ఈయనకు అది కూడా చేతకావడం లేదా?

అవకాశం ఉన్నప్పుడే అందిపుచ్చుకోవాలి. ప్రత్యర్థి వర్గం వీక్ అవుతున్నప్పుడే మనం బలపడేందుకు ప్రయత్నించాలి. కానీ ఆయనకు మాత్రం ఆ స్పృహ లేదు. తనను దారుణంగా రెండసారి ఓడించారన్న [more]

Update: 2020-12-14 14:30 GMT

అవకాశం ఉన్నప్పుడే అందిపుచ్చుకోవాలి. ప్రత్యర్థి వర్గం వీక్ అవుతున్నప్పుడే మనం బలపడేందుకు ప్రయత్నించాలి. కానీ ఆయనకు మాత్రం ఆ స్పృహ లేదు. తనను దారుణంగా రెండసారి ఓడించారన్న కసి కావచ్చు. కోపం కావచ్చు. వస్తున్న అవకాశాలను కూడా ఆయన సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఆయనే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. పీలేరు నియోజకవర్గంలో పార్టీని పూర్తిగా గాలికి వదిలేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అక్కడ బలపడేందుకు కనీస ప్రయత్నాలు చేయడం లేదు.

వరస ఓటములతో…..

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో తన అన్న కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో చింతల రామచంద్రారెడ్డిపై ఓటమిపాలయ్యారు. తర్వాత టీడీపీలో చేరి 2019 ఎన్నికల్లో పోటీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి అధిక ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇదే ఆయనను హర్ట్ చేసిందంటున్నారు.

పదిహేను నెలలుగా…

అందుకే ఆయన పదిహేను నెలలుగా పీలేరు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. అయితే ఇక్కడ అధికార పార్టీ ఏమైనా సంతోషంగా ఉందా? అంటే అదీ లేదు. ఇక్కడ గ్రూపు విభేదాలతో పార్టీ మూడు ముక్కలుగా చీలిపోయింది. ఈ అవకాశాలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నమూ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చేయడంలేదు. ఎన్నికల సమయంలో చూసుకుందాములే అన్న ధోరణిలో ఆయన ఉన్నట్లు కనపడుతుంది.

అందివచ్చిన అవకాశాన్నీ…..

పీలేరు వైసీపీలో ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి వర్గం, ఎంపీ మిధున్ రెడ్డి వర్గాలుగా చీలిపోయి ఉంది. అభివృద్ధి పనుల విషయంలోనూ రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. పార్టీ పరువును బజారుకీడుస్తున్నాయి. ఇది స్థానిక ప్రజలకు కూడా ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రయత్నించవచ్చు. అది ఆయనకు ప్లస్ కూడా అవుతుంది. కానీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం అటు వైపు చూడకపోవడంతో టీడీపీకి దిక్కుమొక్కు లేకుండా పోయారు. ఇప్పటికైనా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరులో పార్టీ క్యాడర్ ను పట్టించుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News