తత్వం బోధపడినందునే?

అనుభవమయితే గాని తత్వం బోధపడదు అన్నది పాత తెలుగు సామెత. కేంద్రంలో చక్రం తిప్పుతున్న అధికార భారతీయ జనతా పార్టీకి ఇది బాగానే అర్థమయినట్లు కనపడుతుంది. అందుకనే [more]

Update: 2020-02-08 17:30 GMT

అనుభవమయితే గాని తత్వం బోధపడదు అన్నది పాత తెలుగు సామెత. కేంద్రంలో చక్రం తిప్పుతున్న అధికార భారతీయ జనతా పార్టీకి ఇది బాగానే అర్థమయినట్లు కనపడుతుంది. అందుకనే ఈ ఏడాది అక్టోబరులో ఎన్నికలు జరగనున్న బీహార్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎంతమాత్రం భేషజాలకు పోవడం లేదు. ఆర్భాటపు ప్రకటనలకు, హడావిడి నిర్ణయాలకు దూరంగా ఉంటోంది. మిత్రులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం లేదు. అత్యంత సంయమనం ప్రదర్శిస్తోంది. వచ్చే ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వంలోనే పోరాడతామన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన ఇందుకు నిదర్శనం. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో దిమ్మతిరిగిన కమలం పార్టీ ఇప్పుడిప్పుడే నేలమీద నడుస్తుంది. రేపు ఢిల్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే పరిస్థితి మరింత దిగజారుతుంది. మిషన్ + 60, మిషన్ + 220, మిషన్ + 70 వంటి ఆర్భాటపు నినాదాలతో ఇప్పటి వరకూ మూడు రాష్ట్రాల ఎన్నికల బరిలోకి దిగి తలబొప్పికట్టిన బీజేపీ కాస్త ఆగి నిదానంగా, క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆలోచిస్తుంది.

నితీష్ పై ప్రశంసలతో పాటు….

పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతును కూడగట్టే ప్రక్రియలో భాగంగా ఇటీవల బీహార్ లోని వైశాలి నగరంలో నిర్వహించిన పార్టీ సభకు అమిత్ షా హాజరయ్యారు. సీఏఏకు అనుకూలంగా అనర్గళంగా ప్రసంగించిన షా ఒక్కసారి స్వరాన్ని మార్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలో జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోనే జేడీయూ, బీజేపీ కూటమి పోరాడుతుందన్న అమిత్ షా ప్రకటన పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. అంతేకాకుండా నితీష్ కుమార్ పాలన పై ప్రశంసల జల్లు కురిపించడం పార్టీ వర్గాలకు ఎంతమాత్రం మింగుడుపడలేదు. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో రాష్ట్రం లో జగల్ రాజ్ నితీష్ హయాంలో జనతా రాజ్ గా మారిందని ప్రశంసించారు. పార్టీ శ్రేణులకు ఈ ప్రకటన మింగుడుపడనప్పటికీ అమిత్ షా వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేశారా? అన్నది అంతు చిక్కడం లేదు. ఇటీవల కాలంలో నితీష్ కుమార్, బీజేపీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సీఏఏ బిల్లు పార్లమెంటులో, ముఖ్యంగా రాజ్యసభలో ఆమోదం పొందడంలో నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. తర్వాత రోజుల్లో ఆయన స్వరం మారింది. సీఏఏను వ్యతిరేకిస్తామని, రాష్ట్రంలో అమలు చేయమని, అసెంబ్లీలో ఇందుకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని నితీష్ కుమార్ స్పష్టం చేశారు. సీఏఏ వల్ల మైనారిటీ ఓట్లు దూరమవుతాయన్నది ఆయన భయం. ఈ చట్టంపై మొదటి నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ నిప్పులు కురిపిస్తున్నారు. ఒక్కసారి గతంలోకి వెళితే నితీష్, లాలూప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేసి ఘనవిజయం సాధించాయి.

ఒంటరిగా పోటీ చేసి…..

బీజేపీ ఒంటరిగా పోటీ చేసి విఫలమయింది. నాటి ఎన్నికల్లో లాలూయాదవ్ పార్టీ ఆర్జేడీ 81, నితీష్ పార్టీ 70, బీజేపీ 53 స్థానాలను సాధించాయి. ఒంటరి పోరాటంతో అధికార సాధనకు ప్రయత్నించిన బీజేపీకి ఆ ఎన్నికలు భంగపాటును కల్గించాయి. లాలూ పార్టీ ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నితీష్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. కాలక్రమంలో లాలూ-నితీష్ లమ హద్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో కూటమి నుంచి నితీష్ వైదొలిగారు. అనంతరం క్రమంగా నితీష్-బీజేపీ చేరువయ్యాయి. చివరకు బీజేపీ మద్దతుతో నితీష్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. మొదట్లో కూటమి ప్రయాణం సాఫీగా సాగినప్పటికీ కాలక్రమంలో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 2019 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 39 స్థానాలకు గాను నితీష్ పార్టీ 15, బీజేపీ 16, ఆర్జేడీ , కాంగ్రెస్ ఒక్కో స్థానంలో గెలిచాయి. బీజేపీ మిత్రపక్షమైన రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఆరు స్థానాలను సాధించాయి. నాటి ఎన్నికల్లో బీజేపీ దేశ వ్యాప్తంగా ప్రభంజనం చూపినప్పటికీ బీహార్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. దీనికి తోడు ఇటీవల మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఫలితాలు చేదు అనుభవాలను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఎన్నికలకు వెళితే నష్టపోతామన్న భయంతో బీజేపీ వ్యవహరిస్తోంది.

పైకి బింకంగానే….

దీనికితోడు ఇటీవల కాలంలో రెండు పార్టీల మధ్య విభేదాలు పెరిగాయి. నాయకుల మాటల తూటాలు పేలుస్తున్నారు. జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ బీజేపీని తూర్పారపడుతున్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్.పి.పి లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014లో బీజేపీని విజయతీరాలకు చేర్చడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర గణనీయం. అయినప్పటికీ కాలక్రమంలో ఆ పార్టీకి దూరమయ్యారు. నితీష్ కు బాగా చేరువయ్యారు. బీజేపీ వైపు నుంచి కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చే దమ్ము, ధైర్యం ఉందని పార్టీ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి సంజయ్ పాశ్వాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పాశ్వాన్ ను ప్రశంసిస్తూ ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ ప్రకటన చేశారు. సొంతంగానే ఎన్నికల బరిలోకి దిగాలని రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం భావిస్తోంది. నితీష్ హవా అంతగా లేదని, ఆయన ప్రజాకర్షణ శక్తిని కోల్పోయారని, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు గెలవలేకపోవడమే ఇందుకు నిదర్శనమని వారు వాదిస్తున్నారు. పార్టీ పొత్తులను మార్చడంలో అందె వేసిన చేయి అయిన నితీష్ మున్ముందు తమతో పొత్తును కాదనుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వారు చెబుతున్నారు. దీనికి తోడు అసెంబ్లీ ఎన్ినకల్లో సింహభాగం సీట్లు కావాలని నితీష్ పట్టుబడుతున్నారు. బీజేపీ జూనియర్ భాగస్వామి గా మాత్రమే ఉండాలని కోరుకుంటున్నారు. అయినప్పటికీ కమలం పార్టీ ఆయనతోనే కలసి నడవాలని భావిస్తుంది. కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News