లోకేష్ గెలుపు సులువు కాదా..?
ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని హాట్ సీట్లలో ముందుంది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం. ఇక్కడి నుంచి మొదటిసారి ఎన్నికల బరిలో అదృష్టం పరీక్షించుకుంటున్న మంత్రి నారా [more]
ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని హాట్ సీట్లలో ముందుంది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం. ఇక్కడి నుంచి మొదటిసారి ఎన్నికల బరిలో అదృష్టం పరీక్షించుకుంటున్న మంత్రి నారా [more]
ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని హాట్ సీట్లలో ముందుంది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం. ఇక్కడి నుంచి మొదటిసారి ఎన్నికల బరిలో అదృష్టం పరీక్షించుకుంటున్న మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తుండటంతో రాజకీయవర్గాలతో పాటు సాధారణ ప్రజల చూపు కూడా ఈ నియోజకవర్గంపై పడింది. భీమిలీ, విశాఖ ఉత్తర నియోజకవర్గాల నుంచి లోకేష్ పోటీ చేస్తారని ముందునుంచీ ప్రచారం జరిగినా చివరకు ఆయన రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడి నుంచి వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. ఆయన బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. దీంతో అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి నారా లోకేష్ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. గల్లీగల్లీ, ఊరుఊరూ తిరిగి ప్రచారం చేస్తున్నారు. వైసీపీ కూడా ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేస్తోంది.
స్వంత డబ్బులతో సేవా కార్యక్రమాలు
గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల అతిస్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. గెలిచిన తర్వాత రామకృష్ణారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. రాజధాని ల్యాండ్ పూలింగ్ మొదలు ఓటుకు కోట్లు కేసు వరకు టీడీపీపై, ప్రభుత్వంపై అనేక కేసులు వేసి తలనొప్పి తెప్పించారు. దీంతో పాటు నియోజకవర్గంలో ప్రజలకు రూ.4కే భోజనం అందించడం, రూ.10కే కూరగాయాలు అందించడం వంటి సేవా కార్యక్రమాలను స్వంత డబ్బులతో చేశారు. ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన లోకేష్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల పద్మశాలి సామాజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పార్టీలో చేరడం కూడా వైసీపీకి కొంత కలిసొచ్చే అవకాశం ఉంది.
లోకేష్ కు టఫ్ ఫైట్
తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం గత ఎన్నికల్లో పోటీచేసిన చిరంజీవి, మాజీ ఎమ్మెల్యేలు హనుమంతరావు, కాండ్రు కమల ప్రయత్నించారు. వీరి ముగ్గురికీ కాదని చివరకు నారా లోకేష్ రావడంతో మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. కాండ్రు కమల పార్టీకి గుడ్ బై చెప్పగా మిగతా ఇద్దరు నేతలు లోకేష్ కు మద్దతు ఇస్తున్నారు. అయితే, మంగళగిరిలో పెద్ద సంఖ్యలో ఉన్న పద్మశాలి సామాజకవర్గానికి టిక్కెట్ ఇవ్వకపోవడంపై వారంతా అసంతృప్తితో ఉన్నారు. ఏకంగా సమావేశం పెట్టుకొని లోకేష్ ను ఓడించాలని తీర్మాణం చేశారు. దీంతో పద్మశాలి ప్రజలు టీడీపీకి వ్యతిరేకంగా మారితే లోకేష్ కు కష్టంగా మారవచ్చు. ఇక, ఎమ్మెల్యే మీద కోపంలో నియోజకవర్గాన్ని టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదనే అసంతృప్తి కూడా ప్రజల్లో ఉంది. ఇది కూడా ఆయనకు నష్టం చేసే అవకాశం ఉంది. అయితే, లోకేష్ అభ్యర్థిగా ఖరారు అయ్యాక పరిస్థితి కొంచెం టీడీపీకి అనుకూలంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. పలువురు స్థానిక వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరారు. ముఖ్యనేత కావడంతో గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందనే భావన కొంత మంది ప్రజల్లో నెలకొంది. మొత్తానికి నారా లోకేష్ గెలుపు నల్లేరు మీద నడక అయితే కాదనే అంచనాలు ఉన్నాయి.