మాటల్లేవ్…ఎవరి పని వారిదేనా?

నందికొట్కూరు పంచాయతీ ఇంకా ముగియలేదు. నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కు, అక్కడ పార్టీ ఇన్ ఛార్జి సిద్ధార్థ రెడ్డికి గత తొమ్మిది నెలల నుంచి పడటం [more]

Update: 2020-03-26 13:30 GMT

నందికొట్కూరు పంచాయతీ ఇంకా ముగియలేదు. నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కు, అక్కడ పార్టీ ఇన్ ఛార్జి సిద్ధార్థ రెడ్డికి గత తొమ్మిది నెలల నుంచి పడటం లేదు. అధిష్టానం ఎంతమందిని పంపినా వారిద్దరి మద్య రాజీ కుదరలేదు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వల్ల కాలేదు. ఆ తర్వాత శిల్పా చక్రపాణిరెడ్డిని పంపారు. వర్క్ అవుట్ అయినట్లే కన్పించినా మళ్లీ మొదటికొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వయంగా వచ్చి కూర్చున్నా ఫలితం కన్పించలేదు.

ఇద్దరి మధ్య…

ప్రస్తుతం ఎమ్మెల్యే ఆర్థర్, ఇన్ ఛార్జి సిద్ధార్ధరెడ్డి మధ్య అస్సలు మాటలే లేవని తెలుస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది ఎవరు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద ఆర్ధర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆర్థర్ గెలుపు వెనక సిద్దార్థ రెడ్డి కూడా ఉన్నారన్నది కాదనలేని వాస్తవం. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత వీరిద్దరి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. అధికారుల బదిలీలు, కాంట్రాక్టులు, నామినేటెడ్ పదవుల విషయంలో సిద్ధార్ధ్ రెడ్డి తాను చెప్పినట్లే జరగాలంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ….

నందికొట్కూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవిని కూడా తాను చెప్పిన వారికి కాకుండా సిద్దార్థ రెడ్డి చెప్పిన వారికి ఇవ్వడంతో ఆర్థర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలాల వారీగా ఇద్దరికీ పంచడాన్ని కూడా ఆర్థర్ తప్పుపడుతున్నారు. సిద్దార్థ్ రెడ్డికి మూడు మండలాలు, తనకు రెండు మండలాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను అప్పగించడాన్ని వ్యతిరేకించిన ఆర్థర్ తనకు అవసరమే లేదని చెప్పేశారు. తన వారిచేత నామినేషన్లు వేయించేందుకు రెడీ అయ్యారు.

రాజీ కుదిరేనా?

మరోవైపు సిద్ధార్థరెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టకుండానే అన్నీ చేసేస్తున్నారు. ఆయన కర్నూలులో ఉంటూ నందికొట్కూరును శాసిస్తున్నారంటున్నారు. ఇద్దరి మధ్య మాటలు లేకపోవడంతో పైచేయి సాధించుకునే ప్రయత్నం ఎవరికి వారే చేస్తున్నారు. ఉమ్మడి అసెంబ్లీలో చీఫ్ మార్షల్ గా పనిచేసిన ఆర్థర్ కు రాజకీయాలపై విరక్తి కలిగినట్లుంది. అందుకే ఆయన ఇక తనకు ఏమీ అవసరం లేదని కాడి వదిలేశారు. దీంతో మరోసారి నందికొట్కూరు పంచాయతీ జగన్ వద్దకు చేరాల్సిన అవసరం ఏర్పడింది. మొత్తం మీద ఇద్దరు నేతల మధ్య మాటలు లేకపోవడంతో క్యాడర్ ఇబ్బంది పడుతోంది.

Tags:    

Similar News