ఆ సాహసం చేస్తారా?

భారత అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటులో అంతర్భాగమైన లోక్ సభలో 43 శాతం మంది సభ్యులు ఏదో రకమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. అందులోనూ 29 శాతం మంది [more]

Update: 2020-02-15 15:30 GMT

భారత అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటులో అంతర్భాగమైన లోక్ సభలో 43 శాతం మంది సభ్యులు ఏదో రకమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. అందులోనూ 29 శాతం మంది హత్య, హత్యాయత్నం, అత్యాచారం, కిడ్నాప్ వంటి తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటున్నారు. సాధారణ ప్రజల్లో ఒక శాతం మందిపై కూడా కేసులుండవు. అదే దేశానికి దిశానిర్దేశం చేసే వారిలో దాదాపు సగం మంది నేర చరితులంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏరకమైన సంకేతమనే ప్రశ్న తలెత్తుతుంది. గెలిచి వస్తున్న అభ్యర్థులలో నేరాభియోగాలను ఎదుర్కొంటున్న వారి సంఖ్య ప్రతి ఎన్నికలోనూ పెరుగుతూ వస్తోంది. 2013 నుంచి సుప్రీం కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుంటూ, సూచనలు చేస్తూ ఆదేశాలిస్తోంది. అయినప్పటికీ గడచిన నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ సంఖ్య పెరగడమే తప్ప తరగడం లేదు.

గెలుపు గుర్రాలు…

న్యాయస్థానాలు ఎటువంటి తీర్పులు ఇచ్చినా, చట్టాలు ఏం చెబుతున్నా ఏదో ఒక పక్కదారిని పార్టీలు అన్వేషిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం గెలుపు గుర్రాలు అనే ఏకైక సూత్రీకరణ. ప్రజలపై సామదానభేద దండోపాయాలు ప్రయోగించి తమ పార్టీని అధికారంలోకి తెస్తే చాలనే ఉదాసీన ధోరణిని అగ్రనేతలు అవలంబిస్తున్నారు. గెలుపు అవకాశాలను మాత్రమే చూస్తున్నారు తప్ప అభ్యర్థి యోగ్యత, అర్హతలను పట్టించుకోవడం లేదు. తాజాగా సుప్రీం కోర్టు ఇదే అంశాన్ని ప్రశ్నించింది. నేర చరిత కల అభ్యర్థులకు ఏ ప్రాతిపదికన టిక్కెట్లిస్తున్నారో చెప్పాలంటూ నిలదీసింది. గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యల్లో ఆరితేరిన పార్టీలు ఈ విషయంలో పెద్దగా బెదిరిపోతాయని భావించలేం. ఎందుకంటే 2004లో ఎన్నికైన లోక్ సభ ఎంపీల్లో 24 శాతం మంది పైన మాత్రమే కేసులున్నాయి. 2009కి వచ్చేటప్పటికి ఈ సంఖ్య 30 శాతానికి చేరుకుంది. 2014లో 34 శాతానికి , 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి 43 శాతానికి పెరిగింది. మహిళలపై అత్యాచారాల వంటి హేయమైన నేరాలకు పాల్పడినట్లుగా భావిస్తున్న వారిని సైతం పక్కన పెట్టేందుకు పార్టీలు సాహసించడం లేదు. ఇది అత్యంత దురద్రుష్టకరం. చట్టసభల గౌరవాన్ని భంగపరిచేదే.

తెలుగు రాష్ట్రాల్లోనూ…

తెలుగు రాష్ట్రాల్లోనూ నేరచరిత విషయంలో శాసనసభ్యుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో 32 శాతం ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ ను బట్టే తెలుస్తోంది. నేరం నిరూపితమైతే ఇవన్నీ కూడా అయిదు సంవత్సరాలకు మించి శిక్ష పడే కేసులు. తెలంగాణ రాష్ట్రంలో 39శాతం మంది ఎమ్మెల్యేలపై సీరియస్ కేసులున్నాయి. ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ప్రతీకార రాజకీయాలు సైతం ఈ సందర్భంగా చర్చనీయమవుతున్నాయి. ప్రత్యర్థులపై ఆయా పార్టీలు పరస్పరం కేసులు పెట్టుకోవడం, చట్ట పరంగా వేధించేందుకు పూనుకోవడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోందని కొందరు వాపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇదొక దారుణమైన ప్రహసనం. ఇటువంటి అంశాలపైన సైతం చట్టపరంగా , న్యాయపరంగా ఒక పరిష్కారాన్ని యోచించాలి. చట్టాల అమలు విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించే స్వేచ్ఛ ఉన్నతాధికారులకు కలిపిస్తే అక్రమ కేసులు , ప్రత్యర్థులపై వేధింపులు తగ్గుతాయి. ఈమేరకు వారిని శక్తిమంతం చేయాల్సిన బాధ్యతను న్యాయస్థానాలు తీసుకోవాలి.

న్యాయ ఘోష…

వివిధ రూపాల్లో సుప్రీం కోర్టు గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఎన్నికల కమిషన్ కు, పార్టీలకు, కేంద్రప్రభుత్వానికి ఆదేశాలిస్తూ వస్తోంది. అయితే ఆ సూచనలు, సలహాలు అమలుకు నోచుకోవడం లేదు. నేరం నిరూపణ అయిన వారి అనర్హతలకు సంబంధించి 2013లోనే న్యాయస్థానం తీర్పు చెప్పింది. కేసులను సాగదీయడం ద్వారా ప్రజాప్రతినిధులు తప్పించుకుంటున్నారనే అంశాన్ని గమనించి ఏడాదిలోపు అభియోగాల రంగు తేల్చి వేయాలని 2014లో ఆదేశమిచ్చింది. పెద్దగా ముందడుగు పడలేదు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయమంటూ 2017లో మరోసారి సుప్రీం కోర్టు సూచించింది. న్యాయపరంగా చొరవ కనిపిస్తోంది . కానీ చట్టసభల్లోనే తమ కాళ్లకు తాము బంధనాలు వేసుకునేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఆర్టికల్ 102కి సంబంధించి మార్పులు, 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణల ద్వారానే ప్రజాస్వామ్య సంస్కరణలు సాధ్యమవుతాయని ఆయా పార్టీలకు తెలుసు.అయితే పూనిక వహించడానికి సిద్దం కావడం లేదు. ప్రాంతీయ పార్టీలను పక్కనపెట్టినా రెండు జాతీయ పార్టీలను ఇందుకు తప్పు పట్టాల్సిందే. ఎందుకంటే గడచిన సార్వత్రిక ఎన్నికల్లో నేర చరిత కల అభ్యర్థులను బరిలో నిలిపేందుకు రెండు పార్టీలు పోటీలు పడ్డాయి. బీజేపీ తరఫున పోటీ చేసిన వారిలో 40 శాతం మందిపై కేసులుంటే కాంగ్రెసు తరఫున పోటీ చేసిన వారిలో 39 శాతం మందిపై కేసులు నమోదై ఉన్నాయి. అందుకే న్యాయస్థానాలు ఎంత చెప్పినా అరణ్య రోదనగా మిగిలిపోతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News