సిగ్నల్స్ కు దూరంగా…?

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీకి అందుబాటులో లేకుండా పోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఆయన పార్టీకి అందుబాటులోకి రాకపోవడంపై కేంద్ర నాయకత్వం [more]

Update: 2019-09-14 12:30 GMT

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీకి అందుబాటులో లేకుండా పోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఆయన పార్టీకి అందుబాటులోకి రాకపోవడంపై కేంద్ర నాయకత్వం ఆరా తీస్తోంది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం, తనకు బద్ధ శత్రువైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఢీకొనాలంటే టీడీపీయే బెస్ట్ అని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి భావించారు.

ఎన్నికలకు ముందు చేరి….

తమ కుటుంబానికి ముఖ్యంగా సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో విభేదాలున్నప్పటికీ ఆయన టీడీపీనే ఎంచుకున్నారు.నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీలో చేరిన వెంటనే చంద్రబాబు నామినేటెడ్ పోస్టు కూడా ఇచ్చారు. పీలేరు గ్యారంటీ సీటు అని చంద్రబాబు సయితం నమ్మారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరుపున పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచారు. దీంతో చంద్రాబాబు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఎన్నికలకు ముందు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.

పెద్దిరెడ్డిని ఓడించాలని…

పీలేరు నియోజకవర్గంతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించే పుంగనూరు నియోజకవర్గం బాధ్యతలను కూడా అప్పగించారు. సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష్యంగా కృషి చేయకపోయినా లోపాయికారీగా ఎన్నికల సమయంలో పనిచేశారు. ఆయన గెస్ట్ హౌస్ లోనే ఉండి ఎన్నికల వ్యూహరచన చేశారు. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా వచ్చాయి. చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి చంద్రబాబు మినహా ఎవరూ గెలవలేదు. టీడీపీ పూర్తిగా దెబ్బతినింది. దీంతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు.

పట్టించుకోకుండా…..

గత కొద్దిరోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల కూడా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి స్పందించడం లేదు. అన్నా క్యాంటీన్లు, ఇసుక కొరత, చలో ఆత్మకూరు వంటి కార్యక్రమాలకు టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చినా ఆయన పట్టించుకోలేదు. అసలు ఆయన పీలేరు నియోజకవర్గానికే దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ కే పరిమితమయ్యారంటున్నారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వరసగా రెండుసార్లు ఓటమి చవిచూడటంతో కోలుకోలేకపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద పార్టీకి పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.

Tags:    

Similar News