ఈ “దేశ” మేగతి బాగుపడునో?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు పెద్దగా స్పందన రావడం లేదు. పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తూ [more]

Update: 2019-12-13 00:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు పెద్దగా స్పందన రావడం లేదు. పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తూ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కన్పించడం లేదు. ఏ ఆందోళన చేపట్టినప్పటికీ పట్టుమని పది మంది పోగు కావడం లేదు. స్థానికసంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీ క్యాడర్ ఇలా డీలా పడటం అధినేత చంద్రబాబును సయితం ఆందోళనకు గురిచేస్తుంది.

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై….

తాజాగా ఆర్టీసీ చార్జీలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలు జరగుతుండగానే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని అమరావతి నుంచి చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబు పిలుపునకు ఆయన సొంత జిల్లా చిత్తూరులోనూ పెద్దగా రెస్పాన్స్ రాలేదు. తిరుపతిలో ఈ ఆందోళనలో పది మంది కార్యకర్తలు మాత్రమే పాల్గొన్నారు. టీడీపీ నేతలు సుగుణమ్మ, నరసింహయాదవ్, పులవర్తి నాని లాంటి నేతలే పాల్గొన్నారు.

పదవులు అనుభవించిన వారు….

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు సయితం పెద్దగా పట్టించుకోలేదు. మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, సత్యప్రభ, సీకే బాబు లాంటి నేతలు ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. నేతలు ఎవరూ రోడ్డెక్కక పోవడంతో క్యాడర్ కూడా రాలేదు. చంద్రబాబు ఇటీవలే చిత్తూరు జిల్లాలో పర్యటించి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

నివేదికలను చూసి…..

పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన నివేదికను చూసి చంద్రబాబు జిల్లా నేతలపై సీరియస్ అయినట్లు తెలిసింది. నేతలు ఏం చేస్తున్నారంటూ నిలదీసినట్లు తెలిసింది. చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో నిత్యం చేసే టెలికాన్ఫరెన్స్ లు కూడా మానుకున్నారు. చిత్తూరు జిల్లాలోనే కాదు దాదాపు అన్ని జిల్లాల్లో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీడీపీ శ్రేణుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో టీడీపీ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు. ముందు నేతలను దారిలోకి తీసుకువస్తే తప్ప దీనికి పరిష్కారం దొరకదని సీనియర్ నేతలు భావిస్తున్నారు.

Tags:    

Similar News