నిమ్మగడ్డ దిగిపోయిన తర్వాతనే…?

మొత్తానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక రకమైన సంతృప్తితో తన పదవి నుంచి దిగిపోతున్నారు. ఆయన తానుండగా లోకల్ బాడీ ఎన్నికలు [more]

Update: 2021-03-24 14:30 GMT

మొత్తానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక రకమైన సంతృప్తితో తన పదవి నుంచి దిగిపోతున్నారు. ఆయన తానుండగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేది లేదు అన్న వైసీపీ సర్కార్ మీద అలుపెరగని పోరాటం చేసి మరీ సాధించారు. చివరి రెండు నెలల్లోనే కధ మొత్తం తనకు అనుకూలం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం నాటి పంచాయతీ, మునిసిపాలిటీ ఎన్నికలను విజయవంతంగా జరిపించి తన పంతం నెరవేర్చుకున్నారు. ఇక ఆయనకు బాకీ ఉన్నవి పరిషత్ ఎన్నికలు మాత్రమే. అయితే ఇవి మాత్రం ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడంలేదు అంటున్నారు.

ముందు కొత్త జిల్లాలే …?

ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా చేయాలన్నది జగన్ ఆలోచన. ఎన్నికల్లో కూడా జగన్ ఈ మేరకు హామీ ఇచ్చారు. అన్ని హామీలను నెరవేర్చిన జగన్ కి ఇది మాత్రం మిగిలిపోయింది. గత ఏడాది మార్చిలో అనుకున్నట్లుగా ఎన్నికలు జరిగితే కొత్త జిల్లాల కధ ఏమయ్యేదో ఏమో కానీ ఇపుడు మాత్రం జోరుగానే సాగుతోంది అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ నాయకత్వంలో నియమించిన కొత్త జిల్లాల కమిటీ నివేదిక జగన్ దగ్గర ఉంది. కొత్త జిల్లాలు ఎలా ఉండాలి ఏంటి అన్నది కూడా పూర్తి అవగాహన జగన్ కి ఉంది అంటున్నారు.

ఈ ఏడాదిలోనే ….

దాంతో కొత్త జిల్లాల ప్రకటన అన్నది సరైన సమయంలో జగన్ చేస్తారని అంటున్నారు. వాటి మీద ఇప్పటికే ఉన్న అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని ఒక కొలిక్కి తీసుకువస్తారు అంటున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత మొత్తం 26 జిల్లాలకూ పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని జగన్ ఆలోచనగా ఉందని అంటున్నారు. అపుడు కొత్తగా మరో పదమూడు జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు కూడా వస్తాయని అది వైసీపీకి రాజకీయంగా లాభంగా ఉంటుందని కూడా జగన్ వ్యూహంగా ఉంది. అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని కొత్త జిల్లాల ఏర్పాటుతో మరింత వీక్ చేయాలన్నది కూడా అజెండాగా ఉందిట.

అంతే సంగతులా…?

ఇక కొత్త జిల్లాలు కనుక ఏర్పాటు అయిన తరువాత ఎన్నికలు పెడితే మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలి. దాంతో వేలాదిగా ఏకగ్రీవాలు చేసుకున్న వైసీపీకే అది ఇబ్బంది అంటున్నారు. అయినా సరే జగన్ ధీమాగానే ఉన్నారు. పంచాయ‌తీ ఎన్నికల్లో కనిపించిన సానుకూలత అలాగే కొనసాగుతుందని కూడా ఆయన నమ్మకంగా ఉన్నారు. అయితే కొత్త జిల్లాలు, ఆ తరువాత ఎన్నికలు అన్న ప్రచారంతో వైసీపీలోనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మరీ ముఖ్యంగా ఏకగ్రీవాలు చేసుకున్న వారు లబోదిబోమంటున్నారు. తన గతేం కానూ అని అధికార పార్టీ నేతలను నిలదీస్తున్నారు. అయితే జగన్ మాత్రం కొత్త జిల్లాల ప్రకటన తరువాత ఈ ఏడాది రెండవ భాగంలో పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారుట. ఎన్నికల సంఘం కొత్త ప్రధానాధికారి నేతృత్వంలోనే ఆ ఎన్నికలు ఉంటాయన్నది తెలిసిందే.

Tags:    

Similar News