అన్నివైపులా రెడ్ సిగ్నల్స్…?
కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవాలంటే కేంద్రప్రభుత్వ సహకారంతో పాటు రాష్ట్రమూ అనేక రకాలుగా కష్టపడాలి. కేంద్రం పూచికపుల్ల అదనంగా విదిల్చేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పేసింది. ప్రత్యేక [more]
కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవాలంటే కేంద్రప్రభుత్వ సహకారంతో పాటు రాష్ట్రమూ అనేక రకాలుగా కష్టపడాలి. కేంద్రం పూచికపుల్ల అదనంగా విదిల్చేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పేసింది. ప్రత్యేక [more]
కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవాలంటే కేంద్రప్రభుత్వ సహకారంతో పాటు రాష్ట్రమూ అనేక రకాలుగా కష్టపడాలి. కేంద్రం పూచికపుల్ల అదనంగా విదిల్చేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పేసింది. ప్రత్యేక హోదా సంగతే ఎత్తడానికి ఇష్టపడటం లేదు. ఈ స్థితిలో రాష్ట్రం గడ్డు పరిస్తితినే ఎదుర్కొంటోంది. దానికి తోడు తెలివి తక్కువ నిర్ణయాల కారణంగా దీర్ఘకాలం ఇబ్బందులను కొని తెచ్చుకుంటోంది. వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెంచుకోవాలంటే పారిశ్రామికీకరణకు పెద్దపీట వేయాలి. సాఫ్ట్ వేర్ వంటి సర్వీసు ఆధారిత రంగాలు ఏపీకి వచ్చే అవకాశాలు అంతంతమాత్రమే . హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలు ఆ అవకాశాలను పూర్తి స్థాయిలో ఒడిసిపట్టాయి. చాలా వేగవంతమైన అబివృద్ధి, ఉపాధి కల్పనకు ఉపకరించే సర్వీస్ సెక్టార్ అనుకూల పరిస్థితులు లేవు. పన్నుల రూపంలో వ్యవసాయం నుంచి ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాదు. అందువల్ల పరిశ్రమలను ప్రోత్సహిస్తూ, ఉఫాదికి ఊతమిస్తూ క్రమేపీ ఆదాయం పెంచుకోవడం తప్పనిసరి. కానీ ఆంధ్రప్రదేశ్ సర్కారు ధోరణి తప్పుడు సంకేతాలు పంపుతోంది.
రాజకీయంతో చిక్కులు..
దీర్ఘకాలం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు సందిగ్ధావస్థకు లోనవుతున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణే. చిత్తూరు జిల్లా పారిశ్రామికంగా పునాది వేసుకోవడానికి అమరరాజా కంపెనీ కొంతవరకూ దోహదం చేసింది. తాజాగా ఆ కంపెనీ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ సంస్థ వ్యవస్తాపకులకు తొలి నుంచి కాంగ్రెసుతో అనుబంధం ఉంది. ఇప్పటి కంపెనీ నిర్వాహకుడు జయదేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ కావడంతో సమస్య పెరిగినట్లుగా కనిపిస్తోంది. సాధారణ రాజకీయాలకు పరిశ్రమల మనుగడతో ముడిపెట్టడం ప్రమాదకరధోరణి. ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి వరసదాడులు, హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడుకు తరలి పోవడానికి అమరరాజా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే చిత్తూరు జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష కుటుంబాల ఉపాధి కి దెబ్బ తగులుతుంది. అదే జిల్లాలో గతంలో రిలయన్స్ కంపెనీ మొబైల్ ఫ్యాక్టరీ ప్రతిపాదన కూడా పట్టాలపైకి రాలేదు. ఉన్న కంపెనీలు తరలిపోతుంటే కొత్త కంపెనీలు రావడానికి సాహసించకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిపై పెను ప్రబావం పడుతుంది.
అధికారుల అసహనం …
గడచిన నాలుగైదు నెలలుగా జీతాలు సకాలంలో చెల్లించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. నెలవారీ అయిదువేల అయిదువందల కోట్ల రూపాయలు జీతాలు, పింఛన్ల నిమిత్తం అవసరమవుతాయి. రాష్ట్రానికి అంత పెద్ద మొత్తంలో వనరులు సమకూరడం లేదు. అందువల్ల ప్రతినెలా అప్పులు తెచ్చి పరిస్తితిని చక్కదిద్దుతున్నారు. రాష్ట్రంలో పనిచేసి పదవీ విరమణ చేసిన అఖిలభారత సర్వీసు అధికారులకు పింఛన్లు మొత్తాన్ని కేంద్రం అంద చేస్తుంది. అయితే వాటిని ముందుగా రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తుంది. తర్వాత ఆ మొత్తాన్ని కేంద్రం సర్దుబాటు చేస్తుంది. ప్రతినెలా నిర్దిష్ట కాలంలో ఈ చెల్లింపు సాగకపోవడం పట్ల కొందరు రిటైర్డ్ అధికారులు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా కేంద్రం చెల్లింపులు చేయాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు అధికారికంగా కేంద్రానికి వారు లేఖలు రాస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవమానకరమే. రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలకు సైతం తప్పుడు సంకేతాలు వెళతాయి.
అవసరార్థం అబద్దాలు…
పూర్తిగా ఆర్తిక సమస్యలు కమ్ముకోవడంతో అవసరార్థం అబద్దాలు చెప్పక తప్పని స్థితి ఏర్పడింది. వివిధ రూపాల్లో పేరుకున్న బకాయిలు చట్ట ప్రకారం చెల్లించాలంటూ హైకోర్టు అనేక సందర్బాల్లో ప్రభుత్వాన్ని ఆదేశిస్తోంది. ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటంతో బకాయి దారులు అనేక మంది మళ్లీ మళ్లీ కోర్టును ఆశ్రయిస్తున్నారు. అయినా చెల్లింపులు జరగడం లేదు. దీంతో కోర్టు ధిక్కరణ వంటి వ్యాజ్యాలు దాఖలు అవుతున్నాయి. తాజాగా ఉపాధి హామీ పనుల నిధులకు సంబంధించిన కేసులో రెండువేల కోట్ల రూపాయల వరకూ చెల్లించాలని తేల్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతపెద్దమొత్తాన్ని చెల్లించేందుకు నిధులు లేక సతమతమవుతోంది. అలాగే జీతాల కోసం రిజర్వ్ బ్యాంకు వద్ద సెక్యూరిటీలు వేలం వేసి రెండు వేల కోట్ల రూపాయలు సమకూర్చుకుంది. ప్రభుత్వ ఖజానాకు రాకుండానే రిజర్వ్ బ్యాంకు ఇప్పటికే చేసిన ఓవర్ డ్రాఫ్ట్ అప్పుకింద నొక్కి పట్టింది. ఈ పరిణామాలన్నీ తీవ్రమవుతున్న ఆర్థిక దుస్థితికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి . ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిధుల సమీకరణకు కేంద్రం అడ్డు చెబుతోంది. చట్టబద్ధమైన విధానాల ద్వారా కాకుండా భవిష్యత్ ఆదాయాన్ని సెక్యూరిటీగా చూపుతూ అప్పులు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి 18,500 కోట్లు పరిమితికి మించి అప్పులు చేశారు. ఈ విషయాన్ని కేంద్రం గుర్తించి హెచ్చరికలు జారీ చేసింది. దీనివల్ల రాస్ట్రంలో బ్యాంకులు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వకపోవచ్చు. మొత్తమ్మీద ముప్పేట దాడిగా ఆర్థిక దిగ్బంధనం కొనసాగుతోంది. ఇప్పటికైనా మేలుకొని ఆర్థిక క్రమ శిక్షణ కు పూనుకోకపోతే ప్రభుత్వ రథం ముందుకు కదలడం కష్టమే.
-ఎడిటోరియల్ డెస్క్