సన్ ఆఫ్ చంద్రబాబు ట్యాగ్ తోనే ?
లోకేష్ సీన్ టీడీపీలో ఏంటో అచ్చెన్నాయుడు తాజాగా వైరల్ అయిన ఒక వీడియోలో చక్కగా చెప్పేశాడు. దాదాపుగా సీనియర్ నేతల అందరి మాట కూడా అదే అంటున్నారు. [more]
లోకేష్ సీన్ టీడీపీలో ఏంటో అచ్చెన్నాయుడు తాజాగా వైరల్ అయిన ఒక వీడియోలో చక్కగా చెప్పేశాడు. దాదాపుగా సీనియర్ నేతల అందరి మాట కూడా అదే అంటున్నారు. [more]
లోకేష్ సీన్ టీడీపీలో ఏంటో అచ్చెన్నాయుడు తాజాగా వైరల్ అయిన ఒక వీడియోలో చక్కగా చెప్పేశాడు. దాదాపుగా సీనియర్ నేతల అందరి మాట కూడా అదే అంటున్నారు. లోకేష్ 2014 ఎన్నికల తరువాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగారు. అంటే ఆయన పొలిటికల్ కెరీర్ వయసు ఏడేళ్ళుగా భావించాలి. మరి ఈ ఏడేళ్ళ కాలంలో రెండేళ్ల కాలం అయిదు కీలకమైన శాఖలకు మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఆయనే తెర వెనక చక్రం తిప్పుతూ బాబు తరువాత తానే అనిపించుకున్నారు. మరి ఇవన్నీ కలిపి కూడితే ఈపాటికే లోకేష్ రాజకీయ పాండిత్యం ఎక్కడికో వెళ్ళాలి. కానీ ఈ రోజుకీ సన్ ఆఫ్ చంద్రబాబు ట్యాగ్ తోనే లోకేష్ కొనసాగుతున్నారు అంటేనే ఎక్కడో తేడా కొడుతోంది అని అర్ధం చేసుకోవాలి.
కామెడీయేనా…?
మంగళగిరిలో తాను స్వయంగా ఓడాక పార్టీలో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది అని చెబుతారు. ఇక ఓడిన లోకేష్ పార్టీ అభ్యర్ధుల కోసం ప్రచారం చేయడమేంటి అని లోకల్ బాడీ ఎన్నికల వేళనే విమర్శలు వచ్చాయి. సొంత పార్టీలోనూ చాలా మంది గుసగుసలు పోయారు. ఇపుడు లోకేష్ గాలి తీసేలా వైసీపీ మంత్రి కన్నబాబు కూడా అదే మాట అంటున్నారు. ఎమ్మెల్యేగా గెలవడానికి సీన్ లేదు కానీ తిరుపతిలో ఎంపీ అభ్యర్ధిని ఎలా గెలిపిస్తావ్ లోకేష్ అంటూ ఎకసెక్కమాడారు. ఇపుడు ఇదే లోకేష్ కి అతి పెద్ద మైనస్ పాయింటుగా మారింది మరి. ఆయన ఎటువంటి సవాళ్ళు చేసినా భారీగా స్టేట్మెంట్లు ఇచ్చినా అవి పొలిటికల్ కామెడీగానే మిగిలిపోతున్నాయి.
గెలిపించేవాడే….?
నాయకుడు అన్న వాడు వారసుడా లేక మరోటా అన్న ప్రశ్న ఇక్కడ కాదు, గెలిపించేవాడే నేత అని రాజకీయ డిక్షనరీలో అచ్చు గుద్ది మరీ ఉంది. దానికి చినబాబు సరిగా చదువుకోలేదు. పైగా తండ్రి చంద్రబాబు చేతుల్లో నుంచి పార్టీని తీసుకుంటే తానే బాస్ అని అంతా ఒప్పుకుంటారు అనుకుంటున్నారని సెటైర్లు పడుతున్నాయి. జాతీయ కార్యదర్శి పదవి అయితే చంద్రబాబు సులువుగా ఇచ్చేయగలరు, అయిదు శాఖల మంత్రిగానూ ఓవర్ నైట్ చేయగలరు, కానీ పార్టీ మొత్తం లోకేష్ ని మా నేత అని ఆమోదించేలా బాబు సైతం చేయలేరుగా. మరి ఇక్కడే లోకేష్ సామర్ధ్యం సత్తా ఏంటో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.
తేలిపోవడంలేదూ ..?
ఆయనే ఉంటే మంగలోడు ఎందుకు అని ఒక ముతక సామెత ఉంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లుగా లోకేష్ ధీటైన నేతగా ఉంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఎందుకు కాళ్ళరిగిలేలా ఎనిమిది రోజుల పాటు వూరూ వాడా తిరుగుతారు అన్న చర్చ కూడా ఉంది. అంటే చంద్రబాబే లోకేష్ సామర్ధ్యం ఏంటో నోట చెప్పకుండానే గుట్టు విప్పేసారు అంటున్నారు. అలాంటిది అచ్చెన్న అన్నాడనో మరో వైసీపీ నేత విమర్శించాడనో ఆవేశపడి భుజాలు తడుముకోవడం ఎందుకు అన్నదే హితైషులు చినబాబుకు చెబుతున్న మాట. ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు. ముందు లోకేష్ తన మైనస్ పాయింట్లు ఏంటో తెలుసుకోవాలి. ఆదరాబాదరాగా నాయకుడు కాలేమని గ్రహించాలి. అన్నింటికీ మించి జగన్ కి తాను సరిజోడు నేత ప్రస్తుతానికి కాను అని అయినా గట్టిగా అనుకుని కార్యాచరణకు దిగాలి. లేకపోతే ఇవాళ అచ్చెన్న అన్నాడు, రేపు మరో బుచ్చెన్న కూడా ఇదే మాట అంటాడు. అపుడు అసలు తట్టుకోలేవు లోకేషూ అంటున్నారు ఆయన అభిమాన జనం.