బాలయ్య బరస్ట్ అయింది అందుకే…?

బాలయ్యబాబు సినిమాల్లో భారీ డైలాగులు చెబితే థియేటర్లలో ఈలలు, గోలలు ఓ రేంజిలో వస్తాయి. అభిమానజనం అయితే ఊగిపోతారు ముఖ్యంగా యాక్షన్, ఫ్రాక్షన్ సినిమాలకు బాలయ్య పెట్టింది [more]

Update: 2020-06-02 15:30 GMT

బాలయ్యబాబు సినిమాల్లో భారీ డైలాగులు చెబితే థియేటర్లలో ఈలలు, గోలలు ఓ రేంజిలో వస్తాయి. అభిమానజనం అయితే ఊగిపోతారు ముఖ్యంగా యాక్షన్, ఫ్రాక్షన్ సినిమాలకు బాలయ్య పెట్టింది పేరు. ఆయన ప్రత్యర్ధి పాత్రను ఉద్దేశించి పేల్చే డైలాగులు సీమ బాంబులను సైతం మించేలా ఉంటాయి. అటువంటి బాలయ్య రీల్ లైఫ్ లో మాత్రం కంప్లీట్ సైలెంట్. తన పని దానేదో అన్నట్లుగా ఉంటారు. అటువంటి బాలయ్య హఠాత్తుగా జూలు విదిల్చారు. ఒక్క దెబ్బకు సినీ, రాజకీయ ప్రత్యర్ధుల మీద మాటలతో దాడులే చేశారు. బాలయ్య తాజా దూకుడు వెనక పక్కా వ్యూహం ఉందని అంటున్నారు. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న నందమూరి సింహం వైలెంట్ గా మారడానికి రాజకీయ ఉత్ప్రేరకం ఏదై ఉంటుందన్నదే ఇపుడు చర్చగా ఉంది.

గర్జించారా…?

తనను సినిమా పెద్దలు అసలు పట్టించుకోవడాన్ని బాలయ్య సహించలేకపోతున్నారు. తెలుగు సినిమాకు రెండు కళ్ళుగా నందమూరి అక్కినేని కుటుంబాలు అప్పట్లో ఉండేవి. ఇపుడు మెగా కుటుంబమే సినీ సీమలో ప్రధాన బిందువుగా ఉంది. అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున మెగానుబంధం పెనవేసుకున్నారు. దీంతో బాలయ్యని పక్కకు తప్పించారన్న భావన సహజంగానే ఆయన అభిమానులతో పాటు సినీ రంగంలోని ఒక వర్గంలో గట్టిగానే ఉంది. దాంతో వారందరి గొంతుకగా మారి బాలయ్య గర్జించారని అంటున్నారు. తెలుగు సినిమా అంటే కేవలం వెండి తెర రాజకీయమే కాదు, తెలుగు తెర రాజకీయం కూడా అక్కడ బాగా పండుతోంది. ఏపీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన ప్రాతినిధ్యం అక్కడా కనిపిస్తోంది. దాంతోనే రియల్ లైఫ్ పాలిటిక్స్ రీల్ లైఫ్ లోనూ కనిపిస్తోందని అంటున్నారు.

టీడీపీ అనేనా :

టాలీవుడ్ లో ఒకపుడు తెలుగుదేశం అభిమానులు, సానుభూతిపరులు ఎక్కువగా ఉండేవారు. ఇపుడు సీన్ మారింది. తెలంగాణా ఏర్పాటు కావడంతో చాలా మంది గులాబీ చొక్కా తొడిగేశారు. అదే సమయంలో ఏపీలో వైసీపీకి కొంతమంది మద్దతుగా ఉన్నారు. ఇక జనసేనాని పవన్ ది ద్విపాత్రభినయం, ఆయన సినీ నటుడు, మరో వైపు రాజకీయ నాయకుడు కూడా. మరో వైపు ఆయన అన్నగారు చిరంజీవి టాప్ రేంజి హీరో కావడంతో టాలీవుడ్లో జనసేన జెండా అగ్రస్థానంలోనే ఎగురుతోంది. ఎటొచ్చి పసుపు జెండానే అంతా కలసి పక్కన పెట్టేసారు. ఆ పార్టీకి ఎమ్మెల్యేగా కూడా ఉన్న బాలయ్యన్ని కనీసం ముందు సినీ నటుడు అన్న మాట కూడా మరచి సైడ్ చేసేశారని టాక్ నడుస్తోంది. దాంతో బాలయ్య సీన్ లోకి రావాల్సివచ్చింది.

పండిన పాలిటిక్స్…..

నిజానికి బాలయ్య ఎపుడూ రాజకీయాన్ని సినిమాను మిక్స్ చేయలేదు. ఆయన తన కరోనా విరాళాలను అటు టీఆర్‌ఎస్, ఇటు జగన్ సర్కార్ కి కూడా సమానంగా ఇచ్చి మిగిలిన హీరోల కంటే మిన్న అనిపించారు. ఆయన తన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అభివ్రుధ్ధి పనులకు సీఎం కేసీఆర్ ని కూడా తరచూ కలుస్తూంటారు. కానీ ఇండస్ట్రీ పెద్దలే రియల్ రాజకీయాన్ని మించి రీల్ రాజకీయన్ని చేస్తూ బాలయ్యకు బాగా మండించారని అంటున్నారు. దాంతో బాలయ్య తన తండ్రి నాటి సినీ ఆధిపత్యాన్ని, చంద్రబాబు జమానాలో టాలీవుడ్ తమను సమాదరించిన తీరుతెన్నులను బేరీజు వేసుకుని ఒక్కసారిగా బరస్ట్ అయ్యారని అంటున్నారు. అంతే కాదు, కేసీయార్ సర్కార్ అయినా జగన్ ప్రభుత్వం అయినా సినీ పెద్దలు చర్చించేది రియల్ వ్యాపారం కోసమేనని బాంబు పేల్చారు. మొత్తానికి సినీ తళుకుల వెనక ఉన్న లొసుగులు బయటపెట్టిన‌ బాలయ్య ఇకపైన‌ తన దూకుడు పెంచుతారా. లేక తగ్గుతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా సినీ సీమను కొంతమంది శాసించడం ఎప్పటి నుంచో పాతుకుపోయిన బలమైన వర్గానికి సహించడంలేదని బాలయ్య మాటల బట్టి అర్ధమవుతోంది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News