తెలుగింటి కోడలు లెక్కలు తప్పాయా ?

నిర్మలా సీతారామన్. పుట్టుకతో తమిళురాలు. కానీ ఆమె పరకాల వారి ఇంటి కోడలు. అందుకే ఆమె అచ్చ తెలుగువారే. బీజేపీకి ఏపీ నుంచి కేంద్రం మంత్రులు లేరు [more]

Update: 2020-09-05 16:30 GMT

నిర్మలా సీతారామన్. పుట్టుకతో తమిళురాలు. కానీ ఆమె పరకాల వారి ఇంటి కోడలు. అందుకే ఆమె అచ్చ తెలుగువారే. బీజేపీకి ఏపీ నుంచి కేంద్రం మంత్రులు లేరు అన్న మాట వస్తే నేనున్నాను అని చెప్పుకోవడానికి ఆమె ఉన్నారు. పైగా ఆమె ఒకసారి ఇక్కడ నుంచి రాజ్యసభకు కూడా నెగ్గారు కూడా. సీతమ్మకు ఆవకాయ పెట్టడం బాగా వచ్చు. అత్తగారికి ఇబ్బంది లేకుండా వంటలు బాగా చేస్తారు. సాధారణ గృహిణిగా నిర్మలా సీతారామన్ ఉంటారు. ఆమె చదువు, తెలివి అన్నది పక్కన పెడితే ఓ విధంగా ఆమె సాధారణ మహిళకు ప్రతిబింబం. అటువంటి ఆమెను తెచ్చి దేశానికి ఆర్ధిక మంత్రిని చేస్తే దేశ దశ, దిశ కచ్చితంగా తిరుగుతాయని అంతా భావించారు.

తిరోగమనమే …?

ఇక నిర్మలాసీతారామన్ రక్షణ మంత్రిగా ఏమైనా ప్రతిభ చాటుకున్నారేమో కానీ ఆర్ధిక శాఖను సమర్ధంగా నిర్వహించడంతో మాత్రం దారుణంగా వైఫల్యం చెందారని అంతా అంటారు. ఆర్ధిక వేత్తలు అయితే నిర్మలా సీతారామన్ పాలనాశైలిని తూర్పార‌ పడతారు. ఆమె విషయంలో మరో డౌట్ కూడా ఉంది, నిజంగా ఆమె తన శాఖను తాను చూస్తున్నారా అన్నదే ఆ సందేహం. నిర్మలా సీతారామన్ కు ఆ ఆర్ధిక స్వాతంత్రం లేదని, వెనకాల మోడీ, అమిత్ షాల లాంటి వారి నీడలు పనిచేస్తాయని అంటారు.

వారసత్వమేనా…?

ఇక నిర్మలా సీతారామన్ ఏడాదిన్నరగా ఆర్ధిక మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు అరుణ్ జైట్లీ దేశానికి ఆర్ధిక మంత్రి. నాడు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి దేశాన్ని పూర్తిగా ఆర్ధికంగా పతనం అయ్యేలా చేశాయన్నది ఆర్ధిక నిపుణుల కచ్చితమైన విశ్లేషణ. ఈనాడు అయితే కరోనా వచ్చి దేశ ద్రవ్యోల్బణ స్థితి నాలుగు దశాబ్దాల వెనక్కు పోయింది కానీ మోడీ రెండవ మారు అధికారంలోకి వచ్చిన నాటి ఉంచే నెమ్మదిగా ఆర్ధిక క్షీణత సాగుతూ వస్తోందని నివేదికలు కూడా ఉన్నాయి.

భర్త నుంచి షాక్ …?

ఇక ఇవన్నీ ఎందుకంటే భార్య కమ్మగా వండితే మొదట మెచ్చుకునేది భర్త. ఆ తరువాత అతిధులు వస్తారు. ఇపుడు నిర్మలమ్మ ఆర్ధిక వంట ఏం బాలేదు అని ఆమె భర్త, ఆర్ధిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ పెదవి విరుస్తున్నారు. రుచీ పచీ లేదు అని కూడా ఆయన ముఖం మీదే చెప్పేశారు. అదిపుడే కాదుట. గత ఏడాది అక్టోబర్ నాటికే దేశం ఆర్ధికంగా తిరోగమనం వైపుగా ఉందని పరకాల ప్రభాకర్ చెప్పుకొస్తూ తన భార్యకు, కేంద్రానికి లేఖలు రాశారట. ఆర్ధిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించిన ప్రభాకర్ నాడే విలువైన సూచనలు ఇచ్చరని చెబుతారు. కానీ ఎవరూ పట్టించుకోలేదుట. ఇపుడు కరోనాతో కధ మొత్తం తల్లకిందులైన వేళ తన సతీమణి నిర్మలా సీతారామన్ చెబుతున్న మాటలు ఊసుపోనివేనని కూడా ప్రభాకర్ అనేస్తున్నారు. మరి ఈ దేశ ఆర్ధిక వ్యవస్థ అనే వంటకాన్ని తెలుగు కోడలు సరిగ్గా చేయలేదు అన్నది ఇంట్లో నుంచే వచ్చిన నిష్టూరం. ఆమె లెక్కలు అన్నీ సరిగ్గా లేవని కూడా అభియోగం. ఈ దెబ్బకు తెలుగు కోడలు తప్పుకుంటారా.. లేక మోడీయే తప్పిస్తారా. చూడాలి మరి.

Tags:    

Similar News