ఏదో ఉంద‌నే అభిప్రాయాలు జిల్లా నాయ‌కుల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స‌రైన స‌మ‌యంలో ఇవి బ‌య‌ట‌ప‌డ‌తాయ‌నే వారూ లేక‌పోలేదు.

రెండు సీట్లపై ఆశలు పెట్టుకున్నా…

కొద్ది రోజుల క్రితం మోదుగుల మాట్లాడుతూ… తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు. మాచ‌ర్ల‌ లేదా బాప‌ట్ల పోటీ చేస్తాన‌ని వెల్ల‌డించారు. ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో రెడ్డి సామాజకవర్గ ఓటర్లు ఎక్కువ‌గా ఉండ‌టంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని జిల్లా నాయ‌కులు చెబుతున్నారు. మాచ‌ర్ల‌లో యాద‌వ సామాజిక‌వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థిని బ‌రిలోకి దించాల‌ని య‌రప‌తినేని శ్రీ‌నివాస‌రావు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో అక్క‌డ సీటు ద‌క్క‌డం మోదుగుల‌కు క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి కాపుల‌కు ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. అందులో బాప‌ట్ల లేదా గుంటూరు ప‌శ్చిమ పేర్లు వినిపిస్తున్నాయి.

ఏదో ఒకటి తేల్చేయండి…

గుంటూరు ప‌శ్చిమ సీటు త‌న‌కే ద‌క్కుతుంద‌నే న‌మ్మ‌కంలో ఉన్నారు న‌గర పార్టీ అధ్య‌క్షుడు చందూ సాంబ శివ‌రావు. దీంతో రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి సీటు ద‌క్కే అవ‌కాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే ఇక్క‌డ ఎమ్మెల్సీగా ఉన్న అన్నం స‌తీష్.. బాప‌ట్ల‌పై క‌న్నేశారు. దీంతో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అభ్య‌ర్థులు ఉన్నారు. ఫ‌లితంగా మోదుగుల ప‌రిస్థితి ఏంట‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఆయ‌న‌కు ఏదో ఒక విష‌యం చెబితే బాగుంటుంద‌ని జిల్లా నేత‌లు చెబుతున్నారు. ఈ దాగుడుమూత‌ల‌కు ఇంక ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని కోరుతున్నారు.

Tags:    

Similar News