లాబీయింగ్ పనిచేసినట్లుందే

పోలవరం ప్రాజెక్ట్ గత దశాబ్ద కాలంగా గోలవరం గా మారిపోయింది. 2007 లో వైఎస్ ఈ ప్రాజెక్ట్ ను ఎలాంటి అనుమతులు లేకుండా మొదలు పెట్టి ఒక్కో [more]

Update: 2019-07-16 09:30 GMT

పోలవరం ప్రాజెక్ట్ గత దశాబ్ద కాలంగా గోలవరం గా మారిపోయింది. 2007 లో వైఎస్ ఈ ప్రాజెక్ట్ ను ఎలాంటి అనుమతులు లేకుండా మొదలు పెట్టి ఒక్కో పర్మిషన్ సాధించుకుంటూ వచ్చారు. ఆయన మరణించే ముందు వరకు తినేశారు తినేశారు అంటూ గగ్గోలు పెట్టింది టిడిపి. ఆయన కాలం చేశారు. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన వివాదాలతో నే కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు.

విభజన తరువాత జాతీయ ప్రాజెక్టుగా …

విభజన జరిగింది. టిడిపి అధికారంలోకి వచ్చింది. అంతకు ముందే కాంగ్రెస్ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి తాంబూలాలు ఇచ్చేసింది. ఇక కేంద్రంలోని బిజెపి, రాష్ట్రం లోని టిడిపి సర్కార్ లు పోలవరాన్ని సాయం పట్టారు. ఈ రెండు ప్రభుత్వాలు మరో రెండేళ్లపాటు పోలవరాన్ని మొదలే పెట్టలేదు. మొత్తానికి జనం ఛీ కొడతారని గ్రహించి మొత్తానికి 2017 లో పనులను వేగవంతం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టిడిపి కి ప్రజలకు చూపేందుకు పోలవరానికి మించి ఏమి కనపడలేదు. దాంతో ప్రచార అస్త్రంగా మారింది పోలవరం.

ప్రాజెక్ట్ క్రెడిట్ కోసం ….

మరో పక్క కేంద్రానికి ఏ మాత్రం ప్రాజెక్ట్ లో ఎలాంటి క్రెడిట్ దక్కడం లేదని గమనించి టిడిపి ప్రాజెక్ట్ ను అవినీతిమయం చేసేసిందంటూ కింది స్థాయి నుంచి ప్రధాని వరకు పోలవరం కేంద్రం గా రాజకీయ ఆరోపణలకు దిగింది బిజెపి. ప్రధాని స్థాయిలో వున్న నరేంద్ర మోడీ సైతం ఏటీఎం కార్డు లా పోలవరం నిధులను సాంతం టిడిపి నాకేస్తోందని తీవ్ర వ్యాఖ్యలే ఎన్నికల ప్రచార సభల్లో చేశారు. ఇక పోలవరం అంశంలో వైసిపి తొలి నుంచి టిడిపి తినేస్తుందంటూ గగ్గోలు పెడుతూనే వచ్చింది.

వైసిపి అధికారంలోకి వచ్చాక ….

ఎన్నికల తరువాత టిడిపి పోయి వైసిపి అధికారంలోకి వచ్చేసింది. సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు వైసిపి తాను చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. పోలవరం పై అన్ని తవ్వి తీసేపనిలో పడింది. బిజెపి ఎపి నేతలు పోలవరం ప్రాజెక్ట్ లో టిడిపి బాగా తినేసిందనే అంటుంది.

అవకతవకలు లేవబ్బా ….

ఇక్కడి వరకు బానే వుంది. పోలవరం అవకతవకలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తమ పార్టీ సందేహాలను ప్రశ్నలుగా కేంద్రం ముందు ఉంచారు. పోలవరం లో అవకతవకలు నిజమా కాదా అని నిలదీశారు. అయితే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆబ్బే అలాంటివి ఏమి లేవనేశారు. ఈ తినివేతపై తమకేమి ఫిర్యాదులు లేవని సిబిఐ వంటి విచారణ అవసరం లేదని తేల్చేశారు.

అంతా తినేశారంటున్న ….

అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసే సమయంలోనే బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు పోలవరం లో టిడిపి చేసినవన్నీ అక్రమాలు అవినీతి అంటూ పాత పాట మరోసారి పాడారు. ఒక పక్క పార్లమెంట్ లో పోలవరం లో ఏమి జరగలేదని కేంద్ర మంత్రి చెబుతుంటే మరోపక్క ఆ పార్టీ రాష్ట్ర నేతలు అంతా మింగేశారనడంతో ఏది నిజం అన్నది తెలియక స్వయంగా బిజెపి శ్రేణులే అయోమయానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. మాజీ సర్కార్ ను కేంద్రం వెనకేసుకు రావడం వెనుక టిడిపి లాబీయింగ్ గట్టిగానే వర్క్ అవుట్ అయినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం నడుస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారంలో బిజెపి కె క్లారిటీ లేకపోతే ఇక ప్రజలకు ఈ అయోమయం రుద్దడం ఎవరి ప్రయోజనాలకో తెలియాలి అంటున్నారు ఎపి వాసులు.

Tags:    

Similar News