ముద్రగడకు ఇక తప్పేట్లు లేదే?

ఏపీలో బీజేపీ ఎలాగైనా పాగా వేయాలనుకుంటోంది. అందుకోసం అనేక‌ విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో రెడ్డి సామాజికవర్గం వైసీపీ వైపు ఉంటే కమ్మ సామాజికవర్గం టీడీపీకి అండగా [more]

Update: 2019-09-18 03:30 GMT

ఏపీలో బీజేపీ ఎలాగైనా పాగా వేయాలనుకుంటోంది. అందుకోసం అనేక‌ విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో రెడ్డి సామాజికవర్గం వైసీపీ వైపు ఉంటే కమ్మ సామాజికవర్గం టీడీపీకి అండగా ఉంటూ వస్తున్నారు. దాంతో మరో ప్రధాన సామాజికవర్గం కాపులు ఉన్నారు. వారిని దగ్గర తీయడం ద్వారా ఏపీలో జెండా పాతాలని బీజేపీ అనుకుంటోంది. ఈ క్రమంలో కాపు కులానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి తీసుకువస్తారని ప్రచారం సాగుతోంది. ముద్రగడ బీజేపీకి పాత కాపే. ఆయన 1998 ప్రాంతంలో పార్టీలో చేరి తరువాత బయటకు వెళ్ళిపోయారు. మళ్ళీ రెండు దశాబ్దాల తరువాత ఆయన్ని తేవాలన్నది బీజేపీ యత్నంగా ఉంది.

పెద్దాయన ఓకే అంటారా…?

చంద్రబాబుతో కాపులకు బీసీ రిజర్వేషన్లు కోసం అయిదేళ్ల పాటు పోరాడిన ముద్రగడ పద్మనాభానికి ఇపుడు చేతిలో పని లేకుండా పోయింది. చంద్రబాబు ఓడిపోవడంతో ఆ డిమాండ్ కూడా పక్కకు పోయింది. జగన్ కాపుల విషయంలో స్పష్టంగా ఉండడంతో ఆయన్ని ముద్రగడ పద్మనాభం ఏమీ అడగలేరు. ఇక కాపులు ఇపుడు వైసీపీకి మద్దతు ఇచ్చినా కూడా రిజర్వేషన్ల విషయాన్ని వారు ఎక్కడా ప్రస్తావించలేరు. దాంతో ముద్రగడ పద్మనాభం సైలెంట్ అయ్యారు. అయితే ఆయన్ని బీజేపీలోకి తీసుకుంటే కోస్తా అంతటా ఊపు వస్తుందని బీజేపీ భావిస్తోంది. కానీ ముద్రగడ పద్మనాభం జాతి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు జాతిని వదిలేసి ఆయన తన రాజకీయం చూసుకుంటే ఒప్పుకోరు. అందువల్ల ఆయన కచ్చితంగా కాపులను బీసీల్లో చేర్పిస్తామని కేంద్రం హామీ ఇస్తేనే చేరుతారు. ఎటూ ఈ సమస్య కేంద్రం పరిధిలోది కాబట్టి బీజేపీ ఈ మేరకు హామీ ఇవ్వాల్సివుంటుంది. మరి బీజేపీ దానికి సాహసిస్తుందా అన్నది చూడాలి. అయితే రాజకీయమే ప్రధానం కాబట్టి ముందు మాట ఇచ్చి పబ్బం గడుపుకోవచ్చు అనుకుంటే ఓ మాట అనేస్తారని అంటున్నారు. అ విధంగా పెద్దాయన ముద్రగడ పద్మనాభంను చేర్చుకుంటారని టాక్ నడుస్తోంది.

కాపుల మొగ్గు ఎటు?

ఇదిలా ఉండగా కాపుల మద్దతు ఎవరికి అన్న ప్రశ్న వస్తే వారు అన్ని పార్టీలకు ఇస్తున్నారు. ముఖ్యంగా తాజా ఎన్నికల్లో వారు మెజారిటీ వైసీపీ వైపు ఉన్నారు. మిగిలిన వారు జనసేనకు ఓటేశారు. టీడీపీకి కూడా కాపు ఓట్లు బాగానే పడ్డాయి. బీజేపీ అధ్యక్షుడు కాపు నేత అయినా ఆ వైపు కాపులు తొంగి చూడలేదు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు అయినా కూడా జగన్నే కాపులు ఎంచుకున్నారు. దీన్ని బట్టి చూస్తే కాపులు తమకు కులం కంటే అభివ్రుధ్ధి రాజకీయం, సరైన నాయకత్వం ముఖ్యమని ప్రతీ ఎన్నికలోనూ చెబుతున్నారు. ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం వంటి వారు చేరినా పవన్ బీజేపీకి మద్దతుగా నిలిచినా కూడా గంపగుత్తగా కాపుల ఓట్లు బీజేపీకి మళ్ళుతాయని చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News