లోకేష్ ను ఇలా వెంటాడుతున్నారేంటి?

నారా లోకేష్. తండ్రి చాటు రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. చంద్రబాబుకే స్వయం ప్రకాశం లేదని ప్రత్యర్ధులు విమర్శిస్తున్న నేపధ్యంలో ఆయన చాటులో ఉన్న చినబాబును చీకటి [more]

Update: 2021-04-23 06:30 GMT

నారా లోకేష్. తండ్రి చాటు రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. చంద్రబాబుకే స్వయం ప్రకాశం లేదని ప్రత్యర్ధులు విమర్శిస్తున్న నేపధ్యంలో ఆయన చాటులో ఉన్న చినబాబును చీకటి లోకేశంగానే పేర్కొంటూ పార్టీ సీనియర్లు కూడా గుస‌గుసలు పోతారు. ఇక లోకేష్ మీద తెలుగు తమ్ముళ్ళ స్థూలాభిప్రాయం ఏంటన్నది ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఒక వీడియో ద్వారా బాగా విడమరచి చెప్పేశారు. దాంతోనే చిన్నబుచ్చుకుని చినబాబు తెగ ఫీల్ అవుతున్న వేళ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ అనబడే రామ్ గోపాల్ వర్మ సడెన్ గా కెలికెశారు. ఇది ఎలా ఉంది అంటే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లే అంటున్నారు సొంత పార్టీలోనే.

వైరస్సేనట….

ఇపుడు ఎటు చూసినా వైరస్ ల కాలం. బయట ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. దాంతో క్యాచీగా ఉంటుందనో ఏమో కానీ తన సినిమాటిక్ లాంగ్వేజ్ ని ఉపయోగించి మరీ లోకేష్ ని టీడీపీకి పట్టిన అతి పెద్ద వైరస్ గా ఆర్జీవీ తనదైన ట్వీట్లతో పోల్చేశారు. లోకేష్ వైరస్ టీడీపీని వీడిపోవాలంటే తారక్ 9999 అనే మందు కూడా ఉందని చెబుతూ జూనియర్ ఎన్టీయార్ ఒక్కడే టీడీపీకి బహు మొనగాడు అని రామూయిజాన్ని, అసలు నిజాన్ని చెప్పేశారు. లోకేష్ ని వదిలించుకుని అర్జంటుగా జూనియర్ ని పార్టీలో కి తీసుకువస్తేనే ఆ పార్టీ బతికి బట్టకడుతుందని ఆర్జీవీ తమ్ముళ్ళకు అలా గీతోపదేశం చేశారు.

మంట పెట్టేశారే …?

అసలే అచ్చెన్న వీడియోతో టీడీపీలో చిచ్చు రాజుకుంది. లోకేష్ సరిగ్గా ఉంటేనా అంటూ అచ్చెన్న దీర్ఘాలు తీస్తూ చేసిన కామెంట్లే హై కమాండ్ తలకు బొప్పి కట్టేలా ఉన్నాయి. దాంతో టీడీపీలోనే లోకేష్ పట్ల ఏ మాత్రం గురి లేదన్న సంగతి లోకానికి తెలిసిపోయింది. ఇలా పీక్కో లేక లాక్కోలేక చస్తూంటే రామూయిజాలు ఇపుడు అవసరమా అంటున్నారు తమ్ముళ్ళు. ఇక ఆర్జీవీ చెప్పిన దాని మీద టీడీపీలో కూడా మద్దతు కొంత మంది నుంచి రావడం విశేషం. అయితే ఆర్జీవీ మాత్రం ఉన్నట్లుండి ఎందుకు లోకేష్ ని ఇలా కెలకాల్సి వచ్చింది అన్నదే ఇక్కడ ప్రశ్న.

చినబాబు భారమే…?

చినబాబు పార్టీకి భారమే అన్న భావం మరింతగా బలపడడానికా అన్నట్లుగా రాము సరైన టైమ్ చూసుకునే బాణం వేశారని అంటున్నారు. అయితే ఆర్జీవీ ఇదే మాటను గతంలో కూడా గట్టిగానే చెప్పారు. పైగా ఆయన అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అన్న సినిమా తీసి మరీ అందులో లోకేష్ ని పప్పు అంటూ సెటైరికల్ గా ఏకి పారేశారు. వీలు దొరికితే చాలు టీడీపీ మీద విరుచుకుపడే వర్మ ఇపుడు సినిమాలు దాటి మరీ బయటకు వచ్చి ప్రత్యర్ధి పార్టీల మాదిరిగా ఇలా హాట్ కామెంట్స్ చేయడమే చర్చగా ఉంది. ఆర్జీవీ గురించి ఎవరికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా ఆయన అటు సినిమాల పరంగా కానీ ఇటు సోషల్ మీడియా ఆధారంగా చేసుకుని చేసే కామెంట్స్ మీద మాత్రం కొంత అటెన్షన్ ఎపుడూ ఉంటుంది. అదే ఇపుడు టీడీపీ కొంప ముంచుతోంది అంటున్నారు. మొత్తానికి ఆర్జీవీ ఇలా తగులుకోవడంతో టీడీపీలో లోకేష్ పరపతి మీద మరో దెబ్బ పడిందనే అంటున్నారుట.

Tags:    

Similar News