నల్లారి వస్తే మంచిదేగా?

మూడున్నరేళ్ళ పాటు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలన సాగించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి జనంలో పెద్దగా బలం లేదు, కానీ ఉన్నంతలో బాగా [more]

Update: 2019-11-22 03:30 GMT

మూడున్నరేళ్ళ పాటు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలన సాగించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి జనంలో పెద్దగా బలం లేదు, కానీ ఉన్నంతలో బాగా చేశాడనిపించుకున్నారు. ఆయన పాలనలో రచ్చబండ ద్వారా రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వడం, తొమ్మిది రకాలైన నిత్యావసర సరకులు పంపిణీ చేయడం ఇప్పటికీ ప్రజలు మరచిపోరు. కరడు కట్టిన సమైక్యవాదిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ నుఎదుర్కొన్న తీరుకు నాడు ఆంధ్రులు ఎంతో మద్దతు ఇచ్చారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ విధానాన్ని నిరసిస్తూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టడం ఓ రాజకీయ ముచ్చట. ఏది ఏమైనా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం మంచి సీఎంగానే జనంలో పేరు సంపాదించారు. అయితే ఆయనను అప్పటి తెలంగాణా ఉద్యమం. ఓ వైపు సమైక్యాంధ్ర పోరాటాలు ఉక్కిరిబిక్కిరి చేశాయని చెప్పాలి.

పీసీసీ పెద్దగా….

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నిక ముందు కాంగ్రెస్ పార్టీ చేరారు. ఆయన్ని రాహుల్ గాంధి స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విభజన తరువాత బీజేపీలో చేరుతారని వూహాగాలను విపించాయి. అయితే ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు. అయితే ఎన్నికల వేళ ఏపీలో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ కి ఆయన ప్రచారం కూడా చేయ‌లేదు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తులు ఉంటాయని భావించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారని అంటారు. అయితే పొత్తులు పెటాకులు కావడంతో ఆయన పోటీ కూడా చేయలేదు. ఇక నాటి నుంచి మళ్ళీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగానే అలా తెర వెనక ఉండిపోయారు. ఇపుడు ఆయన పేరు మళ్ళీ గట్టిగా వినిపిస్తోంది. ఆయన్ని పీసీసీ ప్రెసిడెంట్ గా చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది.

వ్యూహాత్మకమా…?

ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం జగన్ కొల్లగొట్టారు. ముఖ్యంగా రాయలసీమను జగన్ పూర్తిగా తుడిచిపెట్టేశారు. రెడ్డి సామాజికవర్గం అంతా కూడా జగన్ వెనకాల నిలిచింది. ఈ నేపధ్యంలో రెడ్డిల పార్టీగా ముద్రపడిన కాంగ్రెస్ కి మళ్ళీ ఆ ఓట్లు, బలం రావాలంటే సీమ ప్రాంతానికి చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయితే బాగుంటుందని భావిస్తున్నారుట. పైగా కిరణ్ కి జనంలో మంచి పేరు ఉండడం, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆయన జనాలకు పరిచయం ఉండడంతో పీసీసీ చీఫ్ కి బెస్ట్ చాయిస్ అవుతారని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తలపోస్తున్నారుట.

రాజ్యసభ సీటు ఇస్తారా…?

అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏమీ లేని ఏపీ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ పెద్దగా ఉండేందుకు అంగీకరిస్తారా అన్నది చూడాలి. అయితే ఒక షరతు మీద ఆయన ఒప్పుకోవచ్చునని అంటున్నారు. అదేమంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి ఆయన్ని రాజ్యసభకు ఎంపీగా ఎంపిక చేస్తే ఆయన ఇక్కడ పీఠమెక్కడానికి రెడీ అవవచ్చు అంటున్నారు. మరి నోటా కంటే తక్కువ ఓట్లు ఏపీలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పెద్దల సభకు పంపి ప్రయోగం చేస్తుందా అన్నది కూడా చూడాలి. మరోవైపు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పీసీీసీ చీఫ్ గా నియమిస్తే అది జగన్ లాభిస్తుందని కూడా అంటారు. వైఎస్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. జగన్ ను అన్యాయంగా కేసుల్లో ఇరికించే యత్నంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక చేయి వేశారన్నది అప్పటి కాంగ్రెస్ నేతల ఆరోపణ. మరోవైపు ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టినా అది జగన్ కు లాభిస్తుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.

Tags:    

Similar News