పీల గొంతుకతో హోదా మాట ?

ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తున్నారు అన్నపుడు తెలుగులో ప్రధాన పత్రికలు దాన్ని బాగా హైలెట్ చేసి కవర్ చేశాయి. అంతే కాదు దాని వెనక రాజ్యసభలో జరిగిన [more]

Update: 2021-03-04 03:30 GMT

ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తున్నారు అన్నపుడు తెలుగులో ప్రధాన పత్రికలు దాన్ని బాగా హైలెట్ చేసి కవర్ చేశాయి. అంతే కాదు దాని వెనక రాజ్యసభలో జరిగిన పోరాటాన్ని కూడా కవర్ చేశాయి. నాడు రాజ్యసభలో బీజేపీ పక్ష నేత దివంగతుడైన అరుణ్ జైట్లీ, ఈనాటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇద్దరూ కలసి పట్టు బట్టి మరీ పెద్దల సభలో ఏపీకి హోదా ఇస్తామని ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేత చెప్పించారు. అంటే ఆ హామీ వెనక అంతటి చరిత్ర ఉంది. అడ్డంగా ఉమ్మడి ఏపీని కోత కోసిన ఆవేదన కూడా ఉంది.

డిమాండ్ నుంచి అలా…

ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తామంటూ తిరుపతి సాక్షిగా నాటి ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీ చెప్పారు. ఇక ఏపీలో ఊరూ వాడా బీజేపీ నేతలు 2014 ఎన్నికల ముందు తిరిగి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఇక బీజేపీ పెద్దలు పవర్ పట్టేసిన మీదట అయిదేళ్ల పాటు ఎన్నో రకాలుగా మాటలు మార్చి చివరికి దాన్ని బుట్టలో పెట్టేశారు. హోదా గత అయిదేళ్ల కాలంలో ఒక డిమాండ్ గా అయినా ఉండేది. 2019 ఎన్నికలో ఒక నినాదంగా కూడా పనిచేసింది. కానీ అదే హోదా గత రెండేళ్ళుగా ఎక్కడ వినిపిస్తోంది అంటే కేవలం జగన్ నోటి మాటల ద్వారానే అని చెప్పుకోవాలి.

శంఖం ఊదినట్లే ….

బీజేపీ నెరజాణతనమది. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజి ఇస్తామని చెప్పి చంద్రబాబుని ఒప్పించారు. ఆ తరువాత ఆయన మళ్ళీ హోదా అని ధర్మ పోరాట దీక్షలకు దిగడంతో అదీ ఇదీ కాకుండా పోయింది. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా కావాలని సందర్భం దొరికినపుడల్లా కోరుతూ వస్తున్నారు. కానీ అది చెవిటివాడి ముందు శంఖం ఊదిన చందం అవుతోంది. హోదా మాటకు కనీసం అవునని కాదని కూడా బీజేపీ పెద్దలు చెప్పడం లేదంటే అది వారికి ఎంతటి తేలిక అంశం అయిపోయిందో ఆంధ్ర జనాలు గుర్తించాల్సి ఉంది.

ప్రాధేయపడాలా …?

ఏపీకి ప్రత్యేక హోదా అయినా, విభజన హామీలు అయినా ఎందుకు ప్రాధేయపడాలి అన్నదే ఏపీ జనాల ప్రశ్నగా ఉంది. చట్ట సభలలో హామీలు ఇచ్చిన వారు వాటిని నెరవేర్చే బాధ్యతను తీసుకోకపోతే ఎలా అని మేధావులు నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్లీజ్ మాకు ప్రత్యేక హోదాను ఇవ్వండి అంటూ ఒక ముఖ్యమంత్రి వెంటపడడం అంటే దారుణమే. ఆయన ఓ వైపు అడుగుతున్న కనీసం దానిని ప్రస్థావనకు కూడా తీసుకురాకుండా కేంద్ర పెద్దలు వ్యవహరించడం ఇంకా బాధాకరం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చిటికలో ప్రత్యేక హోదా వస్తుంది అని ఈ మధ్యనే పీసీసీ చీఫ్ సాకె శైలజానాధ్ అంటున్నారు. ఎవరు అధికారంలో ఉంటే ఏమిటి, ఇచ్చిన హామీని నెరవేర్చమని కోరే ఐక్యత కానీ, దూకుడుతనం కానీ ఏపీ రాజకీయ పక్షాలకు లేకపోతోనూ అన్న నిర్వేదం జనాల్లో ఉంది. ఏది ఏమైనా గంగమ్మ శివుడి జటాజూటం నుంచి అలా జారిపడి ఎక్కడ నుంచో ఎక్కడికో పాకినట్లుగా ప్రత్యేక హోదా అన్న అంశం ఒకనాడు ఘనం. ఇపుడు దాన్ని కనం, వినం అన్నట్లుగా తయారైంది.

Tags:    

Similar News