నమ్మకం కోల్పోయారు….!!
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప నమ్మకాన్ని కోల్పోయారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వరసగా ఆపరేషన్ కమలను ప్రారంభించి ఫెయిలవుతున్న యడ్యూరప్ప చివరి [more]
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప నమ్మకాన్ని కోల్పోయారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వరసగా ఆపరేషన్ కమలను ప్రారంభించి ఫెయిలవుతున్న యడ్యూరప్ప చివరి [more]
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప నమ్మకాన్ని కోల్పోయారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వరసగా ఆపరేషన్ కమలను ప్రారంభించి ఫెయిలవుతున్న యడ్యూరప్ప చివరి అవకాశాన్ని కూడా చేజార్చుకున్నారు. లోక్ సభ ఎన్నికల వరకూ ఇక యడ్యూరప్ప ప్రయత్నాలు ఫలించవనే చెప్పాలి. ఎందుకంటే ఆయనను నమ్మి ఇక కాంగ్రెస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు దాదాపుగా లేరనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం యడ్యూరప్ప స్వయంకృతాపరాధమే.
వరుస వైఫల్యాలతో…..
యడ్యూరప్ప రాజకీయ దురంధరుడిగా పేరు. కర్ణాటక రాజకీయాల్లో ఒక సామాజిక వర్గం నేతగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యడ్యూరప్ప సంకీర్ణ సర్కార్ ను పడగొట్టడంలో విఫలమయ్యారు. నిజానికి అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్ లోని కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పార్టీల్లో అసంతృప్తులకు కొదవలేదు. కుమారస్వామి వైఖరి పట్ల విసుగు చెందిన వారు కొందరైతే.. కాంగ్రెస్ అధిష్టానం వ్యవహార శైలి కూడా కొందరిని అసంతృప్తికి గురి చేసింది. మంత్రి వర్గ విస్తరణ కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు. కాంగ్రెస్ హైకమాండ్ తమకు అన్యాయం చేసిందన్న భావనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాదాపు ఇరవై మంది వరకూ ఉన్నారన్నది వాస్తవం.
షరతులే కొంపముంచాయా…?
అయితే కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలను తమ దరికి చేర్చుకునేందుకు యడ్యూరప్ప ఫెయిలయ్యారన్నది వాస్తవం. యడ్యూరప్ప ఫెయిలవ్వడానికి ఒకకారణం ఆయన వ్యూహం లోపం కాగా, మరొకటి కేంద్ర నాయకత్వమని చెప్పక తప్పదు. యడ్యూరప్పకు ఆపరేషన్ కమల్ కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం, అసంతృప్త ఎమ్మెల్యేలకు స్పష్టమైన హామీలు లభించకపోవడంతో కొందరు వెనక్కు తగ్గారని తెలిసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని, తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో గెలుపు బాధ్యతను తీసుకుంటామన్న స్పష్టమైన హామీ కూడా వారికి లభించకపోవడంతో వారు బీజేపీ గూటికి చేరుకోలేదన్న ప్రచారం జరుగుతుంది.
ఆ…నలుగురూ……
అందుకే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న నలుగురు ఎమ్మెల్యేలు కూడా తిరిగి కాంగ్రెస్ పక్షాన చేరక తప్పే పరిస్థితి ఏర్పడింది. అసంతృప్త ఎమ్మెల్యేలు రమేష్ జార్ఖిహోళి, ఉమేష్ జాదవ్, మహేష్ కుమటహళ్లి, నాగేంద్ర లు గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు, శాసనసభ సమావేశాలకూ దూరంగా ఉంటున్నారు. మరోసారి యడ్యూరప్ప ఫెయిల్ అవ్వడంతో వీరు మనసు మార్చుకుని శాసనసభకు హాజరయ్యారు. ఈ నలుగురిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కు లేఖ ఇచ్చింది. అనర్హత వేటు పడుతుందేమోనన్న భయంతోనే వీరు శాసనసభకు హాజరయ్యారన్నది వాస్తవం. అనర్హత వేటు విషయాన్ని పక్కన పెడితే నిన్న మొన్నటి వరకూ కమలానికి అండగా ఉన్న ఆ నలుగురూ కూడా ఆపరేషన్ కమల ఫెయిల్ కావడంతో తిరిగి స్వగృహ ప్రవేశం చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. మొత్తం మీద యడ్యూరప్ప అసంతృప్త ఎమ్మెల్యేల నమ్మకాన్ని కోల్పోయారన్నది నిజం.