బ్రాహ్మణి-లోకేష్‌లు ఇక్కడ ఉంటేనే బెట‌ర్‌.. స‌రికొత్త చ‌ర్చ

టీడీపీ యువ నాయ‌కుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్‌, ఆయ‌న స‌తీమ‌ణి నారా బ్రాహ్మణి గురించి సొంత పార్టీలో నేత‌లు ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. లోకేష్‌.. [more]

Update: 2021-05-20 03:30 GMT

టీడీపీ యువ నాయ‌కుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్‌, ఆయ‌న స‌తీమ‌ణి నారా బ్రాహ్మణి గురించి సొంత పార్టీలో నేత‌లు ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. లోకేష్‌.. పార్టీలో దూకుడుగా ఉన్నారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో బాగానే ప్రచారం చేశారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నారు. యువ‌త‌ను స‌మీక‌రించారు. ఇటు వాగ్ధాటి పెంచారు. మ‌రోవైపు ఫిజిక్ ప‌రంగా చూసుకుంటే.. ఆయ‌న స‌న్నబ‌డ్డారు. డ్రస్‌లోనూ ఛేంజ్ చేశారు. ఆక‌ర్షణీయంగా ఉన్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్కడ ప్రచారం ముగియ‌గానే.. లేదా ఇక్కడ పార్టీ కార్యక్ర‌మాలు ముగియ‌గానే.. ఆయ‌న వెంట‌నే హైద‌రాబాద్ వెళ్లిపోతున్నారు.

హైదరాబాద్ కే పరిమితం…..

గ‌తంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమ‌రావ‌తిలోనో.. విజ‌య‌వాడ‌లోనో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ద‌గ్గర‌గా ఉండి పార్టీ కేడ‌ర్‌ను, నేత‌ల‌ను ముందుకు న‌డిపించారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆయ‌న హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. క‌రోనా స‌మయంలో హైద‌రాబాద్‌లో ఉన్నారంటే అర్ధం ఉంది. కానీ, ఇప్పుడు అత్యంత కీల‌క‌మైన స‌మ‌యంలో కూడా హైద‌రాబాద్‌కే ప‌రిమితం కావ‌డం మాత్రం పార్టీలో తీవ్ర చ‌ర్చకు దారితీస్తోంది. క‌రోనా స‌మ‌యంలో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా హైద‌రాబాద్‌లోనే మ‌కాం ఉండి అస‌లు ఏపీ వైపే చూడ‌లేదు. చంద్రబాబు వ‌య‌స్సు పైబ‌డినా… యువ‌నేత‌గా ఉన్న లోకేష్ కూడా ఏపీకి రాక‌పోవ‌డంపై పార్టీ కేడ‌ర్లోనూ, నాయ‌కులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

మకాం మార్చాలంటూ…

ఆ త‌ర్వాత ఏపీలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేష్‌.. ఆ త‌ర్వాత తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ హైద‌రాబాద్‌లోనే ఉంటోన్న ప‌రిస్థితి. దీంతో పార్టీ నాయ‌కులు ఆయ‌న అక్కడ ఉంటే. ఇక్కడ మేం ఏం చేయాల‌న్నా ఇబ్బందిగా ఉంద‌ని వ్యాఖ్యానిస్తోన్న ప‌రిస్థితి. ఈ క్రమంలో కొంద‌రు ఎమ్మెల్యేలు, కీల‌క నేత‌లు ఖ‌చ్చితంగా లోకేష్‌.. త‌న మ‌కాంను ఏపీకి మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అదే స‌మ‌యంలో త‌న స‌తీమ‌ణి నారా బ్రాహ్మణిని కూడా రంగంలోకి దింపాలని చెబుతున్నారు.

బ్రాహ్మణి రాకతో….?

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో లోకేష్ త‌ర‌ఫున మంగ‌ళ‌గిరిలో ప్రచారం చేసిన విష‌యాన్ని ఆమె వాయిస్ ధాటిని కూడా వారు చెబుతున్నారు. ఇద్దరు దంప‌తులు కూడా ఏపీలో మ‌కాం వేసి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయ‌డంతోపాటు.. పార్టీ నేత‌ల‌ను కూడా ముందుకు నడిపిస్తే.. కొత్త ఉత్సాహం పార్టీలో క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. బ్రాహ్మణి సైతం ఏపీలో మకాం ఉంటూ పార్టీ కార్యక‌ర్తలు / నేత‌ల‌తో కాస్త ట‌చ్‌లో ఉంటే ఇక్కడ పార్టీ కేడ‌ర్లో ఉత్సాహంతో పాటు మార్పు వ‌స్తుంద‌న్న ఆశ‌లు పార్టీ కేడ‌ర్లో అయితే ఉన్నాయి. మ‌రి లోకేష్ ఈ సూచ‌న‌లు పాటిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News