మాగంటి ఇంట ఏం జరుగుతోంది…?
మాగంటి మురళీ మోహన్. గత 2014 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన టీడీపీ సీనియర్ నాయకుడు. పైగా చంద్రబాబుకు సన్నిహితుడు కూడా. 2009 ఎన్నికల్లోనూ ఆయన [more]
మాగంటి మురళీ మోహన్. గత 2014 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన టీడీపీ సీనియర్ నాయకుడు. పైగా చంద్రబాబుకు సన్నిహితుడు కూడా. 2009 ఎన్నికల్లోనూ ఆయన [more]
మాగంటి మురళీ మోహన్. గత 2014 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన టీడీపీ సీనియర్ నాయకుడు. పైగా చంద్రబాబుకు సన్నిహితుడు కూడా. 2009 ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసినా.. ఓటమి పాలయ్యారు. దీంతో ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో నియోజకవర్గంలో పాదయాత్రలు నిర్వహించి, ప్రజలను మెప్పించి రాజమండ్రి ఎంపీగా విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత కాలంలో ఇసుక మాఫియాకు ఊతమిచ్చారని, భూకబ్జాలు జరిగినా.. చూస్తూ.. ఊరుకున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండరని, వారి సమస్యలను పట్టించుకునే తీరికి కూడా ఆయనకు లేదని ఆరోపణలు వెలుగు చూశాయి.
కోడలు రూపాదేవిని….
అదే సమయంలో 2014 ఎన్నికలకు ముందు ప్రజల్లో ఉన్నారని, ఎన్నికలు ముగిసి.. విజయం సాధించిన తర్వాత ప్రజలను మరిచిపోయారనే వ్యాఖ్యలు కూడా మురళీ మోహన్ విషయంలో వినిపించాయి. ఈ క్రమంలోనే ప్రజలకు అందుబాటులో ఉండేలా తన రాజకీయ వారసురాలిగా మురళీ మోహన్ తన కోడలు రూపాదేవిని రంగంలోకి దింపారు. అనధికార ఎంపీగా ఆమె మామ గారి తరపున ప్రజల్లో బాగానే కలిసిపోయారు. సమస్యలు తెలుసుకోవడం, ప్రజల మధ్య ఉండడం వంటివి చేసినా.. మామపై ఉన్న వ్యతిరేకతను మాత్రం ఆమె అరికట్టలేకపోయారు.
మామపై ఉన్న వ్యతిరేకత….
ఈ ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే రూపాదేవి రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నారు. టీడీపీ శిక్షణ తరగతులతో పాటు పార్టీకి తెరవెనక ఎంతో కష్టపడ్డారు. అయితే స్థానికంగా మామ మురళీ మోహన్ పై ఉన్న వ్యతిరేకతను మాత్రం ఆమె కంట్రోల్ చేయలేకపోయారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాగంటి మురళీ మోహన్ తనకు బదులుగా రూపాదేవికి టికెట్ ఇప్పించుకుని రాజమండ్రి ఎంపీగా పోటీ చేయించుకున్నారు. అయితే, ప్రజల్లోని వ్యతిరేకత కారణంగా ఎన్నికల్లో ఆమె పూర్తిస్థాయిలో మెరవలేక పోయారు. దీంతో రూప ఓటమి పాలయ్యారు. మరో పక్క, మురళీ మోహన్ అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు.
కష్టపడితే….
ఈ ఎన్నికల్లో రూపాదేవి ఏకంగా 1.20 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ఇంత భారీ ఓటమి వెనక పార్టీపై ఉన్న వ్యతిరేకత ఓ కారణం అయితే రెండో కారణం మురళీమోహన్‌పై ఉన్న వ్యతిరేకత కూడా. ఇక ఇప్పుడు మురళీమోహన్ రాజకీయాలకు దూరం అవ్వడంతో … ఇప్పుడు ఆయన కోడలు రాజకీయాల్లో నెగ్గుకు రాగలరా? భవిష్యత్తు ఎలా ఉండనుంది? అనే చర్చ పార్టీలో ఎక్కువగా సాగుతోంది. వాస్తవాలను పరిశీలిస్తే.. రూపాదేవికి టీడీపీలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే, ఆమె ఎన్నికలకు కొద్ది రోజుల ముందే సీటు తెచ్చుకుని పోటీ చేయడంతో సక్సెస్ కాలేక పోయారు. కానీ, ఇప్పటి నుంచి కనుక క్షేత్రస్థాయిలో ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేసి దూసుకుపోగలిగితే రూపాదేవికి రాజకీయ భవిష్యత్తు ఉండడంతో పాటు మాగంటి రాజకీయ వారసత్వం రెండూ నిలబడతాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.