ముద్రగడ జగన్ ను టార్గెట్ చేశారా?

కాపు రిజర్వేషన్ ఉద్యమ సారధి, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రూటే సపరేట్. ఏ పని చేసినా పతాక శీర్షికలకు చేరడం ముద్రగడకు కొత్తకాదు. వైసిపి ప్రభుత్వం [more]

Update: 2021-06-29 14:30 GMT

కాపు రిజర్వేషన్ ఉద్యమ సారధి, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రూటే సపరేట్. ఏ పని చేసినా పతాక శీర్షికలకు చేరడం ముద్రగడకు కొత్తకాదు. వైసిపి ప్రభుత్వం వచ్చాకా అప్పుడప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖల ద్వారా సలహాలు సూచనలు ఇవ్వడం తప్ప ఆయన కాపు రిజర్వేషన్ ల పోరాటం పక్కన పెట్టేశారు. ఇది తన చేతుల్లో లేదని ఎన్నికలకు ముందే జగ్గంపేట – ప్రత్తిపాడు నియోజకవర్గాల మీదుగా జగన్ పాదయాత్రలో స్పష్టంగా చెప్పేశారు. ముద్రగడ పద్మనాభం ఇలాకాలోనే జగన్ ఇలా కుండబద్ధలు కొట్టేలా నిజం చెప్పేయడం, అయినా కానీ కాపు నేతలు పలువురు వైసిపి నుంచి గెలుపొందడం, ఒక్క రాజోలు ఎస్సి నియోజకవర్గం మినహా జనసేన ఘోరపరాజయం, ఇక భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరింత ఘోరంగా ఓడి పోవడం వంటి పరిణామాలను విశ్లేషించుకున్న ముద్రగడ పద్మనాభం తన ఉద్యమాన్ని సైతం పక్కన పెట్టేశారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

ఇంతకన్నా చేసేదేమి లేదనేనా …?

రాజకీయంగా చేయాలిసిన పదవులు కూడా ముద్రగడ పద్మనాభంకు ఏమి లేవు. గతంలో ఆయన అనుభవించిన భోగాలకు మించి కూడా ఇప్పుడు పదవులు ఏమి రెడీ గా లేవు. ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియా లో ముద్రగడపై టిడిపి, జనసేన అనుకూలురు పెద్ద ఎత్తున విమర్శలు మొదలు పెట్టడంతో ముద్రగడ పద్మనాభం కు ఆగ్రహం తెప్పించింది. తాను కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటారని సంచలన ప్రకటన చేశారు ఆ మధ్యన. ఆ తరువాత కూడా ఆయన క్రియాశీల రాజకీయాలకు కాపు ఉద్యమానికి పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల తొలిసారి మాత్రం జగన్ సర్కార్ తీరును తప్పుపడుతూ లేఖ విడుదల చేయడం చర్చనీయం అయ్యింది.

విజయసాయి పై ఘాటుగా …

అశోక్ గజపతి రాజు పై విజయసాయి వ్యవహారశైలి ని తీవ్రంగా దుయ్యబట్టారు ముద్రగడ పద్మనాభం. గజపతుల త్యాగాలను మరచి రాజకీయ ప్రయోజనాలకోసం వారిని తక్కువ చేస్తే చిక్కుల్లో పడతారు జాగర్త అంటూ ఘాటుగానే చురకలు అంటించారు ముద్రగడ. చంద్రబాబు సర్కార్ పై ఒంటికాలిపై లేవడమే కాదు టిడిపి ప్రభుత్వం వెర్సెస్ ముద్రగడ ల నడుమ వార్ ఉప్పునిప్పుల్లాగే సాగింది. అయితే జగన్ సర్కార్ పై సాఫ్ట్ కార్నర్ లో ఉన్న పద్మనాభం ఇప్పుడు గొంతు మార్చడం దేనికి సంకేతం అన్నది హాట్ టాపిక్ అవుతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏదైతే అశోక్ గజపతి రాజు ఆయన కుటుంబం పై చేశారో ఇంచుమించు అదే భావనతో ఆయన లేఖ విడుదల చేయడం కూడా రాజకీయ విశ్లేషకులను ఆలోచింప చేస్తుంది.

బిజెపికి దగ్గరా? దూరమా ?

ముద్రగడ పద్మనాభం బిజెపి కి దగ్గరయ్యే పనిలో ఉన్నారా ? కాపు రిజర్వేషన్ లు సాధించాలంటే కేంద్రం తోనే సాధ్యం అవుతుందని ఆ పార్టీలో చేరాలంటే ఇలాంటి షరతులు ఏమైనా పెట్టి ఎదురు చూస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ముద్రగడను బిజెపి లోకి రప్పించేందుకు జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు పలు దఫాలు చర్చలు జరిపినా ఆయన ససేమిరా అనే చెప్పేశారు. వ్యక్తిగత కారణాలతో కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్న పద్మనాభం రాజకీయం ఆయనతోనే ముగుస్తోందా వారసత్వంతో తిరిగి చిగురిస్తుందా అన్నది కూడా స్పష్టం కావడం లేదు. అయినప్పటికి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు ఎపి లో కాపు ఓటర్లను గట్టిగా ప్రభావితం చేసే సత్తా ఉన్న నేత ఇలా అజ్ఞాతవాసిగా ఎంతకాలం ఉంటారన్నది అంతు చిక్కని విధంగానే ఉండటం విశేషం.

Tags:    

Similar News