లోకేష్ లో ఆ ధీమా ఏమిటో?

చంద్రబాబు రాజకీయాల్లో తల పండిన వారు. ఆయన తన మనసులో మొలిచిన మాటను ఒకటికి పదిసార్లు చెప్పి అయినా జనాల మైండ్ లో బలంగా రిజిష్టర్ చేయడానికి [more]

Update: 2021-06-06 12:30 GMT

చంద్రబాబు రాజకీయాల్లో తల పండిన వారు. ఆయన తన మనసులో మొలిచిన మాటను ఒకటికి పదిసార్లు చెప్పి అయినా జనాల మైండ్ లో బలంగా రిజిష్టర్ చేయడానికి చూస్తారని కూడా అంటారు. అలాంటి చంద్రబాబు కూడా ఆ మాట అనడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. కానీ ఆయన తనయుడు, టీడీపీ భావి వారసుడు లోకేష్ మాత్రం ఏ జంకూ గొంకూ లేకుండా ఇట్టే చెప్పేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం, రాసుకో సాంబా అంటున్నారు. ఇందులో రెండవ మాటకు అసలు చాన్సే లేదు అన్నట్లుగా చినబాబు గట్టిగా బల్ల గుద్దుతున్నారు.

బోల్డ్ గానా …?

చినబాబు అంటేనే అందరికీ డౌట్లు వచ్చేస్తాయి. చంద్రబాబు చెబుతున్నారు అంటే దాని వెనక ఏదో వ్యూహం ఉందని కొందరైనా నమ్ముతారు. కానీ రాజకీయాలో జూనియర్ అయిన లోకేష్ ఆవేశపూరితమైన డైలాగులు కొట్టడంలో ముందుండాలని తెగ తాపత్రయపడతారు. ఈ దూకుడులో ఆయన చాలా సార్లు ఇబ్బందులు కూడా పడ్డారు. ఇక తాజాగా ఆయన చాలానే కొత్త డైలాగులు వదులుతున్నారు. ఎన్నికలు ఎపుడు జరిగినా టీడీపీదే అధికారం అంటున్నారు. అయితే ఆయన ఫ్లోలో అంటున్నారా లేక బోల్డ్ గా మాట్లాడుతున్నారా అన్నదే చర్చగా ఉందిట.

లైట్ తీసుకున్నారే…?

నిజానికి అధికారంలోకి వస్తామన్న మాట తమ్ముళ్ళ చెవులలో తీయగా వినిపించాలి. రెండేళ్ళుగా చేదు అంతా చెవికెక్కి అసలు ఏం జరుగుతోందో అర్ధం కాకుండా ఉన్న పసుపు శిబిరం పరవశంతో ఊగిపోవాలి. కానీ చినబాబు ఇలా భవిష్యత్తు వాణిని వినిపిస్తున్నా అంతా బ్రహ్మాండం అంటున్నా కూడా ఎందుకో తమ్ముళ్ళు లైట్ తీసుకున్నారుట. నిజంగానా అన్నట్లుగా చూస్తున్నారుట. ఏపీ రాజకీయాలను తాను మొత్తం ఔపోశన పట్టేసినట్లుగా లోకేష్ జాతకం చెబుతూంటే టీడీపీలో కాస్తంతగానైనా చలనం లేకపోవడమే విశేషంగా చూడాలిపుడు.

అందుకే అలా…?

తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వైసీపీ గెలిచింది. అలా ఇలా కాదు, ఏక‌పక్ష విజయాలే నమోదు చేసింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగితే గతం కంటే ఎక్కువగా మెజారిటీని సాధించింది. ఇవన్నీ కళ్ళ ముందే ఉన్నాయి. పైగా ఆ విజయాలు ఎక్కడా వాడిపోలేదు కూడా. ఇంకో వైపు చూస్తే వైసీపీ గతం కంటే ఎక్కువ ఓట్ల శాతం తెచ్చుకుని పటిష్టంగా ఉంది. టీడీపీకి కంచుకోటల్లాంటి జిల్లాల్లో కూడా జెండా ఎగరేస్తోంది. కళ్ళ ముందు వాస్తవాలు ఇలా ఉంటే తాడూ బొంగరం లేని మాటలతో మనసుకు సంతోషం వస్తుందా, గెలుపు ధీమా కనిపిస్తుందా అన్నదే తమ్ముళ్ళ భావనట. మరి లోకేష్ టీమ్ ఏం ఆలోచించి చింబాబు చేత ఇలాంటి మాటలు పలికిస్తున్నారో తెలియదు కానీ కలసిరాని కాలంలో వదులుతున్న ఇలాంటి స్టేట్మెంట్లతో టోటల్ గా కామెడీ అయిపోతుంది అన్నదే తమ్ముళ్ల బెంగట. మొత్తానికి ముందు పార్టీని చక్కదిద్దుకుని ఆనక ఎన్నికలలో అధికారం గురించి ఆలోచిస్తే బాగుంటుంది బాబూ అన్న సూచనలు అయితే వస్తున్నాయట.

Tags:    

Similar News