మోపిదేవిని అక్కడి నుంచి తప్పించేస్తున్నారా? కొత్త నేత వస్తున్నారా?

రాష్ట్ర అధికార పార్టీ వైసీపీకి మ‌రో చిక్కువ‌చ్చింది. నాయ‌కుల‌ను ప్రమోట్ చేస్తున్న క్రమంలో ఏర్పడుతున్న ఖాళీల భ‌ర్తీ నిజంగా ప‌రీక్షగా మారింది. ప్రజ‌ల్లో మంచి పట్టున్న నాయ‌కుల‌కు [more]

Update: 2020-05-01 02:00 GMT

రాష్ట్ర అధికార పార్టీ వైసీపీకి మ‌రో చిక్కువ‌చ్చింది. నాయ‌కుల‌ను ప్రమోట్ చేస్తున్న క్రమంలో ఏర్పడుతున్న ఖాళీల భ‌ర్తీ నిజంగా ప‌రీక్షగా మారింది. ప్రజ‌ల్లో మంచి పట్టున్న నాయ‌కుల‌కు జ‌గ‌న్ ప్రమోష‌న్ ఇస్తున్నారు. దీంతో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని న‌డిపించేవారు ఎవ‌ర‌నే సందేహాలు వ‌స్తున్నాయి. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌కంగా మారింది.. గుంటూరు జిల్లాలోని రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం. ప్రస్తుతం ఇక్కడ నుంచి పార్టీని న‌డిపిస్తున్నది మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మణారావు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇక్కడ నుంచి పోటీ చేసినా.. వైసీపీ తుఫాన్ రాష్ట్రం మొత్తం క‌నిపించినా.. మోపిదేవి వెంకటరమణ మాత్రం ఓడిపోయారు. నిజానికి వైఎస్ కుటుంబంతో ఉన్న స‌ఖ్యత కార‌ణంగానే ఆయ‌న‌కు ఇక్కడ టికెట్ ల‌భించింది.

మోపిదేవి రాజ్యసభకు వెళ్లడంతో…

గ‌త ఏడాదే కాకుండా 2014లోనూ మోపిదేవి వెంకట రమణకి ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లోనూ మోపిదేవి ఓడిపోయారు. నిజానికి రెండు వ‌రుస ప‌రాజ‌యాలు పొందిన‌ప్ప‌టికీ.. మోపిదేవికి జ‌గ‌న్ ప్రమోష‌న్ ఇచ్చారు. తాను అధికారంలోకి రాగానే ఆయ‌న‌ను ఎమ్మెల్సీ చేశారు. అంత‌టితో ఆగ‌కుండా ముందుగానే మంత్రిని చేశారు. దీనిని బ‌ట్టి వైఎస్ ఫ్యామిలీకి మోపిదేవి వెంకట రమణకి మ‌ధ్య సఖ్యత‌ను అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే, ఇప్పుడు మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని ఏపీ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దీంతో ఈయ‌న త‌న స‌భ్యత్వాన్ని కోల్పోవ‌డ‌మే కాకుండా, మంత్రిగా కూడా ప‌ద‌విని పోగొట్టుకుంటారు. ఈ క్రమంలోనే జ‌గ‌న్ ఆయ‌న‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప్రక‌టించారు. మోపిదేవిని రాజ్యస‌భ‌కు పంపుతున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి…?

రాజ్యస‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌డంతోనే మోపిదేవి వెంకట రమణ ఇక‌ పెద్దల స‌భ‌లోకి అడుగు పెట్టనున్నారు. ఈ ప‌ద‌వి కాలం ఆరేళ్లు కాబ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోపిదేవి రేప‌ల్లె నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉండ‌దు. దీంతో ఈ స్థానంలో ఎవ‌రిని నియ‌మించాలి ? ఎవ‌రికి అవ‌కాశం క‌ల్పించాలి ? అనే చ‌ర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీసీ వ‌ర్గానికి ప‌ట్టు ఎక్కువ‌. మోపిదేవి వెంకట రమణ కూడా బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడే అయినా కూడా గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఓడిపోవ‌డం మైన‌స్‌. అయిన‌ప్పటికీ.. ఇక్కడ మోపిదేవి వెంకట రమణకు మంచి ప‌లుకుబ‌డి, అనుచ‌ర‌గ‌ణం ఎక్కువే.

మాస్ లీడర్ కావాలని…

అయితే, ఇప్పుడు ఆయ‌నకు ప్రమోష‌న్ రావ‌డంతో ఈ స్థానంలో ఎవ‌రికి ఛాన్స్ ఇస్తారు ? ఇక్కడ వైసీపీని ముందుండి ఎలా న‌డిపిస్తారు అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రోప‌క్క టీడీపీ నాయ‌కుడు, వ‌రుస‌గా విజ‌యం సాధిస్తున్న అన‌గాని స‌త్యప్రసాద్ మంచి దూకుడుమీదున్నారు. ప్రజ‌ల మ‌ధ్య నిత్యం ఉంటున్నారు. కాలి న‌డ‌క‌నే ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. దీంతో ఆయ‌న‌ను ఢీకొనాలంటే.. ఈ రేంజ్‌లోనే రాజ‌కీయాలు చేయ‌గ‌లిగిన నేర్పరి త‌నం ఉన్న మాస్ లీడ‌ర్ కావాల్సిన అవ‌స‌రం ఉంది. మోపిదేవి వెంకట రమణ ఈ విష‌యంలో ఫెయిల‌య్యార‌ని ఇక్కడ టాక్‌.

స్థానిక నేతల అభిప్రాయం మేరకు…

మోపిదేవి వెంకట రమణ గ‌తంలో మంత్రిగా చేసినప్పటి నుంచి క్లాస్ నాయ‌కుడిగా మారి క్షేత్రస్థాయిలో ప్రజ‌ల‌ను ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శలు వినిపిస్తుంటాయి. అందుకే ఆయ‌న‌కు-ప్రజ‌ల‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌ని.. అదే ఓట‌మికి దారితీసింద‌నే ప్రచారం కూడా ఉంది. మ‌రోవైపు అన‌గాని బ‌లంగా ప్రజ‌ల్లోకి చొచ్చుకుపోవ‌డం వ‌ల్లే రెండోసారి కూడా ఆయ‌న జ‌గ‌న్ ప్రభంజ‌నం త‌ట్టుకుని గెలిచార‌నే అంటున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ నుంచి ఎవ‌రిని నియ‌మించినా.. మాస్ లీడ‌ర్ అవ‌స‌రం ఇక్కడ ఎంతైనా ఉంద‌నేది స్థానిక నేత‌ల అభిప్రాయం మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News