ఫలితమేదైనా..‘పరువు’ సాగర్ లో కలసిపోనుందా?
ఎన్నికల్లో సాధారణంగా ప్రతి పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తుంది. కానీ తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలను పరువు కోసం పరుగులు పెట్టిస్తోంది. వాటికి [more]
ఎన్నికల్లో సాధారణంగా ప్రతి పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తుంది. కానీ తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలను పరువు కోసం పరుగులు పెట్టిస్తోంది. వాటికి [more]
ఎన్నికల్లో సాధారణంగా ప్రతి పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తుంది. కానీ తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలను పరువు కోసం పరుగులు పెట్టిస్తోంది. వాటికి దడ పుట్టిస్తూ బెంబేలెత్తిస్తోంది. ఎందుకొచ్చిన ఎన్నిక, బాబోయ్ అంటూ బెంగపెట్టుకుంటున్నాయి. గెలుపు మీద ఏ పార్టీకి స్పష్టమైన నమ్మకం లేకపోవడమే దీనికి కారణం. ఏ కోణంలో చూసినా తాము దెబ్బతింటామనే లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ ఎన్నికలో పరువు కాపాడుకోవడమెలా? అన్న ప్రశ్నతో సతమతమవుతున్నాయి . గెలిస్తే ఊపిరి పీల్చుకోగలుగుతాము. అదే ఓటమి పాలైతే ఎదురయ్యే పరిణామాలేమిటన్న ప్రశ్న అదికార, ప్రతిపక్షాలను వేదిస్తోంది. తానూ ఉన్నానంటూ తాజాగా సవాల్ విసురుతున్న బీజేపీకి సైతం చెమటలు పడుతున్నాయి. ఇటీవల తెలంగాణలో సాధించిన విజయాలన్నీ సాగర్ లో కలిసిపోతాయేమోనన్నదే ఆ పార్టీ భయం. నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన సాగర్ అధికార పార్టీకి సిట్టింగ్ స్థానం. కానీ 2018 నాటి ఏకపక్ష రాజకీయ సానుకూలత ప్రస్తుతం టీఆర్ఎస్ కు లేదు. అందులోనూ పార్టీ తరఫున నిలుచునే బలమైన అభ్యర్థీ కనిపించడం లేదు. కాంగ్రెసుకు గట్టి అభ్యర్థి జానారెడ్డి. కానీ ఆయన నిలుచుంటారా? లేకపోతే చివరిక్షణంలో సాకులు చెబుతారా? అన్న సంశయం తేలడం లేదు. బీజేపీ పరిస్థితి మరీ దారుణం. కాంగ్రెసు నేత జానారెడ్డికి వల వేయాలని యత్నించి విఫలమైంది. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు అటు అభ్యర్థి దొరకలేదు. ఇటు పార్టీ బలహీనత బయటపడిపోయింది.
దానా..దీనా.. జానా యే…
తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలవాల్సిన కాంగ్రెసు పార్టీ క్రమేపీ తన స్థానాన్ని కోల్పోతోందేమోననే అనుమానాలు ఇటీవల బలపడుతూ వస్తున్నాయి. ఉమ్మడి నల్టొండ జిల్లా ఆ పార్టీకి బలమైన కేంద్రం. ఉత్తమ్ , కోమటిరెడ్డి, జానారెడ్డి వంటి అగ్రనాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ అంతర్గత విభేదాలతో తమను తాము బలహీనపరుచుకున్నారు. వామపక్షాలు, తెలుగుదేశం వంటి పార్టీల నుంచి బలమైన నాయకత్వాన్ని టీఆర్ఎస్ ఆకర్షించింది. దాంతో కాంగ్రెసు మరింత డీలా పడింది. ప్రస్తుతం జరగబోయే ఉప ఎన్నిక కాంగ్రెసుపార్టీకి రాష్ట్రంలో అత్యంత కీలకమైనది. ఈ ఎన్నికలో విజయం సాధించకపోతే పార్టీకి ఎదురయ్యే రాజకీయ పర్యవసానాలు అనూహ్యంగా ఉంటాయి. టీఆర్ఎస్ కు మాత్రమే కాకుండా బీజేపీకి కూడా లోకువైపోతుంది అందుకే ఎన్నో యుద్ధాల ఆరితేరిన జానారెడ్డిని అభ్యర్థిగా నిలపాలని భావిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా తన ప్రతిష్ఠను కాపాడుకోవాలంటే ఆయన తప్ప వేరెవరూ దిక్కులేదని భావిస్తోంది. ఈ బలహీనత కాంగ్రెసు పార్టీ దయనీయ స్థితికి దర్పణం పడుతోంది ఇంతచేసినా కోమటిరెడ్డి సోదరులు సహకరించకుంటే విజయం సాధించగలమా? అన్న సందేహమూ వెన్నాడుతోంది.
ఈ దెబ్బ కష్టమే…
ఈ ఒక్క సీటుతో అధికార రీత్యా వచ్చేది పోయేది ఏమీలేదు టీఆర్ఎస్ కు. కానీ రాజకీయంగా తీవ్ర నష్టం తప్పదు. నైతికంగా టీఆర్ఎస్ శ్రేణులు డీలాపడి ఉన్నాయి. తెలంగాణ ప్రజలు సెంటిమెంటుకు ప్రాధాన్యం ఇచ్చేలా కనిపించడం లేదు. దుబ్బాకలో కుటుంబ సెంటిమెంటును ప్రయోగిస్తే దారుణ ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులను పోటీకి పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. నియోజకవర్గంలో ప్రాబల్య రాజకీయ సామాజిక వర్గమైన రెడ్డి వర్గీయులు సహకరించరేమోననే సందేహాలు ఉన్నాయి. అదే సమయంలో నర్సింహయ్య కుటుంబానికి అన్యాయం చేస్తే యాదవ సామాజిక వర్గం దెబ్బతీస్తుందేమోననే అనుమానాలు నెలకొంటున్నాయి. ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది అదికారపార్టీ పరిస్థితి. దుబ్బాక, జీహెచ్ ఎంసీ తర్వాత వరసగా పరాజయం పాలైతే రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రభావం పడుతుంది. భారీ మెజార్టీతో గెలవకుండా అత్తెసరు విజయం సాధించినా పార్టీ పని అయిపోయిందనే విపక్షాలు వాదిస్తాయి. అందుకే క్యాండిడేట్ ఎంపిక నుంచే టీఆర్ఎస్ కు కష్టాలు తప్పకపోవచ్చు.
వాడిన వదనం…
2023 ఎన్నికలకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్న కమలం పార్టీకి కూడా ఈ ఎన్నికలు షాక్ లాగే కనిపిస్తున్నాయి. తమ వద్ద ఉన్న సకల అస్త్రాలు ప్రయోగించి, సర్వశక్తులు పణంగా పెట్టి ఇటీవల విజయాలు సాదించింది బీజేపీ. నాగార్జున సాగర్ లో ఓట్ల ఎదురీత దుబ్బాక, జీహెచ్ ఎంసీ తరహాలో ఉండదని కమలనాథులకు తెలుసు. అందుకే సామదానబేదోపాయాలన్నీ ఉపయోగించు కోవాలనుకుంది. జానారెడ్డిని తమ పార్టీలోకి తీసుకుని అడ్డదారిలో రాజకీయ ప్రయోజనాలు నొల్లుకోవాలని చూసింది. కానీ క్షేత్రస్థాయిలో బీజేపీకి సానుకూల పరిస్థితులు లేవని గ్రహించిన జానారెడ్డి ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దాంతో బీజేపీకి మొదటి దెబ్బ పడింది. పోటీ కాంగ్రెసు, టీఆర్ఎస్ ల మధ్య కేంద్రీకృతమైతే భారీగా నష్టపోయేది బీజేపీనే. తాము కనీస పోటీ ఇచ్చే స్థాయిలో లేకపోతే పార్టీ సానుభూతిపరుల ఓట్లు సైతం పూర్తిగా పడవన్నసంగతి బీజేపీ నాయకులకు తెలుసు. అందుకే గట్టి అభ్యర్థిని నిలిపి త్రిముఖ పోటీ బలంగా ఉందనే భావన కల్పించాలి. గెలుపు సాధించకపోయినా గణనీయసంఖ్యలో ఓట్లు లభిస్తాయి. తెలంగాణలో తాము ప్రత్యామ్నాయ శక్తి కాబోతున్నామని క్లెయిం చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఫలితాల ప్రభావం సాగర్ తో శూన్యంగా మిగిలిపోతుంది. పార్టీ పరువు కాపాడుకోవాలంటే ప్రధాన ప్రత్యర్థులతో సై అంటూ ఢీకొట్టాల్సిన అనివార్యత బీజేపీకి ఏర్పడింది. మొత్తమ్మీద సాగర్ అన్ని పార్టీలకు ఒక రాజకీయ సమస్యగా మారింది.
-ఎడిటోరియల్ డెస్క్