బ్యాడ్ లక్ రాహుల్…!!!

యుద్ధం మొదలు పెడితే తాడో పేడో తేల్చుకోవాల్సిందే.మధ్యేమార్గం ఉండకూడదు. అన్ని ఆయుధాలు ప్రయోగించాలి. కాంగ్రెసు పార్టీకి, మోడీ నేతృత్వంలోని బీజేపీకి మధ్య తేడా అదే. ఉత్తర భారతంలో [more]

Update: 2019-01-09 15:30 GMT

యుద్ధం మొదలు పెడితే తాడో పేడో తేల్చుకోవాల్సిందే.మధ్యేమార్గం ఉండకూడదు. అన్ని ఆయుధాలు ప్రయోగించాలి. కాంగ్రెసు పార్టీకి, మోడీ నేతృత్వంలోని బీజేపీకి మధ్య తేడా అదే. ఉత్తర భారతంలో తమ ప్రాబల్యం క్షీణించింది. దక్షిణాదిన ఎలాగూ పట్టు లేదు. సంప్రదాయకంగా తమకు మద్దతు గా నిలుస్తున్నవర్గాలు చేజారిపోతున్నాయి. అగ్రవర్ణాలూ దూరమైపోయాయి. అటు బీసీ కార్డు పనిచేయడం లేదు. ఎస్సీ లకు ఎంత చేసినా దూరం జరుగుతున్నారు . మైనారిటీ వర్గాలైన ముస్లిం, క్రిస్టియన్ వర్గాలు ఎలాగూ తమ దరికి చేరరు. రాజకీయపరమైన ఈ సమీకరణలన్నీ చూసుకున్న తర్వాతనే కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు, ఆర్థిక అంశాలు, జీవన ప్రమాణాలకు సంబంధించిన విషయాల్లో చురుకైన చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఒకేతాటిపైకి వస్తున్న విపక్షాలతో వార్ కు సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్రమోడీ బీసీ సామాజికవర్గానికి చెందినవారు అంటూ నాలుగేళ్లపాటు ప్రచారం సాగించారు. ఫలితం శూన్యం. వ్యాపారవర్గాలు, అగ్రవర్ణాలు, మధ్యతరగతి వర్గాలు బీజేపీకి గట్టి మద్దతుగా నిలవడంతోనే 2014లో విజయం సాధ్యమైంది. కానీ 2019 నాటికి పరిస్థితులు ఆరకంగా కనిపించడం లేదు. తమ విధానాలు, సిద్దాంతాలను ఎంతగా పక్కనపెట్టినా కొత్తవర్గాలు పార్టీకి చేరువ కావడం లేదు. పాత వర్గాలు క్రమేపీ విశ్వాసం కోల్పోతున్నాయి. ఈ పరిస్థితినుంచి బయటపడేందుకు అధికారపార్టీగా అవకాశమున్న అన్ని అంశాలనూ వినియోగించుకునే ప్రయత్నం మొదలు పెట్టింది బీజేపీ. ఇరుగుపొరుగున ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ లనుంచి వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే బిల్లుకు ఆమోదం చెప్పడమూ బీజేపీ ఓట్ల పోలరైజేషన్ లో భాగమే.

ఆదాయపన్నుపైనా…

కేంద్రప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందనే భావన దేశవ్యాప్తంగా నెలకొంది. కనీసం అయిదు లక్షల రూపాయల వరకూ ఆదాయపన్ను పరిమితిని పెంచాలని డిమాండు ఉన్నప్పటికీ కేంద్రప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తూ వస్తోంది. పైపెచ్చు వివిధ రకాల సెస్సుల రూపంలో మధ్యతరగతి వర్గంపైనే పన్నుల భారం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు ధరలు తగ్గినా దేశంలో మాత్రం దానికి అనుగుణంగా తగ్గించరు. సెస్సు రూపంలో జేబులు కొల్లగొడతారు. ద్విచక్రవాహనాలు వినియోగించే మధ్యతరగతి ప్రజలే ఇందుకు ఎక్కువగా బలవుతున్నారు. ప్రభుత్వం చట్టబద్ధమైన దోపిడిదారుగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తడానికి కేంద్రవిధానాలు ఆస్కారం కలిగిస్తున్నాయి. ఇది ప్రబలమైన వాదనగా మారడంతో మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు బీజేపీపీకి క్రమేపీ దూరమవుతూ వచ్చాయి. దీనిని గ్రహించిన అధినాయకత్వం రానున్న బడ్జెట్ లో ఆదాయపన్నులో భారీ మినహాయింపులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. తద్వారా మిడిల్ క్లాసును ఆకట్టుకోవాలనేది ఆలోచన. మధ్యతరగతి వినియోగవస్తువులపై పన్నుల తగ్గింపు నకూ పూనుకోబోతున్నారు. బడ్జెట్ లో భారీగానే ప్రజాకర్షక విధానాలు రాబోతున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. హస్తినలో అందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలైంది. దీర్ఘకాలిక ప్రణాళికలకు సమయం తక్కువగా ఉంది. అందువల్ల బడ్జెట్, రిజర్వేషన్లు బీజేపీని ఒడ్డున పడేసే మహామంత్రాలుగా భావిస్తున్నారు.

ప్రయివేటు సంస్థలకూ..

ఉన్నత విద్య లో ప్రయివేటు మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు విస్తృతంగా పెరుగుతున్నాయి. అక్కడ కూడా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ పెరుగుతోంది. దీనిపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ప్రయివేటు సంస్థలతో ఆయాపార్టీలకు, నాయకులకు నేరుగా సంబంధాలు ఉండటం వల్ల కొంత జాప్యం జరిగే అవకాశం కూడా ఉంది. చట్టసభల సభ్యుల్లో చాలామంది ప్రయివేటు విద్యాసంస్థల నిర్వాహకులుగా ఉన్నారు. ప్రధాన పార్టీలకు ఫండింగులోనూ ఆయా సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా ప్రయివేటు సంస్థల్లో రిజర్వేషన్లపై న్యాయస్థానాల నిషేధమూ ఉంది. అల్టిమేట్ గా ఓటు బ్యాంకు రాజకీయాల్లో సానుకూలంగా పనిచేస్తుందని భావిస్తే నిర్ణయం తీసుకోవడం ఖాయం. అందులోనూ మోడీ తలచుకుంటే అడ్డుకునేవారెవరూ ఉండరు. దేశవ్యాప్తంగా ప్రయివేటు విద్యాసంస్థల ఫీజులు, ఇతర రూపాల్లో రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు సాగుతున్నట్లు అంచనా. తూతూ మంత్రం పర్యవేక్షణ మినహా ఫీజుల విషయంలో ఎటువంటి ఆంక్షలు , పరిమితులు అమలు కావడం లేదు. చట్టరూపంలో కులాలకు అతీతంగా పేదలకు రిజర్వేషన్ అమలు చేయడంతోపాటు ఫీజుల విషయంలోనూ నిర్దిష్ట నియంత్రణ, నిబంధనలను చేర్చితే ప్రయోజనదాయకమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మోదీ వంటి మొండి మనిషే దీనిని అమలు చేయగలడనే విశ్వాసాన్నీ వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రయివేటు పారిశ్రామిక సంస్థల జోలికి మాత్రం వెళ్లకపోవచ్చునంటున్నారు.

కాంగ్రెసుకు కష్టకాలమే…

పేరు గొప్ప కాంగ్రెసు పార్టీ వైఫల్యాలనే తన సోపానాలుగా చేసుకుంటూ మోడీ చరిత్ర సృష్టిస్తున్నారు. కాంగ్రెసులో దీర్ఘ దృష్టి, చిత్తశుద్ధి లోపించడంతో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల వంటి అంశం పెండింగులో ఉంటూ వస్తోంది. 1990లలో ఓబీసీలకు రిజర్వేషన్ల అమలు తర్వాత దేశంలో అగ్రవర్ణాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. వాటిని చల్లార్చడానికి ఆఫీసు మెమొరాండం ద్వారా ఆర్థికంగా వెనకబడిన తరగతుల పేరిట అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు పీవీ నరసింహారావు ప్రయత్నించారు. కోర్టు కొట్టేయగానే ప్రత్యామ్నాయం ఆలోచించకుండా పక్కనపెట్టేశారు. ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వర్గాలు వ్యతిరేకంగా స్పందిస్తాయోమోననే భయంతో 2004 నుంచి 2014 వరకూ సైతం ఈ డిమాండుపై నిర్లక్ష్యం వహించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఈబీసీ రిజర్వేషన్ల అవకాశాలను పరిశీలించింది. కానీ సాహసించలేకపోయింది. అదే నివేదికను ప్రామాణికంగా తీసుకుంటూ ప్రస్తుతం రిజర్వేషన్లకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకరి దురదృష్టం మరొకరి అవకాశంగా మారుతుందని చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణ మరొకటి దొరకదు. తాజా నిర్ణయం వెంటనే అమలులోకి రాకపోయినప్పటికీ బీజేపీ పాచిక పారినట్లే కనిపిస్తోంది. దీనిపై అప్పుడే దేశంలో చర్చ మొదలైంది. విపక్షాలు పెద్దగా వ్యతిరేకించలేని వాతావరణం ఏర్పడింది. బీజేపీ దీనిని రాజకీయంగా చక్కగా వినియోగించుకునే అవకాశం కనిపిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News