ఒక్కటైనా వదులుతానా?

ఒకే ఒక్క స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నప్పటికీ రెండు పార్టీల్లో టెన్షన్ పట్టుకుంది. ఒడిశాలో బిజెపూర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 21వ [more]

Update: 2019-10-21 17:30 GMT

ఒకే ఒక్క స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నప్పటికీ రెండు పార్టీల్లో టెన్షన్ పట్టుకుంది. ఒడిశాలో బిజెపూర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 21వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రచారం అన్ని పార్టీలూ ముమ్మరంగా చేశాయి. జరిగేది ఒక్క స్థానమైనా ఎందుకు ప్రతిష్టాత్మకమంటే ఇది ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నియోజకవర్గం కావడమే. అందుకే ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ, బిజూ జనతాదళ్ భావిస్తున్నాయి.

రెండూ గెలవడంతో…..

2019 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ బిజేపూర్, హింజిలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల నుంచి గెలుపొందిన నవీన్ పట్నాయక్ తనకు తొలి నుంచి అచ్చొచ్చిన హింజిలిని ఉంచేసుకుని, బిజెపూర్ ను వదిలేసుకున్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా నవీన్ పట్నాయక్ కు వచ్చే నష్టమేదీ లేదు. బీజేపీకి కూడా అంతే. కానీ రెండు పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాయి.

ఒకప్పుడు కాంగ్రెస్ కు…..

నిజానికి బిజెపూర్ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. బిజెపూర్ నుంచి సుబల సాహు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆయన మరణం తర్వాత సుబల సాహు సతీమణి రీతాసాహును బిజూ జనతాదళ్ ఆహ్వానించి పార్టీలోకి చేర్చుకుంది. 2018 ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఈ ప్రాంతంలోని నియోజకవర్గాలన్నింటిపై ప్రభావం చూపాలని నవీన్ పట్నాయక్ భావించారు. అనుకున్నట్లుగానే ఆ ఎఫెక్ట్ కన్పించింది. మళ్లీ ఉప ఎన్నికల్లో రీతా సాహును అభ్యర్థిగా నవీన్ పట్నాయక్ నిలబెట్టారు.

ప్రతిష్టాత్మకంగా…..

ఈ నియోజకవర్గాన్ని నవీన్ పట్నాయక్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే మొత్తం నియోజకవర్గంలో 49 చోట్ల రోడ్ షోలు నిర్వహించారు. ఇక బిజూ జనతాదళ్ మంత్రులు పది మంది బిజెపూర్ లోనే మకాం వేసి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించారు. ఇక బీజేపీ తరుపున సనాతన్ గడర్తియా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు ధర్మేంద్రప్రదాన్, ప్రతాపచంద్ర షడంగి తదితరులు పర్యటించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా దిలీప్ కుమార్ పండా పోటీ చేస్తున్నారు. మొత్తం మీద త్రిముఖ పోటీలా పైకి కన్పిస్తున్నప్పటికీ ఉప ఎన్నిక జరిగే బిజెపూర్ మాత్రం నవీన్ పట్నాయక్ ఖాతాలో పడటం ఖాయమని చెబుతున్నారు. ఫలితం ఈ నెల 24వ తేదీన వెల్లడి కానుంది.

Tags:    

Similar News