నాగం… చరిత్ర ఇక సమాప్తం..?

నాగం జనార్ధన్ రెడ్డి… ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన నేత. ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. [more]

Update: 2018-12-30 02:30 GMT

నాగం జనార్ధన్ రెడ్డి… ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన నేత. ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా మంత్రిగా కూడా పనిచేశారు. ఇక టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా కూడా ఆయన చాలా కీలకంగా ఉండేవారు. అప్పట్లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శల దాడి చేసేవారు. అయితే, తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యాక నాగం జనార్ధన్ రెడ్డి పరిస్థితులు తలకిందులయ్యాయి. అలా అని ఆయన ఉద్యమానికి వ్యతిరేకంగా ఏమీ పని చేయలేదు. మొదట్లో టీడీపీలో ఉండి కొంత వ్యతిరేకత మూటగట్టుకున్నా తర్వాత ఆయన సమైక్య పార్టీగా ముద్రపడ్డ టీడీపీని వీడి బయటకు వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ప్రత్యేకంగా ఓ పార్టీ పెట్టి తన వంతుగా ఉద్యమంలో పాల్గొన్నారు. రాజీనామా చేసిన నాగర్ కర్నూల్ లో మళ్లీ గెలిచినా గత ఎన్నికల్లో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీలో చేరిన ఆయన గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటుకి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కుమారుడు తన స్వంత నియోజకవర్గం నాగర్ కర్నూల్ నుంచి ఓడిపోయారు.

నాగం లేకపోవడంతో పాతుకుపోయిన మర్రి…

బీజేపీలో ఇమడలేకపోయిన నాగం ఏడాది క్రితం మూడు దశాబ్దాలుగా ఏ పార్టీనైతే వ్యతిరేకించారో అదే పార్టీలో చేరిపోయారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయినా, ఆయన అంతకుముందులా యాక్టీవ్ గా లేరు. ఇక ఇటీవలి ఎన్నికల్లో ఆయన నాగర్ కర్నూల్ లో పోటీ చేసి ఎవరూ ఊహించని విధంగా ఓటమిపాలయ్యారు. సుమారు 50 వేలకు పైగా ఓట్లతో ఆయన ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి సాధించిన ఓట్లలో సగం మార్కును కూడా నాగం చేరలేకపోయారు. గత ఎన్నికల్లో జనార్ధన్ రెడ్డి నియోజకవర్గానికి దూరమై ఎంపీగా పోటీ చేయడమే ఆయనకు చేటు చేసింది. నాగం లేకపోవడంతో మర్రి జనార్ధన్ రెడ్డి 2014లో సులువుగా గెలిచారు. గెలిచాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, జిల్లా కేంద్రం కావడం వంటి కారణాలతో మర్రి జనార్ధన్ రెడ్డి అక్కడ పాతుకుపోయారు. దీంతో నాగం జనార్ధన్ రెడ్డికి తీవ్ర పరాభవం ఎదురైంది.

ఇక రిటైర్డ్ అయినట్లేనా..?

ఇక, ఇప్పుడు నాగం పరిస్థితేంటి అనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా లేదా వారసుడిని తెరపైకి తీసుకువస్తారా అనేది చూడాలి. ఓడిపోయిన నాటి నుంచి ఆయన తెరపై కనిపించడం లేదు. మరి, ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉండే అవకాశాలు తక్కువే. ఒకవేళ ఆయన అడపాదడపా ప్రెస్ మీట్లు, ఇతర పార్టీ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉన్నా ఆయన ప్రత్యక్షంగా పోటీకి మాత్రం ఇక దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన వారసుడిగా కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆయన 2014లో పోటీ చేసి ఓడారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి మాత్రం ఇప్పుడు కష్టకాలంలోనే ఉన్నారు. పైగా తన రాజకీయ వారసుడికి కూడా పూలబాట ఏమీ లేదు. మొత్తానికి నాగం జనార్ధన్ రెడ్డి ఇటీవలి ఎన్నికల ఫలితాలతో రాజకీయాల్లో నుంచి ఇంచుమించు రిటైర్డ్ అయినట్లే కనిపిస్తోంది.

Tags:    

Similar News