న‌ర‌సాపురంలో తీన్‌మార్‌…. ట్ర‌యాంగిల్‌లో ట‌ఫ్ ఫైట్‌..!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో తీర‌ప్రాంతం, లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన న‌ర‌సాపురంలో ఈసారి త్రిముఖ పోటీ ఉండ‌నుంది. టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌ పార్టీల మ‌ధ్య పోరు సాగ‌నుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో [more]

Update: 2019-02-06 14:00 GMT

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో తీర‌ప్రాంతం, లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన న‌ర‌సాపురంలో ఈసారి త్రిముఖ పోటీ ఉండ‌నుంది. టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌ పార్టీల మ‌ధ్య పోరు సాగ‌నుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాపు సామాజికవ‌ర్గం ఓట్లు 40 శాతం ఉండ‌గా బీసీ, ఎస్సీల‌తో పాటు ఇత‌ర కులాలు క‌లుపుకుని 60 శాతం ఓట్లు ఉన్నాయి. ఇక టీడీపీ, జ‌న‌సేన పార్టీలు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థుల‌కు టికెట్లు కేటాయిస్తే వైసీపీ విజ‌యం ఖాయ‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీసీలే అభ్య‌ర్థి విజ‌య‌వ‌కాశాల‌ను నిర్ణ‌యించనున్నారు. ఇక్కడ మొదటి నుంచి రాజ‌కీయ వేడి ఎక్కువే. అంత ఈజీగా కూడా ఎవ‌రి ప‌క్షాన ఓట‌ర్లు నిల‌బ‌డ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. ఇక ఇప్ప‌టికే మూడు పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావ‌హులు త‌మ టికెట్ ప్ర‌య‌త్నాల‌ను మొద‌లుపెట్టారు. అధినేత‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ఉన్నారు.

టీడీపీలో రెండు వర్గాలు…

జ‌న‌సేన నుంచే అయితే మిక్కిలి సంఖ్య‌లో ఆశావ‌హుల పేర్లు విన‌బ‌డుతున్నాయి. వైసీపీ నుంచి ముగ్గురు టీడీపీ నుంచి ఇద్ద‌రి పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. ఇక బీజేపీకి పెద్ద‌గా ఓటు బ్యాంకు లేదు. కాంగ్రెస్ ప‌రిస్థితి కూడా అంతే. కాబ‌ట్టి ఈ రెండు పార్టీల నుంచి అభ్య‌ర్థులు పోటీలో అయితే నిల‌బ‌డ‌వ‌చ్చు గెలిచే స‌త్తా మాత్రం లేదు. కాక‌పోతే కొన్ని ఓట్ల‌ను చీల్చ‌డం వ‌ల్ల అభ్య‌ర్థుల విజ‌య‌వ‌కాశాల‌ను తారుమారు చేయ‌గ‌ల శ‌క్తి అయితే ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక ఆయా పార్టీల్లోని ఆశ‌వ‌హుల విష‌యానికి వ‌స్తే టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధ‌వ‌నాయుడుకే టికెట్ ద‌క్కే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. ఆయ‌న‌పై నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల్లో పాజిటివ్‌గా ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని చెప్పాలి. ఆయ‌న‌కు పోటీగా టీడీపీ నుంచి మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ సాధించేందుకు ఆయ‌న విశ్వప్ర‌య‌త్నం చేస్తున్నారు. కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా సుబ్బారాయుడు కొన‌సాగుతున్నారు.

వైసీపీ టిక్కెట్ ప్రసాదరాజుకే..?

ఈ ప‌ద‌వి ఇచ్చాక నియోజ‌క‌వ‌ర్గంలో సుబ్బారాయుడు సైతం త‌న వ‌ర్గాన్ని బ‌లోపేతం చేసుకోవ‌డంతో పార్టీ రెండు గ్రూపులుగా చీలింది. టిక్కెట్ కోసం ఇద్ద‌రి మ‌ధ్య పోటీ మాత్రం ఆస‌క్తిదాయ‌కంగా ఉంది. వైసీపీ నుంచి ముదునూరి ప్ర‌సాద‌రాజు పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి సుబ్బారాయుడికి టికెట్ కేటాయించ‌గా ఓట‌మిని చ‌వి చూశాడు. ఆ త‌ర్వాత కాలంలో ఆయ‌న టీడీపీ పంచ‌న చేరారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్ ద‌క్కించుకునేందుకు సుబ్బారాయుడుతో ముదునూరి ప్ర‌సాద‌రాజు పోటీ ప‌డ్డాడు. ఓ ద‌శ‌లో ఆయ‌నకు టీడీపీ టికెట్ ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేసినా ఆయ‌న వెళ్ల‌లేదు. వైసీపీలో అంకిత‌భావంతో ప‌నిచేస్తున్న ఆయ‌న‌కే టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో స‌త్సంబంధాలు ఉన్నాయి. ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గం నుంచి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. క‌ల‌వ కొల‌ను నాగ తుల‌సీరావు, హైకోర్టు న్యాయ‌వాది కె.చిదంబ‌రం, ఇల‌కుర్తి ప్ర‌కాశ్‌, దాన‌య్య‌ నాయుడు, అగ్నికుల‌ క్ష‌త్రియ సామాజికవ‌ర్గానికి చెందిన బ‌ర్రె జ‌య‌రాజు, మైల వీర్రాజు, బొమ్మిడి నాయ‌క‌ర్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. జ‌న‌సేన అధినేత సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఆ పార్టీ ప్ర‌భావం ఇక్క‌డ గ‌ట్టిగా ఉన్నా అది ఎలా ఉంటుంద‌న్న‌ది మాత్రం చెప్ప‌లేం.

Tags:    

Similar News