ys jagan chandrababu : తాకట్టు పెట్టేశారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎవరూ మార్చలేరు. ఇక్కడ అధికార, విపక్షాల మధ్య ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం అనేది సాధ్యం కాదన్నది స్పష్టమైంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ అధికార, విపక్ష [more]

Update: 2021-09-24 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎవరూ మార్చలేరు. ఇక్కడ అధికార, విపక్షాల మధ్య ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం అనేది సాధ్యం కాదన్నది స్పష్టమైంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ అధికార, విపక్ష పార్టీలు ఏకం కావడం లేదు. పైగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి నెలకొంది. ఇతర రాష్ట్రాల్లో చూస్తే ఈ పరిస్థితి లేదు. అనేక విషయాల్లో విపక్షాలు అధికార పార్టీతో కలిసి తమ ప్రయోజనాలను పరిరక్షించుకునే దిశగా పయనిస్తున్నాయి.

కేరళలో….

కేరళలో కమ్యునిస్టు ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఎన్నికల తర్వాత అక్కడ విపక్షాలన్నీ ఏకమయ్యాయి. జీఎస్టీ ని సాధించుకోవడంలోనూ, ప్రభుత్వ సంస్థల పరిరక్షణ విషయంలోనూ కేరళ ప్రభుత్వానికి అక్కడ విపక్షాలు అండగా నిలిచాయి. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరంచేస్తున్నా అక్కడ ప్రభుత్వం చూస్తూ ఊరుకోలేదు. తామే ముందుకు వచ్చి బీహెచ్ఈఎల్ వంటి సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.

సొంత ప్రయోజనాలకే…

కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అధికార, విపక్షాలకు సొంత రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలను కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక పోలవరం వంటి ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా విపక్షం అధికారపక్షంతో గొంతు కలపడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరిస్తున్నా అధికార, విపక్షాలు చోద్యం చూస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వానికి….

వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందడానికే ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే ప్రత్యేక హోదా వంటి వాటిని కూడా ఇరు పార్టీలు పక్కన పెట్టేశాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. అధికార, విపక్ష పార్టీలు రెండు కేంద్ర ప్రభుత్వం అడుగులకు మడుగులు ఒత్తుతూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయని మాత్రం చెప్పొచ్చు. ఇప్పటికైనా కేరళ వంటి రాష్ట్రాలను చూసైనా అధినేతలు నేర్చుకోవాలన్న సూచనలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News