Mudragada : ముద్రగడకే మాట వినలేదు.. నీకింటారా?

కాపులను ఏకం చేసే సత్తా ఎవరికుంది? మూడు నెలలకొకసారి వచ్చి పోయే పవన్ కల్యాణ్ ను కాపు సామాజికవర్గం విశ్వసిస్తుందా? అసలు కాపుల్లో ఐక్యత సాధ్యమేనా? అన్న [more]

Update: 2021-10-14 00:30 GMT

కాపులను ఏకం చేసే సత్తా ఎవరికుంది? మూడు నెలలకొకసారి వచ్చి పోయే పవన్ కల్యాణ్ ను కాపు సామాజికవర్గం విశ్వసిస్తుందా? అసలు కాపుల్లో ఐక్యత సాధ్యమేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ రాజమండ్రిలో పర్యటించినప్పుడు కాపులంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. కాపు, బలిజ, ఒంటరి, పెరిక వంటి వర్గాలన్నీ ఒక్క తాటిపైకి రావాలన్నారు. ఇందుకోసం కాపు పెద్దలు కృషి చేయాలని పరోక్షంగా ముద్రగడ పద్మనాభం వంటి నేతలకు ఆయన చెప్పినట్లయింది.

కాపుల ఐక్యతపై….

నిజంగా కాపులు ఐక్యంగా ఉంటారా? వారితో పాటు బలిజ, ఒంటరి, పెరిక వంటి సామాజికవర్గాలు కలసి వస్తాయా? అన్నది సందేహమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపులు కీలకం. వాళ్లే నిర్ణయాత్మక శక్తిగా చెప్పుకోవాలి. అయితే వారిని ఏకతాటిపైకి తెచ్చే నాయకత్వం మాత్రం లేదు. నిన్న మొన్నటి వరకూ ముద్రగడ పద్మనాభం కాపులకు పెదకాపుగా వ్యవహరించారు. ఆయనను తమ నేతగా కాపులు గుర్తించారనే చెప్పాలి.

సుదీర్ఘ పోరాటం….

1990 దశకం నుంచే ముద్రగడ పద్మనాభం కాపు సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చారు. కాపు రిజర్వేషన్ల అంశం తీసుకుని రాజకీయాలకు అతీతంగా ముద్రగడ చేసిన పోరాటానికి మంచి మద్దతు లభించింది. అన్ని జిల్లాలు తిరిగి ఆయన కాపులను ఏకం చేసే ప్రయత్నం చేశారు. చివరకు ఆయనే విసుగు చెంది కాడి వదిలేయాల్సి వచ్చింది. ఇక ముద్రగడ పద్మనాభం గతంలో ఇచ్చిన పిలుపును కూడా కాపు సామాజికవర్గం లైట్ గా తీసుకుంది.

ఓటు వేయొద్దన్నా…?

2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ కి ఓటు వేయవద్దని కాపు సామాజికవర్గానికి ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. నంద్యాలను పక్కన పెడితే ముద్రగడ సొంత జిల్లాలో ఉన్న కాకినాడ కార్పొరేషన్ లో టీడీపీయే విజయం సాధించింది. ఇప్పుడు ఆ విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. బలమైన కాపు నేతగా ముద్రగడ పద్మనాభం వల్ల కానిది, కాపుల్లో ఐక్యత పవన్ వల్ల వస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవుట్ డేటెడ్ నేత అయిన హరిరామ జోగయ్య వంటి వారిని కాపులే పెద్దగా పట్టించుకోరంటున్నారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి ముదగ్రడ పద్మనాభం పేరు ఆ సామాజికవర్గంలో బలంగా వినపడుతుంది.

Tags:    

Similar News