నిప్పు కన్నా ప్రమాదం..?
తెలుగు రాష్ట్రాల రాజకీయం రగిలిస్తున్న జలజగడం ఆరని కుంపటిగా మారుతోంది. హుజూరాబాద్ ఎన్నికను దృష్టిలో పెట్టుకుని అధికార తెలంగాణ రాష్ట్రసమితి ఈ వివాదాన్ని వెలికి తెచ్చిందని ప్రతిపక్ష [more]
తెలుగు రాష్ట్రాల రాజకీయం రగిలిస్తున్న జలజగడం ఆరని కుంపటిగా మారుతోంది. హుజూరాబాద్ ఎన్నికను దృష్టిలో పెట్టుకుని అధికార తెలంగాణ రాష్ట్రసమితి ఈ వివాదాన్ని వెలికి తెచ్చిందని ప్రతిపక్ష [more]
తెలుగు రాష్ట్రాల రాజకీయం రగిలిస్తున్న జలజగడం ఆరని కుంపటిగా మారుతోంది. హుజూరాబాద్ ఎన్నికను దృష్టిలో పెట్టుకుని అధికార తెలంగాణ రాష్ట్రసమితి ఈ వివాదాన్ని వెలికి తెచ్చిందని ప్రతిపక్ష పార్టీలు తొలి దశలో ఆరోపించాయి. తాము వెనకబడకూడదన్న యావలో విపక్షాలు సరికొత్త డిమాండ్లను పెడుతున్నాయి. అగ్నిగుండం మరింత ప్రజ్వరిల్లేందుకు తమ వంతు ఆజ్యం పోస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ సైతం క్రమేపీ స్వరం పెంచడం మొదలు పెట్టింది. ప్రధానమంత్రిని, జలవనరుల శాఖ మంత్రిని, న్యాయస్తానాలను ఆశ్రయిస్తూ ఉపశమనం పొందాలని చూస్తోంది. అయితే రాజకీయ పోరాటానికి మాత్రం ఇంకా ఏపీ సిద్దం కాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రికి, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు ఉన్న వెసులుబాటు ఏపీలోని అధికార, విపక్ష అగ్రనేతలకు లేదు. దాంతో ఇంకా వీధి పోరాటాలు, సవాళ్ల స్థాయికి ఉద్రిక్తత చేరలేదు. అయితే ఇదే ధోరణి దీర్ఘకాలం ఉంటుందని చెప్పలేం. అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా ఎప్పుడో ఒకప్పుడు బరస్ట్ కాకతప్పని పరిస్థితి ఏర్పడుతోంది. నీటితో వివాదాలు నిప్పు కంటే ప్రమాదకరమైనవి. అందువల్ల కృష్ణా జలాల పంపిణీ శాశ్వత సమస్యగా పరిణమించే ప్రమాదం కానవస్తోంది.
ఏపీ సన్నాయి నొక్కులు…
ఆంధ్రప్రదేశ్ అగ్రనాయకులకు ఆర్థిక బలహీనత వెన్నాడుతోంది. అటు చంద్రబాబు నాయుడి ఆర్థిక మూలమైన హెరిటేజ్ ప్రధాన కార్యాలయాలు, ఆయన నివాసం సహా హైదరాబాదులోనే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుటుంబ వ్యాపార కార్యకలాపాల ప్రధాన కేంద్రమూ హైదరాబాదే. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రముఖులు చాలామందికి వ్యాపారాలు, పరిశ్రమలు భాగ్యనగరంతోనే ముడిపడి ఉన్నాయి. పరిపాలన కేంద్రం అమరావతికి తరలి వెళ్లిందే మినహా ప్రయివేటు వ్యాపార , వ్యవహారాలు ఇక్కడి నుంచి ఎవరూ తరలించలేదు. దాంతో ఏరికొరి తెలంగాణ ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడానికి నాయకులెవరూ సిద్దం గా లేరు. మన ప్రజలు అక్కడ ఉన్నారనే సాకును చూపుతున్నారు. ఓటర్లుగా తెలంగాణలో ఉన్న సీమాంధ్ర మూలాలు ఉన్న ప్రజల బాగోగులు చూసుకోవాల్సింది ఇక్కడి ప్రభుత్వమే. అంతే తప్ప ఏపీ ప్రభుత్వానికి సంబంధం ఉండదు. వాళ్లు ఇక్కడి ఓటర్లు. ఏ రాజకీయ పార్టీ అయినా తమ ఓటర్లను కాదనుకునే అవకాశమే లేదు. అందువల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలు న్యాయబద్ధమైనంతవరకూ తామే చూసుకోవాలి. అంతేకానీ తెలంగాణలో మన ప్రజలు అనే ముసుగు వేయడం అర్ధ రహితం. సన్నాయి నొక్కులే తప్ప సత్యం మాత్రం కాదు. ఇటీవల హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలో సీమాంధ్రులు నివసించే ప్రాంతాల్లోనే టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే అక్కడి నాయకుల వాదనల్లోని డొల్లతనం తేటతెల్లమవుతుంది.
ప్రమాదకర డిమాండ్లు…
మరో వైపు తెలంగాణలో కేసీఆర్ సెగ రాజేసిన నిప్పు మళ్లీ తనకే అంటుకునే ప్రమాదం కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెసు నాయకులు కొత్త డిమాండ్లు తెస్తూ టీఆర్ఎస్ పై ఆధిక్యానికి ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ వెనక్కి వెళ్లలేని పరిస్థితి కల్పిస్తున్నారు. మూడింట రెండు వంతుల కృష్ణానదీ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంది. అందువల్ల అసలు 811 టీఎంసీల్లో అయిదు వందల టీఎంసీలు ఈ రాష్ట్రానికే చెందాలని బీజేపీ పట్టుబడుతోంది. సగం, సగం నిష్పత్తిలో పంచుకోవాలన్న కేసీఆర్ వాదనకు ఇది మరో కోణం. 2015లో కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలోనే ఇరు రాష్ట్రాల మంత్రులు నీటి పంపకాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ కేంద్రమే నాయకత్వం వహించాలి. కానీ తాజా పరిస్థితుల్లో శాంతంగా చర్చించేందుకు తెలంగాణ అంగీకరించే వాతావరణమే లేదు. కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి మరో విచిత్రమైన డిమాండ్ ముందుకు తెచ్చారు. కేసీఆర్, కేటీఆర్ లు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలని, తాము మద్దతు ఇస్తామంటూ ప్రతిపాదించారు. ఆచరణ సాధ్యం కాని ఈ వింత వాదనతో టీఆర్ఎస్ ను, బీజేపీని ఇరుకున పెట్టాలనేది ఆయన ఆంతర్యం. ఒకవేళ రేవంత్ చొరవ తీసుకుని తెలంగాణ హక్కులు అనే పేరిట ఢిల్లీలో గలాటా చేస్తే టీఆర్ఎస్ ఇరకాటంలో పడుతుంది. ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారుతుంది. రేవంత్ ను సమర్థించలేదు. అలాగని మౌనం వహిస్తే ప్రజల్లో అధికార పార్టీ పలచన అవుతుంది.
పెద్దల మౌనం వెనక…
ఇరు రాష్ట్రాలు రాజకీయం చేస్తున్నాయి. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. వాస్తవాలేమిటో తేల్చే అస్త్రాలు కేంద్రం వద్ద ఎన్నో ఉన్నాయి. ఆరోపణలు వచ్చిన ప్రాజెక్టులు, అంశాలన్నిటిపైనా కృష్టా రివర్ బోర్డు పరిశీలన చేసి ప్రత్యక్ష సందర్శనంతో నిగ్గు తేలిస్తే సరిపోతుంది. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ తమ రాష్ట్రాల్లో బోర్డు పర్యటించడానికి సుముఖంగా లేవు. అంటే ఏదో పితలాటకం ఉంది. పోతిరెడ్డి పాడు విస్తరణ లేదు. కేవలం ప్రవాహ వేగాన్ని మాత్రమే పెంచుతున్నామంటోంది ఏపీ ప్రభుత్వం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు తనిఖీలకు అంగీకరించాలని పట్టుబడుతోంది తెలంగాణ ప్రభుత్వం. గుప్పెట మూసి ఉంచి రాజకీయ వివాదాలతో కాల క్షేపం చేయడం కంటే మొత్తంగా ఆరోపణలున్న ప్రాజెక్టులన్నిటినీ విచారణ పరిధిలోకి తేవడం ఉత్తమం. తాత్కాలిక ప్రయోజనాల కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టుకుంటున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారాన్ని కేంద్రమే చూపాలి. అయితే బీజేపీ పెద్దలు సైతం ఈ గొడవలో తమకు కలిసి వచ్చే అంశాలేమిటనే లెక్కల్లో మునిగి తేలుతున్నారు. అందుకే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ సంగతి దేవుడెరుగు, కనీసం కామాలు కూడా ఉండకపోవచ్చుననిపిస్తోంది.
-ఎడిటోరియల్ డెస్క్