నందమూరి వంశం ఒక్కటైతే ?

నందమూరి వంశానికి ఉన్న బలం వారికి తెలియదు. ఎందుకంటే వారిది అంతా బోళాతనమే. రాజకీయాలు వారికి పెద్దగా తెలియవు. అందుకే అన్న నందమూరి పెట్టిన తెలుగుదేశం పార్టీలో [more]

Update: 2020-06-05 14:30 GMT

నందమూరి వంశానికి ఉన్న బలం వారికి తెలియదు. ఎందుకంటే వారిది అంతా బోళాతనమే. రాజకీయాలు వారికి పెద్దగా తెలియవు. అందుకే అన్న నందమూరి పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఆయన వారసుడు బాలక్రిష్ణ ఓ సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఇక బాలయ్య పార్టీలో సైతం ఒక కార్యకర్తగానే ఉన్నారు. ఆయన్ని కనీసం పొలిట్ బ్యూరోలోకి కూడా తీసుకోలేదు. అంతా నారామయంగా ఈనాటి తెలుగుదేశం పార్టీ ఉంది. మంచికో చెడుకో బాలయ్యలో ఇపుడు ఆవేశం పుట్టుకొచ్చింది. ఆయన తన వంశం గురించి ఇన్నాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ గడిపారు, ఇపుడు మాత్రం సినిమా పరిశ్రమ మీద ద్రుష్టి పెడుతున్నారు. అది కాస్తా మరింతగా దారి మార్చి రాజకీయాల వైపుగా వస్తే నారా ఫ్యామిలీకు ముప్పే అంటున్నారు.

జూనియర్ తో కలసి…..

ఇక బాలక్రిష్ణ తరువాత జూనియర్ ఎన్టీయార్ అంతటి జనాదరణ, అపరిమితమైన ఫ్యాన్స్ అభిమానాన్ని సంపాదించుకున్నారు. జూనియర్ ఎన్టీయార్ చిన్న వయసులోనే నంబర్ వన్ స్టార్ గా నిలిచారు. ఇపుడు టాలీవుడ్లో టాప్ రేంజి హీరో ఆయన. అటువంటి జూనియర్ ఎన్టీయార్, బాలక్రిష్ణల మధ్య మంచి రిలేషన్స్ లేవని ఇన్నాళ్ళు అందరూ అనుకుంటూ వచ్చారు. వాటికి తెరదించుతూ బాలయ్య జూనియర్ మావాడే అనేస్తున్నారు. తాజాగా ఒక సోషల్ మీడియా ఇంటర్వ్యూలో జూనియర్ తో కలసి వెండి తెరను పంచుకుంటామని కూడా చెబుతున్నారు. అది కనుక జరిగితే నందమూరి స్టామినా ఏంటన్నది తెలుగు ఇండస్ట్రీలో తెలుస్తుంది. ఇక రాజకీయంగానూ అది ఇంకా స్టాంగ్ అవుతుంది అంటున్నారు.

బాలయ్య చెబితే….

జూనియర్ ఎన్టీయార్ కి చంద్రబాబుతోనే విభేదాలు ఉన్నాయని అంటారు. అదే సమయంలో ఆయన నందమూరి కుటుంబంతో బాగానే ఉంటారు. హరిక్రిష్ణ ఇద్దరు కుమారులూ ఒక్కటిగా ఉంటారు. బాలయ్య కూడా వారితో చేరితే అది బలమైన బంధంగా మారుతుంది. ఇక జూనియర్ ని రాజకీయాల్లోకి రమ్మని అంతా పిలుస్తున్నారు. ఇక్కడ ఒక చిక్కుముడి ఉంది. అదేంటి అంటే జూనియర్ ఇంకా వయసు ద్రుష్ట్యా చాలా చిన్న వాడు. ఆయన సినిమాలు వదులుకోలేడు. అలాగని కేవలం ప్రచారం చేసి నారా ఫ్యామిలీకి పార్టీని అప్పగించడం కూడా జూనియర్ కి ఇష్టం లేదని అంటారు. అతనికి బాబాయ్ బాలయ్య మీద ప్రత్యేక అభిమానం ఉంది. బాలయ్య పిలిస్తే మాత్రం టీడీపీ ప్రచారానికి రావచ్చు అంటున్నారు. అయితే అపుడు కూడా నందమూరి వంశానికి టీడీపీలో ప్రాధాన్యత దక్కితేనే.

బాలయ్యే ఫోకస్…..

ఇక ఇపుడే సినీ పరిశ్రమ రాజకీయాల పైన చురుకుగా స్పందిస్తున్న బాలక్రిష్ణ రానున్న నాలుగేళ్ళలో రాజకీయాల్లో తనదైన దూకుడు చూపుతారని అంటున్నారు. అప్పటికి ఆయన వయసు కూడా సినిమాలు చేయడానికి సరిపోదు కాబట్టి పూర్తి స్థాయి రాజకీయల మీద చూపు పెడతారు అంటున్నారు. అదే కనుక జరిగితే బాబాయ్ బాలయ్యకు కచ్చితంగా జూనియర్ మద్దతు ఉంటుంది. బాలయ్యను టీడీపీలో ఫోకస్ చేసేనే తాను ప్రచారం చేస్తానని జూనియర్ అంటే మాత్రం టీడీపీలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోతాయి. ఇక నందమూరి కుటుంబం కూడా ఒక్కటి అవుతుంది. బాలయ్య అక్క దగ్గుబాటి పురంధేశ్వరి, బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారు కూడా బాలయ్యకు మద్దకు ఇస్తే టీడీపీలో నందమూరి పట్టు బాగా పెరుగుతుంది అంటున్నారు. మొత్తానికి బాలయ్య, జూనియర్ ఎన్టీయార్ కలిస్తే మాత్రం అటు సినీ రంగంలోనే కాదు, ఇటు రాజకీయంగానూ పెను ప్రకంపనలను స్రుష్టించడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News