ముద్రగడ ఆ నిర్ణయం తీసుకోలేరట

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం రాజకీయంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? బీజేపీలో చేరాలని వచ్చిన ఆఫర్ ను ముద్రగడ పక్కన పెట్టారా? అంటే అవుననే అంటున్నారు ఆయన [more]

Update: 2021-02-11 12:30 GMT

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం రాజకీయంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? బీజేపీలో చేరాలని వచ్చిన ఆఫర్ ను ముద్రగడ పక్కన పెట్టారా? అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. ముద్రగడ పద్మనాభం రాజకీయాలను వదిలేసి చాలా కాలమే అయింది. ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా కేవలం మొన్నటి వరకూ కాపు ఉద్యమానికే పరిమితమయ్యారు. ఇప్పుడు దానిని కూడా వదిలేశారు. ప్రస్తుతం కిర్లంపూడిలోనే ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు.

ఆఫర్ ఇచ్చినా…..

అయితే ఇటీవల ముద్రగడ పద్మనాభంను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. బీజేపీలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. బీజేపీ లో చేరితే రాజ్యసభ పదవి కూడా ముద్రగడ పద్మనాభంకు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ ముద్రగడ పద్మనాభం బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేరంటున్నారు. ఏపీలో బీజేపీ ఎదుగదలకు అవకాశాలు లేవన్నది ఆయన అంచనాగా ఉంది.

అధికారంలోకి రాలేదని….

బీజేపీ, జనసేన కలసినా అది అధికార పార్టికి ఉపయోగపడుతుంది తప్ప అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని ముద్రగడ పద్మనాభం తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కాపు రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన బీజేపీలో చేరేందుకు ఇష్టపడటం లేదని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల విషయంలో బిల్లు ఆమోదించేందుకు ముందుకు వస్తే తాను బేషరతుగా బీజేపీలో చేరతానని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది.

దూరంగా ఉండాలనే…..

కానీ బీజేపీ అది చేయదని, చేయలేదన్న విషయం ముద్రగడ పద్మనాభంకు తెలుసు. అందుకే ఆయన బీజేపీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. మరోవైపు వైసీపీకి సన్నిహితంగా ఉన్నట్లే ఆయన సిగ్నల్స్ ఇస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరిని ముద్రగడ పద్మనాభం తప్పుపట్టారు. ఆయనకు లేఖ రాశారు. నిజానికి ఆయనకు నిమ్మగడ్డ కు లేఖ రాయాల్సిన అవసరం లేదు. కానీ ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News