నితీష్ కు గండం తప్పదా?

దేశంలో విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న అతి కొద్ది మంది నాయకులలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు మొదటగా చెప్పుకోవాలి. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. [more]

Update: 2019-09-14 17:30 GMT

దేశంలో విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న అతి కొద్ది మంది నాయకులలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు మొదటగా చెప్పుకోవాలి. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. 1970 దశకం నుంచి రాజకీయాల్లో ఉన్న నితీష్ ఎక్కడ వున్న తనదైన ముద్ర అటు పార్టీ పదవుల్లో ఇటు పరిపాలనతో చూపించారు. నితీష్ కుమార్ కేంద్రంలో పలు మార్లు మంత్రిగా పనిచేసి తన ప్రతిభ చాటుకున్నారు. మాజీ ప్రధాని వాజ్ పేయి కి ఇష్టుడిగా పేరు సంపాదించుకున్న నితీష్ కుమార్ ని తొలిసారి ముఖ్యమంత్రి చేసింది కూడా వాజ్ పేయి. 2000లో తొలిసారి సీఎం అయిన నితీష్ కుమార్ అప్పట్లో కేవలం ఏడు రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. మెజారిటీ లేకపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇక 2004 నుంచి కొంత విరామం తప్ప పదిహేనేళ్ళుగా ఆయన బీహార్ సీఎం గా పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది నవంబర్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి.

నితీష్ తప్పుకో ….

పదిహేనేళ్ల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక మీరు తప్పుకుని బీజేపీకి అవకాశం ఇవ్వండని లోక్ జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ నితీష్ ని ఓ విధంగా డిమాండ్ లాగానే చేశారు. మరో ఏడాదిలో జరగబోయే ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ, లోక్ జన శక్తి, బీజేపీ కలసి పోటీ చేయబోతున్న సందర్భం ఉంది. మరి ఈ కీలకమైన సమయంలో నితీష్ కుమార్ ని దిగిపోమ్మని రాం విలాస్ పాశ్వాన్ అన్నారంటే అది ఆయన గొంతు కాదని అంటున్నారు. ఆ గొంతు వెనక మోడీ, షా ఉన్నారని కూడా అంటున్నారు. నితీష్ కుమార్ రాజకీయ జీవితం మోడీ షాలతో పోలిస్తే చాలా సుదీర్ఘమైంది. అనేకసార్లు ఎంపీగా నెగ్గి కేంద్రంలో కీలకమైన పదవులు నిర్వహించిన చరిత్ర ఆయన‌ది. పైగా ఉత్తరభారతాన ఎదురులేని నేతగా ఉన్నారు. ఆయన ఎప్పటికైనా కేంద్రంలో పోటీకి వస్తారన్న ఆలోచన మోడీ, షాలకు ఉందని అంటారు.

నాటి వ్యతిరేకత కూడా….

ఇక మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన సందర్భంలో బీజేపీ నుంచి, ఎన్డీయే నుంచి కూడా విడిపోయి గట్టిగా మోడీని వ్యతిరేకించిన వారు నితీష్ కుమార్. ఆ తరువాత 2017లో ఆర్జేడీతో వచ్చిన విభేదాలు. లాలూ కొడుకు మీద వచ్చిన అవినీతి ఆరోపణలతో నితీష్ కుమార్ మహాఘటబంధన్ నుంచి తప్పుకుని మళ్ళీ బీజేపీతో కూటమి కట్టారు. ఇక 2019 ఎన్నికల ముందు కూడా మోడీ మళ్ళీ గెలవరన్న ఆలోచనతో ఆయన కొన్ని షాకింగ్ కామెంట్స్ మోడీ సర్కార్ కి వ్యతిరేకంగా చేశారు. ఇపుడు కేంద్రంలో బీజేపీ ఉన్నా కూడా నితీష్ కుమార్ పార్టీ మంత్రులు చేరలేదు. ఇవన్నీ ఇలా ఉంటే బీహార్లో ఇపుడు నితీష్ కి బీజేపీ తప్ప వేరే దారి లేదని మోడీ షా వ్యూహం. ఆయన్ని తప్పుకోమని ఈసారి బీజేపీ ముఖ్యమంత్రిని బీహార్లో కూర్చోబెట్టి ఆ ముచ్చట కూడా తీర్చుకోవాలని ఆరాటం. ఇక నితీష్ కుమార్ సమీప భవిష్యత్తులో ఎక్కడా పోటీ రాకుండా కూడా కట్టడి చేయాలన్న వ్యూహం కూడా ఉందని అంటున్నారు. మరి నితీష్ దీనికి లొంగుతారా..? ఆయన బీజేపీ పద్మవ్యూహాన్ని చేదించి మళ్ళీ బీహార్ ముఖ్యమంత్రిగా ఆరవసారి ప్రమాణం చేస్తారా. 2024 నాటికి కేంద్రం లో మోడీ షాలకు గట్టి ప్రత్యర్ధి అవుతారా అన్నది చూడాలి.

Tags:    

Similar News