చెప్పాలంటే ఎంతో ఉంది…??
నవీన్ పట్నాయక్… సమకాలీన రాజకీయాల్లో శిఖర సమానుడు. నీతి, నిజాయితి, నిరాడంబరతలకు నిలువెత్తు నిదర్శనం. ప్రజారంజక పాలనకు పెరెన్నికగన్న నాయకుడు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు. అన్నింటికి [more]
నవీన్ పట్నాయక్… సమకాలీన రాజకీయాల్లో శిఖర సమానుడు. నీతి, నిజాయితి, నిరాడంబరతలకు నిలువెత్తు నిదర్శనం. ప్రజారంజక పాలనకు పెరెన్నికగన్న నాయకుడు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు. అన్నింటికి [more]
నవీన్ పట్నాయక్… సమకాలీన రాజకీయాల్లో శిఖర సమానుడు. నీతి, నిజాయితి, నిరాడంబరతలకు నిలువెత్తు నిదర్శనం. ప్రజారంజక పాలనకు పెరెన్నికగన్న నాయకుడు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు. అన్నింటికి మించి తన పరిమితులు ఏమిటో తనకు బాగా తెలిసిన నాయకుడు. అయిదు సార్లు ముఖ్యమంత్రి అయినా అధికార గర్వం తలకు ఎక్కని ఏకైక నాయకుడు. నవీన్ పట్నాయక్ గుణగుణాలను ప్రస్తుతించడానికి ఇంతకు మించి మాటలు రావు. మాతృభాష పై పెద్దగా పట్టులేక పోయినా ప్రజలపై గట్టి పట్టున్న నాయకుడు. ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆదర్శ నేత. నేటి తరం నాయకులు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పడం అతిశయోక్తి కానే కాదు.
వ్యూహాలను రచించడంలో….
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అయిదోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నవీన్ పట్నాయక్ గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. తెలుసుకోవలసింది కూడా ఎంతో ఉంది. బిజూ జనతాదళ్ అధినేతగా, పేద రాష్ట్రమైన ఒడిశా ముఖ్యమంత్రిగా పట్నాయక్ ప్రస్థానం ఆదర్శనీయం. అభినందనీయం. ఎప్పుడూ ప్రశాంతగా, నిండుకుండలా చిరునవ్వుతో కన్పించే పట్నాయక్ కేవలం రాజకీయ నాయకుడే కాదు. మంచి సాహితీవేత్త. రచయిత. వివిధ కళల్లో ఆయనకు ప్రవేశం ఉంది. పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తారో ప్రత్యర్థుల పట్ల అంత కఠినంగా వ్యవహరిస్తారు. పైకి అమాయకంగా కనిపించినా వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నడంలో దిట్ట. విభిన్న కోణాలు, అరుదైన లక్షణాలు గల నవీన్ పట్నాయక్ ఒడిశా పెద్ద దిక్కుగా రాష్ట్ర ప్రజలు భావిస్తుంటారు.
తండ్రి మరణానంతరం….
ఒడిశా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ మరణానంతరం ఆయన కుమారుడైన నవీన్ పట్నాయక్ 1997లో రాజకీయ వారసత్వం స్వీకరించారు. రాజీ లేని వ్యక్తిత్వం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. అందువల్లే రెండు దశాబ్దాలుగా రాష్ట్రంపై రాజకీయంగా పట్టు సాధించారు. రాష్ట్ర రాజకీయాలను శాసించగలుగుతున్నారు. ప్రజల మన్ననలను పొందగలుగుతున్నారు. తండ్రి బిజూపట్నాయక్ మరణానంతరం 1997లో ఆయన ప్రాతినిధ్యం వహించిన ఆస్కా నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఏడాది తర్వాత సొంత పార్టీ జనతాదళ్ చీలిపోయింది. దీంతో తండ్రి పేరుతో సొంతంగా బిజూ జనతాదళ్ పార్టీని ప్రారంభించారు. తొలుత బీజేపీతో కలసి నడిచారు. 1998లో వాజ్ పేయి మంత్రివర్గంలో చోటు దక్కింది. 1998, 1999 లోక్ సభ ఎన్నికల్లో ఆస్కో నుంచి ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించారు. తొలిసారి సీఎం అయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయదుంధుభి మోగించారు. అయితే కాంద్ మాల్ అల్లర్లు బీజేడీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టాయి. వీహెచ్ పీ నాయకుడు స్వామి లక్ష్మాణానంద హత్య తో రెండు పార్టీల మధ్య మరింత దూరం పెరిగింది. దీంతో 2009లో జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీలోకి దిగారు. ఈ నిర్ణయం రాజకీయంగా ఆయనకు లాభాన్ని కల్గించింది. మొత్తం 21 స్థానాలకు గాను 14 లోక్ సభ స్థానాలను పార్టీ గెలుచుకుంది. 147 అసెంబ్లీ స్థానాలకు గాను 103 స్థానాలను గెలుచుకుని తిరుగులేని విజయం సాధించారు. దీంతో ఆయనకు రాజకీయంగా తిరుగులేకుండా పోయింది.
కూలదోసే ప్రయత్నాన్ని…..
2012 లో పట్నాయక్ విదేశీ పర్యటనలో ఉండగా ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం జరిగింది. విపక్షాలన్నీ ఏకమయ్యాయి. సొంత పార్టీలోని కొందరు అసమ్మతివాదులు కూడా మద్దతిచ్చారు. చివరకు విపక్షాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పట్నాయక్ కు ప్రజల్లో సానుభూతి పెరిగింది. 2014 ఎన్నికల్లో మళ్లీ ఘన విజయం సాధించి 21 లోస్ సభ స్థానాలకు గాను 21, 147 అసెంబ్లీ స్థానాలకు గాను 117 స్థానాలను గెలుచుకున్నారు. నాలుగోసారి సీఎం అయ్యారు. తాజా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ మంచి మెజారిటీ సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేడీ 12, బీజేపీ 8, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. 146 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేడీ 112, బీజేపీ 23, కాంగ్రెస్ 9 స్థానాలను గెలుచుకున్నాయి. మొత్తానికి బీజేపీ గట్టి సవాల్ విసిరింది. శక్తిగా అవతరించింది. కాంగ్రెస్ ను కాదని ప్రత్యామ్నాయంగా నిలిచింది. భవిష్యత్తులో బీజేపీని నవీన్ పట్నాయక్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.
-ఎడిటోరియల్ డెస్క్