లోకేష్ ఛాంబర్ కు డిమాండ్ నిల్ ?

నారా లోకేష్ రెండు నెలల క్రితం వరకూ ఆ పేరు ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా నానిపోయింది. ఆయన నామస్మరణే ఓ నినాదమైపోయింది. యూత్ ఐకాన్ గా, టీడీపీకి [more]

Update: 2019-06-15 03:30 GMT

నారా లోకేష్ రెండు నెలల క్రితం వరకూ ఆ పేరు ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా నానిపోయింది. ఆయన నామస్మరణే ఓ నినాదమైపోయింది. యూత్ ఐకాన్ గా, టీడీపీకి ఆశాజ్యోతిగా లోకేష్ ని అనుకూల మీడియా తెగ కీర్తించింది. చంద్రబాబు తరువాత మాకు ఎవరు అన్న ప్రశ్నే లేదు. మా లోకేష్ బాబు ఉన్నాడు అంటూ ఎమ్మెల్సీలు బాబూ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న వంటి వారు బల్లగుద్ది మరీ చెప్పేవారు. టీడీపీ ఏపీలో శాశ్వతంగా అధికారంలో ఉంటుందని అధినేత చంద్రబాబు చెప్పడమే కాదు. 2050 వరకూ పార్టీ విజన్ రూపకల్పన చేశారు. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిగా కీలకమైన శాఖలు లోకేష్ కి ఇవ్వడం ద్వారా భావి ముఖ్యమంత్రి కలరింగ్ ని బాగా ఇచ్చేశారు. దాంతో టీడీపీలో మూడవతరం మొదలైందని అంతా అనుకున్నారు.

తొలి ఓటమితో షాక్ :

ఇవన్నీ ఇలా ఉండగానే మంత్రిగా రెండేళ్ళ పాటు ఎంతో ప్రాధాన్యత ఉన్న శాఖలను నిర్వహించడమే కాదు. చంద్రబాబు తతువాత అంతటి వారు అని అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో పొగిడించుకున్న లోకేష్ బాబు తొలిసారి మంగళగిరిలో పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు. ఇది నిజంగా ఆయనకు గట్టి షాక్ అని చెప్పాలి. లోకేష్ కి రాజకీయంగా ఎంతో హైప్ ఇచ్చి మొత్తం పార్టీ, ప్రభుత్వం చేతిలో ఉన్న సానుకూలమైన పరిస్థితుల్లో కూడా ఓటమి చెందారంటే ఆయన నాయకత్వం పట్ల జనం ఇచ్చిన తీర్పుగానే దాన్ని చూడాలి. లోకేష్ అక్కడ ఓడిపోవడమే కాదు ఏపీలో టీడీపీ ఓటమికి కూడా కారణమయ్యారంటున్నారు. చంద్రబాబుకు మరోమారు అధికారం ఇస్తే ఆయన తన కుమారుడికే పట్టం కడతారన్న భయం జనాల్లో ఉండడం వల్ల కూడా రెండవసారి టీడీపీకి చాన్స్ ఇవ్వలేదని విశ్లేషణలు తెలియచేస్తున్నాయి.

నాడు రోజాను అలా :

టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఒకసారి ఎమ్మెల్యేగా కూడా చంద్రగిరి నుంచి పోటీ చెసి ఓడిపోయిన రోజా ఆ పార్టీలో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. అయితే ఆమెను టీడీపీలో ఐరన్ లెగ్ అనెవారు. ఆమె తరువాత కాంగ్రెస్, అటు నుండి ఆయన కుమారుడు జగన్ ఏర్పాటు చేసిన వైసీపీలో చేరినా కూడా ఆ విమర్శ పోలేదు. వైఎస్సార్ దుర్మరణం పాలు కావడానికి, జగన్ 2014లో అధికారంలోకి రాకపోవడానికి రోజా ఐరన్ లెగ్ కారణమని టీడీపీ వారు తెల్లారితే ఘోరంగా విమర్శలు చేసేవారు. ఇదిలా ఉండగా లోకేష్ అన్ లక్కీ అని వైసీపీ అపుడే ప్రచారం మొదలెట్టేసింది. నిన్నటి వరకూ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న లోకెష్ చాంబర్ ని వైసీపీ మంత్రి పెద్దిరెడ్డికి ఇస్తే ఆయన నో అనేశారు. ఎన్నో హంగులతో ఆధునాతనంగా బ్లాక్ నంబర్ 5లో లోకేష్ స్వయంగా ఈ చాంబర్ ని డిజైన్ చేయించుకున్నారు. ఇపుడు ఆ చాంబర్ లో ప్రవేశించడానికి ఏ వైసీపీ మంత్రి అంగీకరించడము లేదు.

Tags:    

Similar News