ఒడిశా లో ఈ ఫార్ములాను అమలు చేసి?

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన ఇరవై సంవత్సరాల్లో అత్యంత క్లిష్టమైన సమస్యను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ తో ఇప్పటికే రాష్ట్రం [more]

Update: 2020-04-09 17:30 GMT

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన ఇరవై సంవత్సరాల్లో అత్యంత క్లిష్టమైన సమస్యను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ తో ఇప్పటికే రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గింది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టడంతో పాటు పేదలను లాక్ డౌన్ సమయంలో ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు నవీన్ పట్నాయక్.

ఏదో ఒక విపత్తుతో….

ఒడిశా పెద్ద రాష్ట్రం. అభివృద్ధి చెందని రాష్ట్రం. తీర ప్రాంతం ఎక్కువగా ఉండటంతో నిత్యం వరదలు, తుపానులతోనే ఒడిశా సతమతమవుతోంది. నవీన్ పట్నాయక్ గత ఇరవై ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఒడిశాలో 39 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇవి కూడా ఎక్కువగా భువనేశ్వర్ లోనే బయటపడ్డాయి. కటక్, భద్రక్ లలో కూడా కరోనా పాజిటివ్ కేసులు బయటపడటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.

కేసు కనిపిస్తే షట్ డౌన్…..

దీంతో రెండు రోజుల క్రితం భువనేశ్వర్, కటక్, భద్రక్ లలో 48 గంటల పాటు షట్ డౌన్ ను విధించారు. ఈ మూడు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా కట్టడి చేయగలిగారు. మరోవైపు కరోనా సోకిన వారిని క్వారంటైన్ కు తరలించడంతో పాటు అనుమానితులకు కూడా ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయిస్తున్నారు. ఒడిశాలో వెయ్యి పడకల ప్రత్యేక ఆసుపత్రిని కరోనా కోసమే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆసుపత్రిలోనే ఎక్కువగా కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్నారు.

పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వారి నుంచి….

ఒడిశా లో ఎక్కువగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి నుంచే వైరస్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ విదేశాల నుంచి వచ్చిన వారు తక్కువ. వారికి పరీక్షలు నిర్వహించారు. అయితే పొరుగునే ఉన్న పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వివిధ పనులకోసం వెళ్లిన వారి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందన్నది ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. అందుకే కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా గుర్తించి షట్ డౌన్ చేసేస్తున్నారు. ఇది సత్ఫలితాలను ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత ఒడిశాలో లాక్ డౌన్ ఎత్తివేయవచ్చని కూడా అధికారులు చెబుతుండటం విశేషం. వైరస్ సోకిన వారిని ట్రేస్ చేసి వెంటనే టెస్ట్ లు చేయించడం వల్లనే కరోనాను చాలా వరకూ కట్టడి చేయగలిగామని ఒడిశా అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News