ఏడోసారి సాధ్యమవుతుందా?

బీహార్ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ గెలిస్తే నితీష్ కుమార్ ఏడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి రికార్డు సృష్టించనున్నారు. అయితే అంత సులువు కాకపోయినప్పటికీ ఆయన ప్రయత్నాలు ఆయన [more]

Update: 2020-10-09 17:30 GMT

బీహార్ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ గెలిస్తే నితీష్ కుమార్ ఏడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి రికార్డు సృష్టించనున్నారు. అయితే అంత సులువు కాకపోయినప్పటికీ ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉన్నారు. నితీష్ కుమార్ అంటే బీహారీలకు ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆయన గెలుస్తూ వస్తున్నారు. తిరిగి అదే నమ్మకం మంత్రంతో నితీష్ కుమార్ ఎన్నికల బరిలోకి అడుగు పెడుతున్నారు. ఎన్డీఏ కూటమి ఇప్పటికే నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

నిరాడంబర నేత….

నితీష్ కుమార్ నిరాడంబర రాజకీయవేత్త. ఆయన భేషజాలకు పోరు. చాలా సింపుల్ జీవితం గడుపుతారు. ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో దిట్ట. అదే ఆయనను ఆరుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అందించింది. ఇక ఆయన మాట ఇస్తే తప్పరన్న నమ్మకం బీహారీల్లో ఉంది. గతంలో మద్యనిషేధం అమలు చేస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యనిషేధాన్ని ప్రకటించి సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.

విపక్షాలను విడదీయడంలో….

ఇక విపక్షాలను విడదీయడంలో కూడా నితీష్ కుమార్ నేర్పరి అంటున్నారు. ఇప్పటికే తమకు వ్యతిరేకంగా ఉన్న మహాకూటమిని నితీష్ కుమార్ ఛిన్నా భిన్నం చేయగలిగారు. మాజీ ముఖ్యమంత్రి మాంఝీని తన గూటికి రప్పించుకోగలిగారు. విపక్ష కూటమి వీక్ అయితే తన గెలుపు సులువవుతుందన్న ఆయన అంచనా ఎప్పుడూ వమ్ము కాలేదన్నది జేడీయూ నేతలు చెబుతున్నా మాట. ప్రత్యర్థి పార్టీల అవినీతి అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వారు డిఫెన్స్ లో పడేలా నితీష్ కుమార్ చేస్తున్నారు.

ప్రజలను ఆకట్టుకునేందుకు….

మరోవైపు ప్రజలను ఆకట్టుకునేందుకు సాత్ నిశ్చయ్ -2 ను లాంచ్ చేసేశారు. 2015లో సాత్ నిశ్చయ్ ద్వారానే నితీష్ కుమార్ అందలం అందుకోగలిగారు. ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం, వైద్య సౌకర్యాలను మరింత మెరుగుపర్చడంత, మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించడం, సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ సాత్ నిశ్చయ్ ను నితీష్ కుమార్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తికావడంతో మరోసారి సాత్ -2 పేరుతో మరో పథకాన్ని నితీష్ కుమార్ ప్రకటించారు. మొత్తం మీద నితీష్ కుమార్ తన విజయావకాశాలకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News